MS Dhoni- WC 2019: ధోనీ రనౌట్‌ వల్లే మేం ఫైనల్‌కు చేరుకోగలిగాం.. లేదంటే: కివీస్‌ పేసర్

క్రికెట్ అభిమానులను నిరాశకు గురి చేస్తూ గత వరల్డ్‌ కప్‌లో ధోనీ రనౌట్ అయిన తీరు గుర్తుండే ఉంటుంది. విజయం కోసం చివరి వరకూ పోరాడిన ధోనీ ఔట్ కావడంతో భారత్‌ సెమీస్‌లోనే వెనుదిరిగింది. 

Published : 10 Sep 2023 17:28 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెట్ చరిత్రలో మూడు సంఘటనలు తప్పకుండా గుర్తుండిపోతాయి. కపిల్‌ దేవ్ నాయకత్వంలో 1983 టైటిల్‌, ఇక 2011 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌లో సిక్స్‌తో భారత పతాకం రెపరెపలాడేలా చేసిన ఎంఎస్ ధోనీ షాట్‌ మన కళ్ల ముందు ఉండిపోతాయి. ఇలాంటిదే గత వన్డే ప్రపంచకప్‌లో (2019)నూ ఓ సంఘటన ఉంది. సెమీస్‌లో న్యూజిలాండ్‌పై కీలకమైన సమయంలో (49వ ఓవర్) ధోనీ రనౌట్‌గా నిలవడం.. ఆ వెంటనే కివీస్‌ విజయం సాధించి ఫైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే. టెయిలెండర్లతో పోరాడిన ధోనీ మరో 10 బంతుల్లో 25 పరుగులు చేయాల్సిన క్రమంలో పెవిలియన్‌కు చేరడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. గతంలో ఎన్నోసార్లు చివర్లో వీరోచిత ఇన్నింగ్స్‌లు ఆడిన సందర్భాలూ ఉన్నాయి. ఈ క్రమంలో అప్పుడు 49వ ఓవర్ వేసిన కివీస్‌ పేసర్ లాకీ ఫెర్గూసన్ తాజాగా ధోనీ రనౌట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోనీని రనౌట్‌ చేయడం వల్ల తమ జట్టు ఫైనల్‌కు చేరుకుందని పేర్కొన్నాడు. 

‘‘ధోనీ గురించి మనం మాట్లాడుకోవడానికి చాలా విషయాలు ఉంటాయి. అతడు ఒక్కసారి కుదురుకుని గేర్‌ మార్చడం మొదలైతే ఆపడం ఎవరి తరమూ కాదు. అతడిని ఔట్‌ చేయడం ద్వారా మేం అలవోకగా ఫైనల్‌కు చేరుకోగలిగాం. ఆ తర్వాత సంబరాలు చేసుకోవడం మరింత ఆనందాన్నిచ్చింది’’ అని ఫెర్గూసన్‌ వ్యాఖ్యానించాడు. అంతకుముందు రాస్‌ టేలర్ కూడా ధోనీని ఔట్‌ చేయడం వల్లే తాము ఫైనల్‌కు వెళ్లినట్లు గుర్తు చేసుకున్నాడు. అయితే, టైటిల్‌ కోసం జరిగిన పోరులో కివీస్‌పై ఇంగ్లాండ్‌ విజయం సాధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు