Cricket News: అమ్మ త్వరగా కోలుకోవాలని షమీ స్పెషల్ పోస్టు.. తనపై ట్రోలింగ్‌కు సమాధానం ఇచ్చిన జాంటీ రోడ్స్‌!

Published : 24 Nov 2023 14:19 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత సీనియర్ పేసర్ షమీ (Shami) తన తల్లి వేగంగా కోలుకుని ఇంటికి రావాలని ఆకాంక్షించాడు. మరోవైపు తనపై వస్తున్న ట్రోలింగ్‌కు దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు జాంటీ రోడ్స్‌ (Jonty Rhodes) స్పందించాడు. ఇక అఫ్గాన్‌ స్టార్‌ రషీద్‌ ఖాన్ (Rashid Khan) శస్త్రచికిత్స చేయించుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇలాంటి క్రికెటర్ల విశేషాలు మీ కోసం.. 

అమ్మా..నువ్వంటే ఎంతో ఇష్టం: షమీ

వన్డే ప్రపంచ కప్‌లో టాప్‌ వికెట్‌ టేకర్‌ మహమ్మద్‌ షమీ. అయితే ఆసీస్‌తో ఫైనల్‌ జరుగుతున్నప్పుడే షమీ తల్లి అనుమ్‌ అరా అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. ఆమెను వెంటనే బంధువులు ఆసుపత్రికి తరలించారు. జ్వరం, ఆందోళనతో ఇబ్బంది పడుతుండటంతో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. ఈ క్రమంలో షమీ తన తల్లిని ఉద్దేశించి ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పోస్టు పెట్టాడు. ‘‘అమ్మా నువ్వంటే ఎంతో ఇష్టం. త్వరగా కోలుకుని వచ్చేస్తావని ఆశిస్తున్నా’ అని పోస్టు చేశాడు. 


అతడు నా డ్రైవర్‌ కాదు..: జాంటీ రోడ్స్‌

సోషల్ మీడియాలో ప్రతి దానిని ట్రోలింగ్‌ చేయడం అలవాటైపోయింది. ఎవరు ఏం చేసినా దానిలో నెగిటివిటీని వెతికి మరీ చూస్తున్నారు తప్పితే వాస్తవం ఏంటనేది పట్టించుకోలేదు. ఇలాంటి అనుభవమే దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు జాంటీ రోడ్స్‌కు ఎదురైంది. ఓ హోటల్‌లో దిగిన ఫొటో నెట్టింట విపరీతంగా ట్రోలింగ్‌కు గురైంది. దీంతో అందులో ఏం పొరపాటు లేదని రోడ్స్‌ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. బెంగళూరులో ఓ రెస్టరెంట్‌కు వెళ్లిన రోడ్స్‌ అక్కడ టేబుల్‌ వద్ద టిఫిన్‌ చేస్తూ ఓ ఫొటో దిగాడు. దానిని తన సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఆ టేబుల్‌కు మరోవైపు ఓ పెద్దాయన కూర్చొని ఉన్నాడు. దానిని హైలైట్‌ చేస్తూ కొందరు ‘‘సెలబ్రిటీ అయినంత మాత్రాన సరిపోదు’’ అంటూ కామెంట్లు పెట్టారు. దీంతో దానికి రోడ్స్‌ ప్రతిస్పందించాడు.

‘‘ఇలాంటి కామెంట్లపై స్పందించడానికి కొన్ని రోజుల సమయం తీసుకోవాల్సి వచ్చింది. నా టేబుల్ వద్ద కూర్చున్న వ్యక్తి ఎవరో కూడా తెలియదు. ఈ ఫొటోను నా డ్రైవర్‌ తీశాడు. అతడు ఏమీ తినలేదు. నా కోసం అతడి ఫేవరెట్‌ ఫుడ్‌ను ఆర్డర్ చేశాడు. తను టీ మాత్రమే తాగాడు. నేనే బిల్లు కట్టాను’’ అని రోడ్స్‌ పోస్టు పెట్టాడు. దీంతో రోడ్స్‌కు మద్దతుగా ‘మీరు ఇలాంటి ఆన్‌లైన్‌ ట్రోలింగ్‌ను పట్టించుకోవద్దు. మీరు దిగ్గజం’ అని అభిమానులు ట్వీట్లు చేశారు.


రషీద్‌ ఖాన్‌కు శస్త్రచికిత్స

వన్డే ప్రపంచకప్‌లో తన ఆటతీరుతో యావత్‌ క్రికెట్ అభిమానులను అలరించిన అఫ్గానిస్థాన్‌ స్టార్‌ ఆటగాడు రషీద్‌ ఖాన్‌కు చిన్నపాటి శస్త్రచికిత్స అవసరమైంది. దీంతో ఇప్పటికే బిగ్‌బాష్‌ లీగ్‌ నుంచి వైదొలిగాడు. డిసెంబర్ 7 నుంచి బీబీఎల్‌ ప్రారంభం కానుంది. యూకేలో ఆపరేషన్‌ చేయించుకుంటాడని అఫ్గాన్‌ క్రికెట్ బోర్డు (ACB) ఓ ప్రకటన వెలువరించింది. ‘‘అఫ్గాన్‌ క్రికెట్‌ సంచలనం రషీద్‌ ఖాన్‌ చిన్న శస్త్రచికిత్స చేయించుకోనున్నాడు. యూకేలో డాక్టర్‌ జేమ్స్‌ అలీబోన్‌ ఈ ఆపరేషన్‌ చేయనున్నారు. శస్త్రచికిత్స అనంతరం కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుంటాడు. త్వరలోనే అతడి ఆటను మళ్లీ చూడబోతున్నాం’’  అని అఫ్గాన్‌ బోర్డు తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు