LSG vs MI: అదే తప్పు.. మళ్లీ మళ్లీ చేసి ఓడారు: ముంబయి బౌలింగ్‌ కోచ్‌ అసహనం

లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ చేతిలో ఓటమితో ముంబయి ఇండియన్స్‌ (LSG vs MI) ప్లేఆఫ్స్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. మరోవైపు లఖ్‌నవూ మాత్రం రేసులోకి దూసుకొచ్చింది. లఖ్‌నవూను కట్టడి చేయడంలో బౌలింగ్‌ విభాగం విఫలం కావడంపై ముంబయి బౌలింగ్‌ కోచ్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

Published : 17 May 2023 18:58 IST

ఇంటర్నెట్ డెస్క్: లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ (MI) బౌలర్లు డెత్‌ ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించారు. దీంతో ఆ జట్టు బౌలింగ్‌ కోచ్‌ షేన్‌ బాండ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. లఖ్‌నవూ 17 ఓవర్లకు 123/3 స్కోరుతో ఉండగా.. చివరి మూడు ఓవర్లలో ఏకంగా 54 పరుగులను రాబట్టింది. ముంబయి బౌలర్‌ క్రిస్‌ జొర్డాన్‌ ఒకే ఓవర్‌లో 24 పరుగులు ఇచ్చాడు.  దీంతో లక్ష్యం ఒక్కసారిగా భారీగా పెరిగిపోయింది. ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌ మార్నస్ స్టాయినిస్‌ (89*) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన లఖ్‌నవూ 20 ఓవర్లకు 177/3 స్కోరు చేసింది. ఈ క్రమంలో ముంబయి బౌలింగ్‌ తీరుపై షేన్‌ బాండ్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. 

‘‘మేం అనుకున్న ప్రణాళిక ప్రకారం బౌలింగ్‌ చేయడంలో మా బౌలర్లు విఫలం కావడం తీవ్రంగా నిరుత్సాహానికి గురి చేసింది. మార్నస్‌ వంటి బ్యాటర్‌ క్రీజ్‌లో ఉంటే ఏం చేయాలనే దాని గురించి స్పష్టతతోనే ఉన్నాం. కానీ, చివర్లో నిలకడగా బౌలింగ్‌ చేయలేకపోయాం. జట్టు ప్లాన్‌ ప్రకారం.. బ్యాటర్లు మన ప్లేస్‌మెంట్‌కు అనుకూలంగా షాట్లు కొట్టేలా బౌలింగ్‌ చేయాలి. అప్పుడే వారికి పరుగులు రాబట్టడం కష్టంగా మారుతుంది. స్టాయినిస్‌నే తీసుకుంటే.. అతడు స్ట్రెయిట్‌గా ఆడతాడు. అతడికి అలాంటి బంతులు వేయకుండా ఉండాలి. ఇరు జట్లలో ప్రధాన వ్యత్యాసం చివరి ఓవర్లే. ప్రతి మ్యాచ్‌కు ముందు సన్నద్ధతలో పొరపాట్ల నుంచి గుణ పాఠాలు నేర్చుకుంటూ ఉంటాం. కానీ, ఈ మ్యాచ్‌లో మాత్రం చేసిన తప్పిదాలనే పునరావృతం చేశాం. ఇదే నన్ను తీవ్రంగా నిరాశపర్చింది’’ అని బాండ్ వ్యాఖ్యానించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని