Manika Batra: టీటీ ఆసియా కప్‌లో కాంస్యం.. భారత తొలి క్రీడాకారిణిగా బాత్రా ఘనత

టేబుల్‌ టెన్నిస్‌ ఆసియా కప్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలో భారత క్రీడాకారిణి మనికా బాత్రా సత్తా చాటింది. కాంస్య పతక పోరులో టాప్‌ ర్యాంకర్‌ హిమ హయతను మట్టికరిపించి విజయం సాధించింది. దీంతో ఆసియా కప్‌లో పతకం గెలిచిన తొలి భారత క్రీడాకారిణిగా అరుదైన ఘనత దక్కించుకొంది. 

Updated : 19 Nov 2022 18:13 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత టేబుల్‌ టెన్నిస్‌ మహిళా క్రీడాకారిణి మనికా బాత్రా అరుదైన ఘనత సాధించింది. ఐటీటీఎఫ్‌-ఏటీటీయూ ఆసియా కప్‌లో కాంస్యం గెలిచిన బాత్రా.. ఈ మెగా టోర్నీలో పతకం సొంతం చేసుకొన్న తొలి భారత మహిళా ప్లేయర్‌గా అవతరించింది. కాంస్య పతకం కోసం జరిగిన పోరులో ఐదో ర్యాంకర్‌, మూడుసార్లు ఆసియా కప్‌ ఛాంపియన్‌, జపాన్‌ ప్లేయర్‌ హిన హయతను మట్టికరిపించి మరీ బాత్రా కాంస్యం సొంతం చేసుకొంది. హయతపై 4-2 (11-6, 6-11, 11-7, 12-10, 4-11, 11-2) తేడాతో మనికా గెలిచింది. 

టేబుల్‌ టెన్నిస్‌ ర్యాంకింగ్స్‌లో 44వ స్థానంలో ఉన్న మనికా బాత్రా సంచలన విజయాలతో ఆసియా కప్‌ సెమీస్‌కు చేరింది. తొలి రౌండ్‌లోనే ఏడో ర్యాంకర్‌ చెన్‌ జింగ్‌టాంగ్‌పై అద్భుత విజయం సాధించింది. అలా సెమీస్‌కు చేరిన బాత్రా ఆరో ర్యాంకర్‌ మిమా చేతిలో ఓటమిపాలై ఫైనల్‌కు చేరుకోలేకపోయింది. అయినా తీవ్ర పోటీని తట్టుకొని కాంస్య పతకం దక్కించుకోవడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని