Pakistan: ప్రపంచకప్‌నకు ముందు ఇది మాకో గుణపాఠం: పాక్‌ బౌలింగ్‌ కోచ్‌

ఆసియాకప్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో తమ బౌలర్లు ఘోరంగా విఫలం కావడంపై పాక్‌ బౌలింగ్‌ మోర్కెల్‌ స్పందించాడు. ఈ మ్యాచ్‌ నుంచి నేర్చుకొన్న పాఠాలతో శ్రీలంకపై రాణిస్తామని పేర్కొన్నాడు.   

Published : 14 Sep 2023 12:51 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆసియాకప్‌ (Asia Cup 2023) గ్రూప్‌-4లో భాగంగా భారత్‌ (India)తో మ్యాచ్‌లో పాక్‌ (Pakistan) స్పిన్నర్లు తేలిపోయిన విషయం తెలిసిందే. దీనికి తోడు ఆ దేశ పేస్‌ దళంలో కీలక సభ్యుడైన నసీమ్‌ షా గాయం కారణంగా జట్టు నుంచి వైదొలగాడు. పాక్‌ కచ్చితంగా గెలిచి తీరాల్సిన సమయంలో తడబడటంపై ఆ దేశ బౌలింగ్‌ కోచ్‌ మోర్నే మోర్కెల్‌ స్పందించాడు. తమ స్పిన్నర్లు శ్రీలంక(Sri Lanka)తో మ్యాచ్‌కు పుంజుకొంటారని విశ్వాసం వ్యక్తం చేశాడు. 

‘‘మైదానంలో పరిస్థితులు స్పిన్‌కు అనుకూలంగా ఉన్నాయి. ఇప్పుడు మా స్పిన్నర్లు కూడా బాగా శ్రమిస్తున్నారనుకుంటాను. జట్టుకు వారి అవసరం ఉన్నప్పుడు బాధ్యతలు స్వీకరించడానికి ఎప్పుడూ ముందుంటారు. వారంతా మ్యాచ్‌ విన్నర్లు. ఎలా పుంజుకోవాలో వారికి బాగా తెలుసు. భారత్‌తో మ్యాచ్‌ తర్వాత బాగా నిరుత్సాహ పడ్డాం. బౌలర్లు ఆత్మవిమర్శ చేసుకోవడం చాలా అవసరం అని నేను అనుకొంటున్నాను. ఎక్కడ తప్పుచేశారో అంతరాత్మను ప్రశ్నించుకోవాలి. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లకు పూర్తి క్రెడిట్‌ దక్కుతుంది. మొదటి నుంచి బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టేశారు. ప్రపంచకప్‌నకు ముందు ఇది మాకో గుణపాఠం నేర్పింది. ఈ పరిస్థితి నుంచి పుంజుకొని రాణిస్తామని నమ్ముతున్నా’’ అని మోర్కెల్‌ వివరించాడు.

భారత్‌ను ఢీకొట్టేదెవరు?

మరో వైపు తప్పనిసరిగా గెలిచి తీరాల్సిన ఈ మ్యాచ్‌కు స్టార్‌పేసర్‌ నసీమ్‌ షా అందుబాటులో లేకపోవడంపై మోర్కెల్‌ మాట్లాడుతూ..‘‘ అతడు అందుబాటులో లేకపోవడం మాకు పెద్ద ఎదురు దెబ్బే. కానీ, కొత్తగా జట్టులోకి వచ్చే వారికి ఇది అద్భుతమైన అవకాశం. భారత్‌ చేతిలో ఓటమి చవిచూడటంతో ఇది కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌. మ్యాచ్‌లో మా కొత్త కుర్రాళ్లు ఎలా ఆడతారో చూడాలని ఉత్కంఠగా ఉంది’’ అని వివరించాడు. నసీమ్‌ స్థానంలో యువ బౌలర్‌ జమాన్‌ ఖాన్‌ జట్టులోకి వచ్చాడు. మిగిలిన మ్యాచ్‌లకు కూడా నసీమ్‌ దూరమయ్యాడని వస్తున్న వార్తలను పాక్‌ బోర్డు తోసిపుచ్చింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని