Kulcha: చాహల్‌, కుల్‌దీప్‌ ఇద్దరూ తుది జట్టులో ఉంటే..?: మహమ్మద్‌ కైఫ్‌

యుజ్వేంద్ర చాహల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌ ఇద్దరూ తుది జట్టులో ఉంటే భారత బౌలింగ్‌ విభాగం గొప్పగా రాణిస్తుందని మహమ్మద్‌ కైఫ్‌ అభిప్రాయపడ్డాడు.

Published : 01 Feb 2023 17:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒకప్పుడు కుల్చా (కుల్‌దీప్‌ యాదవ్, యుజ్వేంద్ర చాహల్) జోడీ అంటే బ్యాటర్లు వణికిపోయేవారు. ఇటీవల వీరిద్దరూ కలిసి ఆడటం అరుదుగానే చూస్తున్నాం. ఈ క్రమంలో వారిద్దరి బౌలింగ్‌పై టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు మహమ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. యుజ్వేంద్ర చాహల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌ ఇద్దరూ తుది జట్టులో ఉంటే భారత బౌలింగ్‌ విభాగం గొప్పగా రాణిస్తుందని మహమ్మద్‌ కైఫ్‌ అభిప్రాయపడ్డాడు. లఖ్‌నవూలో కివీస్‌తో జరిగిన రెండో టీ20లో వారిద్దరూ తుది జట్టులో ఉన్నారు. ఇద్దరూ చెరో వికెట్ పడగొట్టి భారత విజయంలో భాగస్వామ్యులయ్యారు. ఈ నేపథ్యంలో వారిద్దరు కలిసి ఆడితే జట్టుకు గొప్పగా ఉపయోగపడుతుందని కైఫ్ సూచించాడు.

‘‘మీరు 3×3 సూత్రాన్ని అనుసరించొచ్చు. ముగ్గురు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లు.. ఇది కచ్చితంగా మంచి ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే చాహల్‌, కుల్‌దీప్‌ నాణ్యమైన బౌలర్లు. వారు తమ అనుభవాన్నంతా జట్టుకు అందిస్తారు. టీ20లో మీకు 7వ స్థానంలో బ్యాటింగ్‌ చేసే వ్యక్తి కావాలి. ఎందుకంటే ఎనిమిదో వ్యక్తి బ్యాటింగ్‌లో రాణించలేడు. లోయర్‌ ఆర్డర్‌లో కుల్‌దీప్ బ్యాటింగ్‌లో రాణించగలడు. తర్వాత వికెట్లు తీసే బౌలర్లు కీలకం. వారే మ్యాచ్‌ని గెలిపిస్తారు. వాళ్లే కుల్‌దీప్‌, చాహల్‌. తర్వాత మీకు ఫాస్ట్‌ బౌలర్లు కావాలి. వాషింగ్టన్‌ సుందర్‌  అద్భుతంగా ఆడుతున్నాడు. హార్దిక్‌ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కి వస్తాడు. అతడు కూడా ఆల్‌రౌండర్‌. అందువల్ల మీరు ఆరుగురు బౌలర్లతో ముందుకు వెళ్లొచ్చు. అందువల్ల ఏడో స్థానం వరకు బ్యాటర్లు ఉంటారు. ఆరుగురు బౌలర్లు వికెట్లు తీస్తారు. దీనివల్ల మీరు మంచి పరిణామాన్ని చూస్తారు’’ అని కైఫ్‌ వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని