Tokyo Olympics: ఈ విజయం నేను ఊహించనిది: నీరజ్‌ చోప్రా

టోక్యో ఒలింపిక్స్‌లో ఇంతటి ఘన విజయం సాధిస్తానని తాను ఊహించలేదంటూ భారతీయ స్టార్‌ జావెలిన్‌ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా తెలిపాడు.

Published : 08 Aug 2021 01:54 IST

దిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో ఇంతటి ఘన విజయం సాధిస్తానని తాను ఊహించలేదంటూ భారతీయ స్టార్‌ జావెలిన్‌ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా అన్నాడు. భారత ఒలింపిక్స్‌ చరిత్రలోనే అథ్లెటిక్స్‌ విభాగంలో తొలి పసిడి పతకాన్ని అందించిన నీరజ్‌ తన విజయ ప్రదర్శనపై శనివారం స్పందించాడు. ‘‘దేశానికి అథ్లెటిక్స్‌లో తొలి స్వర్ణ పతకాన్ని అందించడం గర్వంగా ఉంది. ఇప్పటివరకు ఇతర క్రీడా విభాగాల్లోనూ మన దేశం ఖాతాలో ఒకే స్వర్ణం ఉంది. ఈ విజయం నాకు, నా దేశానికి గర్వకారణంగా భావిస్తున్నా’’ అని పేర్కొన్నాడు. ఫైనల్లో జర్మనీకి చెందిన దిగ్గజ క్రీడాకారుడు జొహన్నెస్‌ వెటెర్‌ను సైతం వెనక్కి నెట్టి పతకం సాధించడంపై స్పందన తెలియజేయాలని కోరగా.. క్వాలిఫికేషన్‌ రౌండ్లో  ఈటెను బాగానే విసిరానని తెలిపాడు. దీంతో ఫైనల్‌లో కూడా మెరుగైన ప్రదర్శన చేయగలననే ఆత్మవిశ్వాసం కలిగిందని పేర్కొన్నాడు. కానీ స్వర్ణం సాధిస్తానని మాత్రం ఊహించలేదని చెప్పాడు.

దేశ ప్రజల అంచనాలను నిజం చేస్తూ టోక్యో ఒలింపిక్స్‌లో పురుషుల జావెలిన్ త్రో విభాగంలో అగ్రస్థానంలో నిలిచి నీరజ్‌ చోప్రా చరిత్ర సృష్టించాడు. ఆఖరి ప్రదర్శనలో ఈటెను 87.58 మీటర్లు విసిరి అథ్లెటిక్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణ పతకాన్ని అందించాడు. ఫైనల్‌లో.. తొలి అవకాశంలోనే ఈటెను 87.03 మీటర్లు విసిరి నీరజ్ ఆశ్చర్యపరిచాడు. ఆ తర్వాత మరింత మెరుగుపరుచుకొని 87.58 మీటర్లు విసిరి పతకం పోటీలో ముందుకెళ్లాడు. ఆరు రౌండ్లు ముగిసే సమయానికి పోటీలో పాల్గొన్న అథ్లెట్లలో అత్యధిక దూరం(87.58 మీటర్లు) విసిరిన ఆటగాడిగా నిలిచి పసిడి పతకాన్ని ముద్దాడాడు. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని