RR vs SRH: ‘నో బాల్’.. సందీప్ శర్మ జీవితంలో మరిచిపోలేడు: మాజీ పేసర్

క్రికెట్‌లో ఏ క్షణాన ఏం జరుగుతుందో ముందే అంచనా వేయడం కష్టం. గెలుపోటములు తారుమారు కావచ్చు. రాజస్థాన్‌ రాయల్స్‌ X సన్‌రైజర్స్ హైదరాబాద్ (RR vs SRH) జట్ల మధ్య ఇలానే జరిగింది.

Published : 08 May 2023 17:43 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్‌ సీజన్‌లో (IPL 2023) ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచుల్లో రాజస్థాన్‌ రాయల్స్‌ X సన్‌రైజర్స్ హైదరాబాద్‌ (RR vs SRH) మ్యాచ్‌ చిరస్థాయిగా నిలిచిపోతుంది. విజయం సాధించామని సంబరపడిన రాజస్థాన్‌కు ఊహించని షాక్‌ తగిలింది. చివరి బంతి ‘నో బాల్’ కావడంతో ఓటమి నుంచి గట్టెక్కి మరీ హైదరాబాద్‌ విజయం సాధించడం విశేషం. ‘నో బాల్’ వేసి మరీ మ్యాచ్‌ను సన్‌రైజర్స్‌కు అప్పగించిన బౌలర్‌గా సందీప్‌ శర్మ నిలిచిపోయాడు. ఫ్రీహిట్‌గా వచ్చిన బంతిని హైదరాబాద్‌ బ్యాటర్‌ అబ్దుల్‌ సమద్‌ సిక్స్‌గా మలిచాడు.  గతంలో చెన్నైపై చివరి ఓవర్‌లో తక్కువ పరుగులను కాపాడి రాజస్థాన్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన సందీప్‌ శర్మ.. ఈసారి మాత్రం ఆర్‌ఆర్‌ ఓడిపోవడంలో ముఖ్యపాత్ర పోషించాడు. ఈ క్రమంలో సందీప్‌ శర్మకు టీమ్‌ఇండియా మాజీ పేసర్ లక్ష్మీపతి బాలాజీ భరోసా చెప్పాడు. అయితే, తన జీవితంలో మాత్రం సందీప్‌ ఈ నో బాల్‌ను మరిచిపోలేడని పేర్కొన్నాడు. 

‘‘గతంలో సీఎస్‌కే మ్యాచ్‌ను పరిశీలిస్తే చివరి మూడు బంతులను అద్భుతంగా సంధించాడు. ఇప్పుడు హైదరాబాద్‌తోనూ అలాంటి అవకాశమే వచ్చి  చేజారింది. దురదృష్టవశాత్తూ నో బాల్ పడటంతో మ్యాచ్‌ను కోల్పోవాల్సి వచ్చింది. ఒక్కసారిగా షాక్‌కు గురైన సందీప్‌ చివరి బంతిని తనదైన శైలిలో సంధించలేకపోయాడు. మ్యాచ్‌ ముగిసిందని సంబరపడేలోగా ‘నో బాల్’ సైరన్ మోగడంతో రాజస్థాన్‌  జట్టు, అభిమానులు సైలెంట్‌ అయిపోయారు. వారిని తీవ్రంగా బాధపెట్టింది. ఈ ఒక్కబంతిని మాత్రం సందీప్‌ తన జీవితం మొత్తం గుర్తు పెట్టుకుంటాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్‌ వెనుకబడి మరీ పుంజుకోవడానికి కారణం గ్లెన్‌ ఫిలిప్స్‌. ఎలాంటి బౌలర్‌నైనా దూకుడుగా ఆడేయడంలో గ్లెన్‌ నిపుణుడు. చివరి మూడు ఓవర్లలో ఎలాంటి బ్యాటింగ్‌ చేయాలో గ్లెన్‌కు బాగా తెలుసు. తదుపరి మ్యాచుల్లోనూ గ్లెన్‌ వల్ల సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌ మరింత బలోపేతమవుతుంది’’ అని బాలాజీ తెలిపాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలంటే మిగతా నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలవాలి. అప్పుడు ఇతర జట్ల ఫలితాల ఆధారంగా చోటు దక్కే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని