ICC Awards: ఐసీసీ అవార్డుల ప్రకటన.. ‘ప్లేయర్ ఆఫ్‌ ది అక్టోబర్‌ మంత్‌’ వీరే!

వరల్డ్‌ కప్‌ (ODI World Cup 2023) జరుగుతున్న వేళ ‘ప్లేయర్‌ ఆఫ్ ది అక్టోబర్‌ మంత్’ను ఐసీసీ తాజాగా ప్రకటించింది. భారత స్టార్‌ పేసర్‌ బుమ్రా రేసులో నిలిచినా.. కివీస్‌కు చెందిన ఓ యువ ఆల్‌రౌండర్‌ అవార్డును సొంతం చేసుకున్నాడు.

Updated : 10 Nov 2023 13:34 IST

ఇంటర్నెట్ డెస్క్‌: అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రతి నెలా అత్యుత్తమ ప్రతిభను చూపిన పురుష, మహిళా క్రికెటర్లకు ఐసీసీ (ICC) ‘ప్లేయర్‌ ఆఫ్ ది మంత్’ అవార్డులను ఇస్తుంది. అక్టోబర్‌ నెలకు సంబంధించి పురుష, మహిళా క్రికెటర్లను ఐసీసీ వెల్లడించింది. పురుషుల క్రికెట్‌లో ఈ అవార్డు కోసం ముగ్గురు రేసులో ఉండగా.. అందులో టీమ్‌ఇండియా స్టార్‌ పేసర్‌ బుమ్రా కూడా ఉండటం విశేషం. కానీ, ప్రపంచకప్‌లో యువ సంచలనం, కివీస్‌ ఆటగాడు రచిన్‌ రవీంద్రకు ఈ అవార్డు వరించింది. ఈ మేరకు ఐసీసీ వెల్లడించింది. బుమ్రాతోపాటు దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్‌తో పోటీ పడి మరీ రచిన్‌ ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు. తాజాగా 25 ఏళ్ల వయసులోపు ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు సాధించిన యువ బ్యాటర్‌గా రచిన్‌ రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్‌ను అధిగమించాడు.

రచిన్‌ రవీంద్ర (Rachin Ravindra) ఈ వరల్డ్‌ కప్‌లో అక్టోబర్‌ నెలలో కివీస్ ఆడిన మ్యాచుల్లో ఇంగ్లాండ్‌పై 123 పరుగులు, ఆస్ట్రేలియాపై 116 పరుగులు చేశాడు. ఆ నెలలో ఆరు మ్యాచుల్లో 81.20 సగటుతో 406 పరుగులు చేశాడు. ఈ సందర్భంగా ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డుకు ఎంపిక కావడంపై రచిన్‌ రవీంద్ర ఆనందం వ్యక్తం చేశాడు. ‘‘గర్వంగా ఉంది. అంతేకాకుండా అక్టోబర్‌ నెల ఎంతో ప్రత్యేకం. భారత్‌ వేదికగా వన్డే ప్రపంచకప్‌ ఆడటం మరింత సంతోషకరం’’ అని రచిన్‌ వ్యాఖ్యానించాడు. తాజాగా బెంగళూరు వేదికగా శ్రీలంకతో మ్యాచ్‌ అనంతరం రచిన్‌ తన నానమ్మ ఇంటికి వెళ్లాడు. అక్కడ అతడికి సాంప్రదాయ పద్ధతిలో ఆమె దిష్టి తీసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మహిళా క్రికెటర్‌ హీలీ మాథ్యూస్‌

వెస్టిండీస్‌ స్టార్‌ బ్యాటర్ హీలీ మాథ్యూస్‌ను అక్టోబర్‌ నెల ఐసీసీ అవార్డు వరించింది. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో 99*, 132, 79 పరుగులు సాధించి ప్లేయర్ ఆఫ్‌ ది సిరీస్‌గానూ నిలిచింది. బౌలింగ్‌లోనూ 3/36 ప్రదర్శనతో ఆసీస్‌ను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించింది. టీ20 సిరీస్‌లో హీలీనే టాప్‌ స్కోరర్‌, టాప్‌ వికెట్‌ టేకర్‌ కావడం గమనార్హం. బంగ్లాదేశ్‌ స్పిన్నర్‌ నహిదా అక్తెర్, న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్ అమెలీ కెర్‌తో పోటీ పడి మరీ ఈ అవార్డును మాథ్యూస్‌ సొంతం చేసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని