సచిన్‌ పేరుతో సిరీస్‌ బాగుంటుంది కదా!

భారత్‌×ఇంగ్లాండ్‌ టెస్టు సిరీస్‌కు ‘తెందూల్కర్ ‌- కుక్‌ ట్రోఫీ’గా నామకరణం చేస్తే బాగుంటుందని ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ మాంటీ పనేసర్‌ సూచించాడు. ఆయా జట్ల తరఫున వారిద్దరూ అత్యుత్తమ ఆటగాళ్లు, అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లని వివరించాడు. పరస్పరం ఎక్కువ క్రికెట్‌ ఆడారని వెల్లడించాడు....

Published : 11 Feb 2021 01:39 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌×ఇంగ్లాండ్‌ టెస్టు సిరీస్‌కు ‘తెందూల్కర్ ‌- కుక్‌ ట్రోఫీ’గా నామకరణం చేస్తే బాగుంటుందని ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ మాంటీ పనేసర్‌ సూచించాడు. ఆయా జట్ల తరఫున వారిద్దరూ అత్యుత్తమ ఆటగాళ్లు, అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లని వివరించాడు.

అంతర్జాతీయ క్రికెట్లో దిగ్గజాల పేరుతో టోర్నీలు జరగడం పరిపాటి. భారత్‌, ఆస్ట్రేలియా సిరీసులను ‘బోర్డర్‌-గావస్కర్‌’ పేరుతో ఇప్పటికే నిర్వహిస్తున్నారు. టీమ్‌ఇండియా ఇంగ్లాండ్‌లో పర్యటిస్తున్నప్పుడు పటౌడీ టోర్నీగా వర్ణిస్తారు. మహాత్మా గాంధీ గౌరవార్థం భారత్‌, దక్షిణాఫ్రికా సిరీసులను ‘ఫ్రీడమ్‌ సిరీసు’లుగా నామకరణం చేశారు. ఈ నేపథ్యంలో సచిన్‌ పేరుతోనూ ఒక ట్రోఫీ ఉంటే బాగుంటుందని పనేసర్‌ ట్వీట్‌ చేశాడు.

‘ఇంగ్లాండ్‌ × భారత్‌ సిరీసులకు తెందూల్కర్‌ కుక్‌ ట్రోఫీగా నామకరణం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆయా దేశాల తరఫున వారు అత్యధిక పరుగులు చేశారు. వారిద్దరూ ప్రత్యర్థులుగా ఎక్కువగా తలపడ్డారు. ఇక సచిన్‌ తెందూల్కర్‌ దిగ్గజమని తెలిసిందే. అతడి పేరుతో ఒక్క సిరీసూ లేదు’ అని పనేసర్‌ ట్వీటాడు. అయితే అతడికి అభిమానులు కొన్ని సూచనలు చేశారు. కొందరు హాస్యం జోడించి బదులిచ్చారు. 

‘బోథమ్‌-కపిల్‌ ట్రోఫీ ఎందుకు కాకూడదు’ అని ఒక నెటిజన్‌ అడగ్గా ‘మరో రెండు మూడేళ్లు ఆగితే అది కోహ్లీ-రూట్‌ ట్రోఫీ అవుతుంది’ అని మరొకరు బదులిచ్చారు. ‘భజ్జీ-పనేసర్‌ ట్రోఫీ ఎందుకు కావొద్దు’ అని ఒకరు ప్రశ్నించగా ‘టెస్టుల్లో నేను 300+ వికెట్లు తీసుకుంటే హర్భజన్‌- పనేసర్‌ ట్రోఫీ ఉండేది’ అని మాంటీ అన్నాడు. ఇంగ్లాండ్‌ తరఫున 50 టెస్టులు ఆడిన అతడు 167 వికెట్లు తీసిన సంగతి తెలిసిందే.

ఇవీ చదవండి
ఓటమిపై సాకులొద్దు.. పునఃసమీక్షించండి
రూట్‌ పైపైకి.. కోహ్లీ కిందకు..


Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts