భారత్‌ను ఢీకొట్టేదెవరు?

ఆసియా కప్‌లో మరోసారి భారత్‌, పాక్‌ మ్యాచ్‌ ఉంటుందా? ట్రోఫీ కోసం ఈ రెండు జట్లు తలపడతాయా? అనే ప్రశ్నలకు ఈ రోజు సమాధానం దొరకనుంది.

Updated : 14 Sep 2023 07:04 IST

నేడే శ్రీలంకతో పాకిస్థాన్‌ పోరు
గెలిచిన జట్టు ఫైనల్‌కు
మధ్యాహ్నం 3 నుంచి
కొలంబో

సియా కప్‌లో మరోసారి భారత్‌, పాక్‌ మ్యాచ్‌ ఉంటుందా? ట్రోఫీ కోసం ఈ రెండు జట్లు తలపడతాయా? అనే ప్రశ్నలకు ఈ రోజు సమాధానం దొరకనుంది. ఫైనల్‌ చేరాలంటే తప్పక నెగ్గాల్సిన సూపర్‌- 4 మ్యాచ్‌లో గురువారం పాకిస్థాన్‌, శ్రీలంక ఢీ కొట్టనున్నాయి. ఇందులో గెలిచిన జట్టు.. ఇప్పటికే తుదిపోరు చేరిన భారత్‌తో కప్పు కోసం ఆదివారం పోటీపడుతుంది. కీలకమైన ఈ మ్యాచ్‌కు ముందు పాక్‌, లంక జట్ల పరిస్థితి వేర్వేరుగా ఉంది. భారత్‌ చేతిలో చిత్తుగా ఓడిన పాక్‌కు.. ఆటగాళ్ల గాయాలు మరింత సమస్యగా మారాయి. దీంతో లంకతో మ్యాచ్‌ కోసం జట్టులో పాక్‌ ఏకంగా అయిదు మార్పులు చేసింది. భారత్‌తో సూపర్‌- 4 మ్యాచ్‌లో నసీమ్‌ షా, హారిస్‌ రవూఫ్‌, సల్మాన్‌ అఘా గాయపడ్డ సంగతి తెలిసిందే. నసీమ్‌ టోర్నీ మొత్తానికే దూరమవగా.. లంకతో పోరులో హారిస్‌ రవూఫ్‌ ఆడడం లేదు. వీళ్ల స్థానాల్లో జమాన్‌ ఖాన్‌, మహమ్మద్‌ వసీం జట్టులోకి వచ్చారు. స్టార్‌ పేసర్‌ షహీన్‌ షా అఫ్రిదితో కలిసి వీళ్లు పేస్‌ భారం మోయనున్నారు. సల్మాన్‌ స్థానాన్ని షకీల్‌ భర్తీ చేశాడు. ఇక ఫకర్‌ జమాన్‌, ఫహీం అష్రఫ్‌ బదులు హారిస్‌, నవాజ్‌ ఆడబోతున్నారు. ఆసియా కప్‌ ఆరంభ మ్యాచ్‌లో నేపాల్‌పై ప్రదర్శన మినహా.. పాక్‌ బ్యాటింగ్‌లో నిలకడ లోపించింది. ఇమాముల్‌ హక్‌తో పాటు కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ పైనే పాక్‌ భారీగా ఆశలు పెట్టుకుంది. వీళ్లే కాకుండా రిజ్వాన్‌, ఇఫ్తికార్‌ అహ్మద్‌ కూడా రాణించాలని కోరుకుంటోంది. మరోవైపు భారత్‌తో పోరులో విజయం కోసం గొప్పగా పోరాడిన లంక.. అదే ఉత్సాహంతో పాక్‌ను ఓడించాలని చూస్తోంది. గాయాలతో హసరంగ, చమీర, లాహిరు కుమార లాంటి ఆటగాళ్ల సేవలను టోర్నీకి ముందే కోల్పోయిన లంక.. అందుబాటులో ఉన్న ఆటగాళ్లతోనే మెప్పిస్తోంది. ముఖ్యంగా యువ స్పిన్నర్‌ దునిత్‌ వెల్లలాగె భారత బ్యాటర్లను కట్టడి చేసిన విధానం లంక ఆత్మవిశ్వాసాన్ని పెంచేదే. దునిత్‌ బ్యాటింగ్‌లోనూ రాణిస్తున్నాడు. అతనితో పాటు పతిరన, తీక్షణ, అసలంకతో లంక బౌలింగ్‌ బలంగానే కనిపిస్తోంది. కానీ బ్యాటింగ్‌ విభాగమే పుంజుకోవాల్సి ఉంది. లీగ్‌ మ్యాచ్‌లో పాక్‌ చేతిలో ఓటమిని మర్చిపోయి.. ఈ సారి విజయం కోసం లంక పోరాడేందుకు సై అంటోంది. ఇప్పటికే పాక్‌, లంకపై విజయాలతో గ్రూప్‌లో నాలుగు పాయింట్లతో భారత్‌ అగ్రస్థానంతో ఫైనల్‌కు చేరింది. బంగ్లాదేశ్‌పై చెరో విజయం సాధించిన శ్రీలంక, పాక్‌ రెండేసి పాయింట్లతో సమానంగా ఉన్నాయి. ఒకవేళ వర్షం కారణంగా పాక్‌తో మ్యాచ్‌ రద్దయితే నెట్‌ రన్‌రేట్‌లో మెరుగ్గా ఉన్న లంక ముందంజ వేస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని