Shami: నా సక్సెస్‌ వెనుక ‘రాకెట్ సైన్స్‌’ ఏమీ లేదు.. ఒకటే కారణం: షమీ

ఐదు వికెట్ల ప్రదర్శనతో శ్రీలంక నడ్డివిరచడంలో మహమ్మద్ షమీ (Shami) కీలక పాత్ర పోషించాడు. దీంతో వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) సెమీస్‌కు చేరిన తొలి జట్టుగా భారత్‌ అవతరించింది.

Updated : 03 Nov 2023 12:48 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వన్డే ప్రపంచకప్‌ 2023 టోర్నీలో (ODI World Cup 2023) రెండుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శనతో భారత బౌలర్ మహమ్మద్ షమీ (Shami) అదరగొట్టాడు. ఇప్పటికే 14 వికెట్లను (కేవలం మూడు మ్యాచుల్లోనే) తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే మెగా టోర్నీ చరిత్రలోనే అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గానూ అవతరించాడు. ఈ క్రమంలో జహీర్‌ ఖాన్‌ (44), శ్రీనాథ్ (44)ను అధిగమించాడు. ప్రస్తుతం 45 వికెట్లతో కొనసాగుతున్నాడు. అయితే, తన సక్సెస్ వెనుక ఎలాంటి ‘రాకెట్‌ సైన్స్’ సూత్రాలు లేవంటూ షమీ వ్యాఖ్యానించాడు. శ్రీలంకపై 5/18 ప్రదర్శనతో ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డు దక్కించుకున్నాడు. నిలకడగా లైన్‌ అండ్‌ లెంగ్త్‌కు కట్టుబడి బౌలింగ్‌ చేయడం వల్లే ఇది సాధ్యమైందని షమీ స్పష్టం చేశాడు. 

‘‘కెరీర్‌ ఆరంభం నుంచి నేను పాటించే ఒకటే సూత్రం లైన్‌ అండ్‌ లెంగ్త్‌. సరైన ప్రాంతంలో బంతిని పిచ్‌ చేసి లయను దొరకబుచ్చుకోవడానికి ప్రయత్నిస్తా. ఎందుకంటే ఇలాంటి మెగా సమరంలో ఒక్కసారి ఆ రిథమ్‌ పోయిందంటే తిరిగి పుంజుకోవడం చాలా కష్టం. అందుకే, తొలి మ్యాచ్‌ నుంచి లెంగ్త్‌తో బంతులను సంధించా. అదే వర్కౌట్‌ అయింది. అలాంటప్పుడు మళ్లీ రిపీట్‌ ఎందుకు చేయకూడదు? అనిపించింది. అలా చేయడం కష్టమే కానీ.. ప్రయత్నించడం తప్పు కాదు. నేను అదే చేశా. తెల్ల బంతి క్రికెట్‌లో లైన్‌ అండ్‌ లెంగ్త్‌ చాలా కీలకం. అప్పుడు పిచ్‌ నుంచి కూడా సహకారం లభిస్తుంది. నేను విజయవంతం కావడానికి కారణం కూడా అదే. అంతేకానీ, ఇందులో రాకెట్‌ సైన్స్‌ సూత్రాలేమీ ఉండవు. అయితే, ఇలా రాణించడానికి మంచి ఆహారం తీసుకోవడంతోపాటు మానసికంగానూ దృఢంగా ఉండాలి. అన్నింటి కంటే అభిమానుల ప్రేమను ఆస్వాదించాలి. ఎక్కడకెళ్లినా వారి నుంచి వచ్చే మద్దతు అద్భుతం. విదేశాలకు వెళ్లినాసరే భారతీయులు భారీగా వస్తారు. ప్రతి ఒక్కరినీ ఆనందంగా ఉంచేందుకు ప్రయత్నిస్తూనే ఉంటా’’ అని షమీ వ్యాఖ్యానించాడు. 

ప్రధాని మోదీ అభినందనలు..

శ్రీలంకపై టీమ్‌ఇండియా ఘన విజయం సాధించడం ఆనందంగా ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. వరల్డ్‌ కప్‌లో భారత్‌ సెమీస్‌కు చేరుకోవడంతో ఈ మేరకు మోదీ స్పందించారు. ‘‘టీమ్‌ఇండియా వరల్డ్‌ కప్‌లో దూసుకుపోతోంది. శ్రీలంకను చిత్తు చేసి ఘన విజయం సాధించిన టీమ్‌ఇండియాకు అభినందనలు. జట్టు సమష్టి కృషికి తార్కాణంగా నిలిచింది’’ అని మోదీ ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని