Smrithi Mandhana: ఆ ఓటమి తర్వాత టీమిండియా చాలా మెరుగుపడింది : స్మృతి మంధాన

గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 ఫైనల్‌ ఓటమి తర్వాత భారత మహిళల క్రికెట్‌ జట్టు చాలా మెరుగుపడిందని ఓపెనర్‌ స్మృతి మంధాన అన్నారు.

Published : 14 Sep 2021 22:55 IST

బ్రిస్బేన్‌ : గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 ఫైనల్‌ ఓటమి తర్వాత భారత మహిళల క్రికెట్‌ జట్టు చాలా మెరుగుపడిందని ఓపెనర్‌ స్మృతి మంధాన అన్నారు. రాబోయే సిరీస్‌ల్లో ఇరుజట్ల మధ్య పోటీ రసవత్తరంగా ఉంటుందని ఆమె తెలిపారు. త్వరలో ప్రారంభం కానున్న ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా ఇరు జట్లు మూడు వన్డేలు, మూడు టీ20లు, ఓ టెస్టు మ్యాచులో తలపడనున్నాయి. చివరి సారిగా గతేడాది జరిగిన టీ20 ఫైనల్లో ఇరు జట్లు పోటీ పడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత్‌ 85 పరుగుల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకున్న భారత మహిళల క్రికెట్‌ జట్టు సోమవారం క్వారంటెయిన్‌ పూర్తి చేసుకుంది. ఇరు జట్లు శనివారం వార్మప్‌ మ్యాచులో తలపడనున్నాయి. 

‘టీ20 ఫైనల్‌ ఓటమి తర్వాత భారత మహిళల క్రికెట్‌ జట్టు చాలా బలంగా తయారైంది. ఆ టోర్నీ ముగిసిన వెంటనే కరోనా విజృంభించడంతో మాకు చాలా సమయం దొరికింది. దీంతో జట్టు సభ్యులంతా ఫిట్‌నెస్‌, నైపుణ్యాలపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం, అందరం ఒకే చోట చేరి ప్రాక్టీస్‌ మొదలు పెట్టాం. రాబోయే సిరీస్‌ గొప్పగా ఉంటుందని ఆశిస్తున్నా’ అని మంధాన పేర్కొన్నారు. 

‘ప్రపంచంలోని అత్యుత్తమ జట్లలో ఆస్ట్రేలియా ఒకటి. ఆ జట్టుతో పోరు ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటుంది. అక్కడి పిచ్‌లు కూడా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి, ప్రతి ఒక్కరు అక్కడ బ్యాటింగ్‌ చేయడాన్ని ఇష్టపడతారు. చాలా రోజుల తర్వాత క్రికెట్‌ ఆడుతుండటంతో సంతోషంగా ఉంది ’ అని స్మృతి మంధాన తెలిపారు. ఆస్ట్రేలియా గడ్డపై శతకం నమోదు చేసిన ఏకైన భారత మహిళా క్రికెటర్‌గా స్మృతి మంధాన రికార్డు సృష్టించారు. 2016లో జరిగిన ఓ మ్యాచులో ఆమె 102 పరుగులు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని