IPL 2023: ముంబయి బ్యాటర్‌ వధెరాకు భలే పనిష్మెంట్‌.. ఎయిర్‌పోర్ట్‌లో అలా!

నెహాల్ వధెరా.. ముంబయి ఇండియన్స్‌ (MI) యువ బ్యాటర్. బెంగళూరుపై అత్యుత్తమ ప్రదర్శనతో అందరి మన్ననలు పొందాడు.

Published : 15 May 2023 14:47 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌ 2023 (IPL 2023) సీజన్‌లో ముంబయి ఇండియన్స్‌ (MI) తరఫున ఆడుతున్న యువ బ్యాటర్ నెహాల్ వధెరా ఉత్తమ ప్రదర్శనతో అదరగొట్టేస్తున్నాడు. గత మ్యాచ్‌లో బెంగళూరును ఓడించడంలో వధెరా అర్ధశతకంతో కీలక పాత్ర పోషించాడు. అయితే, ముంబయి ఇండియన్స్‌ ఫ్రాంచైజీ అతడికి పనిష్మెంట్‌ ఇచ్చింది. ఇదేంటి.. మ్యాచ్‌ను గెలిపించిన వారికి ఎవరైనా బహుమతి ఇస్తారు కానీ.. పనిష్మెంట్‌ ఏంటా..? అని కంగారు పడొద్దు. ఇదేమీ కఠినమైన శిక్ష కాదు.. సరదాగా వేసిన పనిష్మెంట్‌. మరి ఎందుకు అతడికి శిక్ష వేయాల్సి వచ్చిందంటే..?

ముంబయి ఇండియన్స్‌ ఆడటగాళ్లతో కలిసి నెహాల్‌ వధెరా (Nehal Wadhera) ఎయిర్‌పోర్ట్‌కు వచ్చాడు. అయితే, బ్యాటింగ్‌ ప్యాడ్లతోనే నెహాల్‌ రావడంతో అంతా ఆశ్చర్యపోయారు. తీరా, అసలు విషయం తెలియడంతో అందరిలోనూ నవ్వులు విరిశాయి. జట్టు సమావేశానికి కాస్త ఆలస్యంగా రావడంతో ముంబయి యాజమాన్యం అతడికి ఇలాంటి వినూత్న శిక్షను విధించింది. ఇలా ఎవరైనా ఆలస్యంగా వస్తే వారికి శిక్ష వేయడానికి ప్రత్యేకంగా ‘పనిష్మెంట్‌ జంప్‌సూట్’ను కూడా సిద్ధం చేయడం విశేషం. వధెరా పనిష్మెంట్‌పై ముంబయి ఇండియన్స్‌ తన ట్విటర్‌లో వెల్లడించింది. 

‘‘ముంబయి యువ బ్యాటర్ నెహాల్ వధెరా అందరి చూపును తనవైపు తిప్పేసుకున్నాడు. సాధారణ జంప్‌సూట్‌కు బదులు ప్యాడ్లతో కనిపించడంతో  అంతా ఆశ్చర్యపోయారు. మా విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. బ్యాటర్ల సమావేశానికి ఆలస్యంగా వచ్చినందుకు ఇలా పనిష్మెంట్‌కు గురైనట్లు తెలిసింది’’ అని ముంబయి ఇండియన్స్‌ వీడియోను షేర్ చేసింది. గత మినీ వేలంలో వధెరాను ముంబయి కేవలం రూ. 20 లక్షలకే దక్కించుకుంది. ఈ టోర్నీలో తొలిసారి 100 మీటర్ల కంటే ఎక్కువ దూరంలో సిక్స్‌ బాదిన బ్యాటర్‌ వధెరా కావడం విశేషం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని