IND vs SL: స్పిన్ యుద్ధంలో గెలిచి ఫైనల్‌కు భారత్
హోరాహోరీ తప్పదనుకున్న పాకిస్థాన్ మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చిన టీమ్‌ఇండియాకు.. తేలిగ్గా గెలుస్తుందనుకున్న మ్యాచ్‌లో శ్రీలంక నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పలేదు.
మరోసారి కుల్‌దీప్ మాయ
పోరాడిన వెల్లలాగె
లంకపై చెమటోడ్చి నెగ్గిన టీమ్‌ఇండియా
కొలంబో
హోరాహోరీ తప్పదనుకున్న పాకిస్థాన్ మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చిన టీమ్‌ఇండియాకు.. తేలిగ్గా గెలుస్తుందనుకున్న మ్యాచ్‌లో శ్రీలంక నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పలేదు. స్పిన్నర్ల స్వర్గధామంగా మారిన కొలంబో పిచ్‌ను గొప్పగా ఉపయోగించుకున్న లంకేయులు భారత బ్యాటర్లకు గట్టి సవాలే విసిరారు. ఇన్నింగ్స్‌ను ఘనంగా మొదలుపెట్టి 300 పైచిలుకు స్కోరు చేసేలా కనిపించిన టీమ్‌ఇండియాను.. యువ స్పిన్నర్ వెల్లలాగె, పార్ట్‌టైమర్ అసలంక కొలంబో పిచ్‌పై డ్యాన్స్ చేయించి, 213 పరుగులకే పరిమితమయ్యేలా చేశారు. బౌలింగ్‌లోనూ భారత్‌కు అదిరే ఆరంభం దక్కినా.. లంక అంత తేలిగ్గా వదిలితేనా! గత మ్యాచ్ హీరో కుల్‌దీప్ యాదవ్ మరోసారి విజృంభించడంతో భారత్ గట్టెక్కేసింది. సూపర్-4లో వరుసగా రెండో విజయం సాధించిన భారత్ ఆసియా కప్ ఫైనల్లో ప్రవేశించింది.
ఆసియా కప్ వన్డే టోర్నీలో అజేయంగా సాగిపోతున్న టీమ్‌ఇండియా.. సూపర్-4లో మరో విజయం సాధించి ఫైనల్ బెర్తును పట్టేసింది. మంగళవారం రోహిత్‌సేన 41 పరుగుల తేడాతో ఆతిథ్య శ్రీలంకను ఓడించింది. మొదట దునిత్ వెల్లలాగె (5/40), అసలంక (4/18)ల ధాటికి భారత్ 213 పరుగులకే ఆలౌటైంది. రోహిత్ శర్మ (53; 48 బంతుల్లో 7×4, 2×6) జట్టుకు అదిరే ఆరంభాన్నిచ్చినా.. ఆ తర్వాత ఇన్నింగ్స్ గాడి తప్పింది. అనంతరం కుల్‌దీప్ యాదవ్ (4/43) విజృంభణతో లంక 41.3 ఓవర్లలో 172 పరుగులకే ఆలౌటైంది. బుమ్రా (2/30), జడేజా (2/33) కూడా సత్తా చాటారు. వెల్లలాగె (42 నాటౌట్; 46 బంతుల్లో 3×4, 1×6) బ్యాటింగ్‌లోనూ సత్తా చాటాడు. ధనంజయ డిసిల్వా (41) రాణించాడు. భారత్ తన చివరి సూపర్-4 మ్యాచ్‌లో శుక్రవారం బంగ్లాదేశ్‌ను ఢీకొంటుంది. అంతకంటే ముందు గురువారం కీలక పోరులో పాక్, లంక తలపడతాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్లో భారత్‌ను ఢీకొంటుంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే మెరుగైన రన్‌రేట్ కలిగిన శ్రీలంక ఫైనల్ చేరుతుంది.
భయపెట్టిన ఆ ఇద్దరూ..: భారత్ ఇన్నింగ్స్‌లో స్పిన్నర్ల ఆధిపత్యం చూశాక.. ఆరంభం నుంచే రోహిత్ స్పిన్ దాడి మొదలుపెడతాడేమో అనిపించింది. కానీ అతను బుమ్రా, సిరాజ్‌లనే దించాడు. వాళ్లిద్దరూ లంక బ్యాటర్లను బాగానే ఇబ్బంది పెట్టారు. బుమ్రా.. స్వల్ప వ్యవధిలో నిశాంక (6), కుశాల్ మెండిస్ (15)లను పెవిలియన్ చేర్చాడు. కరుణరత్నె (2)ను సిరాజ్ పెవిలియన్ బాట పట్టించాడు. పేసర్ల బౌలింగ్‌కే లంక బ్యాటర్లు నిలవలేకపోతున్నారంటే, స్పిన్నర్లు దిగితే ఇంకెలా ఉంటుందో అనుకుంటే.. అసలంక (22), సమరవిక్రమ (17).. కుల్‌దీప్, జడేజాలను బాగానే ఎదుర్కొన్నారు. ఈ జోడీ పది ఓవర్లకు పైగా వికెట్ల పతనాన్ని అడ్డుకుంది. లంక 25/3 నుంచి 68/3కు చేరుకుంది. లక్ష్యం చిన్నదే కావడంతో భారత్‌లో కంగారు మొదలైంది. అయితే ఈ దశలోనే కుల్‌దీప్ మాయాజాలం మొదలైంది. అతను వరుస ఓవర్లలో సమరవిక్రమ, అసలంకలను ఔట్ చేసి లంకను గట్టి దెబ్బ తీశాడు. శానక (9)ను జడేజా ఔట్ చేయడంతో లంక పనైపోయినట్లే కనిపించింది. కానీ 99/6తో పతనం దిశగా సాగుతున్న లంకలో ధనంజయ, వెల్లలాగే మళ్లీ ఆశలు రేపారు. ఈ జోడీ కొంతసేపు ఆచితూచి ఆడి, ఆ తర్వాత ఎదురుదాడి చేయడంతో లక్ష్యం కరుగుతూ వచ్చింది. 4 వికెట్లు చేతిలో ఉండగా 13 ఓవర్లలో 57 పరుగులే చేయాల్సి రావడంతో భారత్‌కు కష్టమే అనిపించింది. కానీ ధనంజయను ఔట్ చేసి జడేజా మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. వెల్లలాగె మాత్రం పోరాటాన్ని కొనసాగించాడు. అయితే మరో ఎండ్‌లో బ్యాటర్లను భారత్ నిలవనీయలేదు. తీక్షణ (2)ను హార్దిక్ పెవిలియన్ చేర్చగా.. రజిత (1), పతిరన (0)లను ఒకే ఓవర్లో అద్భుతమైన డెలివరీలతో బౌల్డ్ చేసిన కుల్‌దీప్ లంక కథ ముగించాడు.
అతనొచ్చాక కథ మారింది: 80/0.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 11 ఓవర్లకు చేసిన స్కోరిది. కెప్టెన్ రోహిత్ శర్మ జట్టును ముందుండి నడిపిస్తూ.. లంక బౌలింగ్‌ను ధాటిగా ఎదుర్కోవడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. మరో ఎండ్‌లో శుభ్‌మన్ (19) ఆచితూచి బ్యాటింగ్ చేశాడు. పాక్‌తో మ్యాచ్‌లో మాదిరే ఇన్నింగ్స్ సాగడంతో భారత్ మరోసారి భారీ స్కోరు సాధించడం ఖాయమనిపించింది. కానీ యువ స్పిన్నర్ వెల్లలాగె బంతి అందుకోగానే కథ మారిపోయింది. పేసర్లను అలవోకగా ఎదుర్కొన్న భారత బ్యాటర్లు.. అతడి ధాటికి కంగారెత్తిపోయారు. తన తొలి బంతికే శుభ్‌మన్‌ను బౌల్డ్ చేయడంతో మొదలైన వెల్లలాగె మాయ.. కోటాలో చివరి బంతి వరకు కొనసాగింది. గత మ్యాచ్ సెంచరీ హీరో కోహ్లి (3).. వెల్లలాగె రెండో ఓవర్లో పేలవ షాట్ ఆడి శానకకు క్యాచ్ ఇవ్వగా, అర్ధశతకం పూర్తి చేసి జోరుమీదున్న రోహిత్ సైతం అతడి బౌలింగ్‌లోనే బౌల్డయి వెనుదిరిగాడు. 93/3తో ఒక్కసారిగా కష్టాల్లో పడిన భారత్‌ను.. ఇషాన్ (33)తో కలిసి రాహుల్ ఆదుకున్నాడు. ఇదే మైదానంలో ముందు రోజు పాక్‌పై అలవోకగా పరుగులు సాధించిన రాహుల్.. ఈ మ్యాచ్‌లో మాత్రం కష్టపడక తప్పలేదు. పిచ్ అంత కఠినంగా మారింది. రాను రాను బంతి మరింత తిరగడంతో స్పిన్నర్లను ఎదుర్కోవడం శక్తికి మించిన పనే అయింది. అయినా ఈ జోడీ కష్టపడి స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లింది. 30వ ఓవర్లో 154/3తో భారత్ మెరుగైన స్థితికి చేరుకుంది. కానీ స్కోరు వేగం పెంచే ప్రయత్నంలో వెల్లలాగె బౌలింగ్‌లో షాట్ ఆడబోయి అతడికే క్యాచ్ ఇచ్చి రాహుల్ వెనుదిరగడంతో మ్యాచ్ మళ్లీ మలుపు తిరిగింది. కాసేపటికే అసలంక బౌలింగ్‌లో వెల్లలాగె పట్టిన చక్కటి క్యాచ్‌కు ఇషాన్ కూడా ఔటైపోయాడు. పిచ్ స్పిన్ స్వర్గధామంలా మారడంతో పార్ట్‌టైమర్ అయిన అసలంకను దించి లంక కెప్టెన్ శానక చక్కటి ఫలితం రాబట్టాడు. ఇషాన్‌నే కాక జడేజా (4), బుమ్రా (5), కుల్‌దీప్ (0)లను కూడా అసలంక పెవిలియన్ చేర్చాడు. అతను అంతకంటే ముందు హార్దిక్ (5)ను ఔట్ చేసిన వెల్లలాగె అయిదు వికెట్ల ఘనత పూర్తి చేశాడు.బంతి గింగిరాలు తిరుగుతున్న పిచ్‌పై రెండు వైపులా స్పిన్నర్లను ఎదుర్కోవడం బ్యాటర్లకు చాలా కష్టమైపోయింది. ఒక దశలో 186/9కు చేరుకున్న భారత్.. అక్షర్ పటేల్ పోరాటంతో 200 దాటింది.
150
వన్డేల్లో కుల్‌దీప్ వికెట్లు. అతడికిది 87వ మ్యాచ్.
వన్డేల్లో టీమ్‌ఇండియా పదికి పది వికెట్లూ స్పిన్నర్లకే కోల్పోవ్వడం ఇదే తొలిసారి.
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (బి) వెల్లలాగె 53; శుభ్‌మన్ (బి) వెల్లలాగె 19; కోహ్లి (సి) శానక (బి) వెల్లలాగె 3; ఇషాన్ (సి) వెల్లలాగె (బి) అసలంక 33; రాహుల్ (సి) అండ్ (బి) వెల్లలాగె 39; హార్దిక్ (సి) కుశాల్ (బి) వెల్లలాగె 5; జడేజా (సి) కుశాల్ (బి) అసలంక 4; అక్షర్ పటేల్ (సి) సమరవిక్రమ (బి) తీక్షణ 26; బుమ్రా (బి) అసలంక 5; కుల్‌దీప్ (సి) ధనంజయ (బి) అసలంక 0; సిరాజ్ నాటౌట్ 5; ఎక్స్‌ట్రాలు 21
మొత్తం: (49.1 ఓవర్లలో ఆలౌట్) 213;
వికెట్ల పతనం: 1-80, 2-90, 3-91, 4-154, 5-170, 6-172, 7-178, 8-186, 9-186; బౌలింగ్: రజిత 4-0-30-0; తీక్షణ 9.1-0-41-1; శానక 3-0-24-0; పతిరన 4-0-31-0; వెల్లలాగె 10-1-40-5; ధనంజయ డిసిల్వా 10-0-28-0; అసలంక 9-1-18-4
శ్రీలంక ఇన్నింగ్స్: నిశాంక (సి) రాహుల్ (బి) బుమ్రా 6; కరుణరత్నె (సి) గిల్ (బి) సిరాజ్ 2; కుశాల్ మెండిస్ (సి) సూర్యకుమార్ (బి) బుమ్రా 15; సమరవిక్రమ (స్టంప్డ్) రాహుల్ (బి) కుల్‌దీప్ 17; అసలంక (సి) రాహుల్ (బి) కుల్‌దీప్ 22; ధనంజయ (సి) గిల్ (బి) జడేజా 41; శానక (సి) రోహిత్ (బి) జడేజా 9; వెల్లలాగె నాటౌట్ 42; తీక్షణ (సి) సూర్యకుమార్ (బి) హార్దిక్ 2; రజిత (బి) కుల్‌దీప్ 1; పతిరన (బి) కుల్‌దీప్ 0; ఎక్స్‌ట్రాలు 15
మొత్తం: (41.3 ఓవర్లలో ఆలౌట్) 172;
వికెట్ల పతనం: 1-7, 2-25, 3-25, 4-68, 5-73, 6-99, 7-162, 8-171, 9-172; బౌలింగ్: బుమ్రా 7-1-30-2; సిరాజ్ 5-2-17-1; హార్దిక్ 5-0-14-1; కుల్‌దీప్ యాదవ్ 9.3-0-43-4; జడేజా 10-0-33-2; అక్షర్ పటేల్ 5-0-29-0
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
పవన్ పర్యటన నేపథ్యంలో.. అర్ధరాత్రి హడావుడిగా రహదారి పనులు!
-
పసుపు బోర్డు ప్రకటన వచ్చె.. ఈ రైతు కాళ్లకు చెప్పులు తెచ్చె
-
ఎత్తిపోసేందుకు.. తెచ్చిపోశారు
-
ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని ఎంబీఏ విద్యార్థిని బలవన్మరణం
-
Bandaru Satyanarayana: మాజీ మంత్రి బండారు నివాసం వద్ద అర్ధరాత్రి భారీగా పోలీసుల మోహరింపు
-
Rathika Rose: రతికా రోజ్ ఎలిమినేట్.. బద్దలైన యువ హృదయాలు..