సంక్షిప్త వార్తలు (5)

ప్రపంచ మాజీ నంబర్‌వన్‌, స్టార్‌ ఆటగాడు నొవాక్‌ జకోవిచ్‌.. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కు సన్నాహాలు మొదలుపెట్టనున్నాడు. పదో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌  టైటిల్‌పై కన్నేసిన జకోవిచ్‌.. అడిలైడ్‌ ఇంటర్నేషనల్‌ టోర్నీతో 2023 సీజన్‌కు శ్రీకారం చుట్టనున్నాడు.

Published : 08 Dec 2022 02:59 IST

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కు జకోవిచ్‌ సన్నాహాలు

మెల్‌బోర్న్‌: ప్రపంచ మాజీ నంబర్‌వన్‌, స్టార్‌ ఆటగాడు నొవాక్‌ జకోవిచ్‌.. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కు సన్నాహాలు మొదలుపెట్టనున్నాడు. పదో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌  టైటిల్‌పై కన్నేసిన జకోవిచ్‌.. అడిలైడ్‌ ఇంటర్నేషనల్‌ టోర్నీతో 2023 సీజన్‌కు శ్రీకారం చుట్టనున్నాడు. కొవిడ్‌ టీకా వేసుకోకుండా ప్రత్యేక అనుమతితో ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన  జకోవిచ్‌ వీసాను  ఆ దేశ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఇటీవలే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న  ఆస్ట్రేలియా అతనికి వీసా మంజూరు చేసింది. దీంతో వచ్చే ఏడాది  జనవరి 1న       ప్రారంభమయ్యే అడిలైడ్‌ ఇంటర్నేషల్‌ టోర్నీలో జకోవిచ్‌ బరిలో దిగుతున్నాడు.


ప్లేఆఫ్స్‌లో తమిళ్‌ తలైవాస్‌

ఈనాడు, హైదరాబాద్‌: ప్రొ కబడ్డీలో తమిళ్‌ తలైవాస్‌ ప్లేఆఫ్స్‌కు అర్హత పొందింది. బుధవారం ఆ జట్టు 43-28 పాయింట్ల తేడాతో యూపీ యోధాస్‌ను చిత్తు చేసింది. కీలక మ్యాచ్‌లో నరేందర్‌ (10), ఆజింక్య పవార్‌ (9) సత్తా చాటారు. 10 విజయాలు, 4 టైలతో మొత్తం 66 పాయింట్లతో తమిళ్‌ తలైవాస్‌ ప్లేఆఫ్స్‌ బెర్తు దక్కించుకుంది. జైపుర్‌, పుణెరి, బెంగళూరు బుల్స్‌, యూపీ యోధాస్‌ ఇప్పటికే ప్లేఆప్స్‌కు చేరుకున్నాయి. ఆఖరి బెర్తు కోసం దబాంగ్‌ దిల్లీ (60), గుజరాత్‌ జెయింట్స్‌ (56) మధ్య పోటీ ఉంది. బుధవారం జరిగిన మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్‌ 57-44 తేడాతో పట్నా పైరేట్స్‌ను ఓడించింది.


ఈశ్వరన్‌ అజేయ శతకం

సైలెట్‌: కెప్టెన్‌, ఓపెనర్‌ అభిమన్యు ఈశ్వరన్‌ (144 బ్యాటింగ్‌; 231 బంతుల్లో 13×4, 2×6) అజేయ శతకం సాధించడంతో బంగ్లాదేశ్‌-ఎతో  అనధికారిక టెస్టులో భారత్‌-ఎ భారీ ఆధిక్యం దిశగా అడుగులేస్తోంది. రెండో రోజు, బుధవారం ఆట చివరికి భారత్‌-ఎ 324/5తో నిలిచింది. పుజారా (52), శ్రీకర్‌ భరత్‌ (77)లతో ఈశ్వరన్‌ కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ప్రత్యర్థి బౌలర్లలో సుమాన్‌ ఖాన్‌ (2/67), ముస్ఫిక్‌ హసన్‌ (2/68) రాణించారు. భారత్‌-ఎ ఇప్పటికే 72 పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా-ఎ 252 పరుగులకు పరిమితమైన సంగతి తెలిసిందే.


అనుకోకుండా వచ్చి..

గొన్సాలో రామోస్‌ నిన్నటి వరకు అంతగా వినిపించని అతని పేరు ఇప్పుడో సంచలనం. రొనాల్డో స్థానంలో మాంచెస్టర్‌ యూనైటెడ్‌ క్లబ్‌లో స్ట్రైకర్‌గా ఎంపికవుతాడన్న చర్చ జోరందుకుంది. స్విట్జర్లాండ్‌పై హ్యాట్రిక్‌తో అతడు పోర్చుగల్‌ హీరోగా మారిపోయాడు.  విశేషమేంటంటే తొలుత అతడు స్రైకరే కాదు. మిడ్‌ ఫీల్డర్‌. చాలాకాలం అదే స్థానంలో ఆడిన అతడు.. ఒకసారి తమ జట్టు స్ట్రైకర్‌ గాయం కారణంగా దూరమైతే అతడి స్థానంలో బరిలో దిగాడు. ఆ మ్యాచ్‌లో రెండు గోల్స్‌తో ఆకట్టుకుని.. స్ట్రైకర్‌ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. 12 ఏళ్ల వయసులో సీక్సల్‌ అకాడమీలో చేరిన అతడు 16-17 ఏళ్ల వయసుకే యూత్‌ జట్టు తరఫున సత్తా చాటాడు. మిడ్‌ఫీల్డర్‌ అయినప్పటికీ సీజన్‌లో 25-30 గోల్స్‌తో తానేంటో నిరూపించుకున్నాడు. 2019లో యూరో అండర్‌-19లో టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. ఈ ఏడాది సెప్టెంబరులో తొలిసారి పోర్చుగల్‌ తరఫున బరిలో దిగాడు. ఎవరూ ఊహించని విధంగా రొనాల్డో స్థానంలో స్ట్రైకర్‌గా బరిలో దిగిన అతడు.. ప్రపంచకప్‌లో తుది జట్టులో ఆడిన తొలి మ్యాచ్‌లోనే హ్యాట్రిక్‌తో మెరిసి జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.


రోహిత్‌ 9.. కోహ్లి 10

దుబాయ్‌: ఐసీసీ వన్డే బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో టీమ్‌ఇండియా సారథి రోహిత్‌శర్మ 9, మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి 10వ స్థానాల్లో కొనసాగుతున్నారు. బుధవారం ప్రకటించిన జాబితాలో టీమ్‌ఇండియా తరఫున రోహిత్‌, కోహ్లి మాత్రమే టాప్‌-10లో ఉండటం గమనార్హం. శిఖర్‌ ధావన్‌ 17, శ్రేయస్‌ అయ్యర్‌ 20, కేఎల్‌ రాహుల్‌ 35వ ర్యాంకులు సాధించారు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టాప్‌-10లో ఒక్కరూ లేరు. బుమ్రా 16, మహ్మద్‌ సిరాజ్‌ 26, చాహల్‌ 27, కుల్దీప్‌ యాదవ్‌ 28 స్థానాల్లో కొనసాగుతున్నారు. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో టాప్‌-20లో టీమ్‌ఇండియా నుంచి ఒక్కరికి కూడా చోటు దక్కలేదు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని