IND vs PAK: 2015 ప్రపంచకప్‌ సందర్భంగా విరాట్ కోహ్లీ అలా అన్నాడు: సోహైల్‌

విరాట్ కోహ్లీ (virat Kohli) మైదానంలో ఎంతో దూకుడుగా ఉంటాడు. ప్రత్యర్థి దేశం పాక్‌ (IND vs PAK) అయితే మరింత దూకుడు ప్రదర్శిస్తాడు. ఆటపరంగానూ అదరొట్టేస్తాడు. ఆటగాళ్లను కవ్వించడంలోనూ ముందుంటాడు. ఇలాంటి సంఘటనను పాక్‌ క్రికెటర్ గుర్తు చేసుకొన్నాడు.

Updated : 04 Feb 2023 12:51 IST

ఇంటర్నెట్ డెస్క్‌: దాయాదుల పోరుపై (IND vs PAK) అభిమానుల్లో సర్వత్రా ఉత్కంఠ ఉంటుంది. ఇక మైదానంలో బరిలోకి దిగిన ఆటగాళ్ల పరిస్థితిని ఊహించడం అసాధ్యమే. విజయం కోసం చివరి బంతి వరకూ పోరాడే క్రమంలో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య స్వల్ప వాగ్వాదం జరగడం సహజం. ఇలాంటి సన్నివేశమే 2015 ప్రపంచకప్‌లోనూ జరిగిందని, విరాట్ కోహ్లీ (Virat Kohli) తనను స్లెడ్జింగ్‌ చేయడానికి ప్రయత్నించాడని పాక్‌ వెటరన్ పేసర్ సోహైల్‌ ఖాన్‌ వ్యాఖ్యానించాడు. అయితే తానూ గట్టిగానే ప్రతిస్పందించినట్లు పేర్కొన్నాడు. 43వ ఓవర్‌లో సోహైల్‌ ఖాన్‌ బ్యాటింగ్‌కు వచ్చాడు. ఈ క్రమంలోనే ఆ సంఘటన చోటు చేసుకొంది.

‘‘అప్పుడే నేను బ్యాటింగ్‌కు వస్తున్నా. ఆ సమయంలో విరాట్ నా దగ్గరకు వచ్చి ‘నువ్వు ఇప్పుడే వచ్చావు. కాస్త అతిగా మాట్లాడుతున్నావు’ అని అన్నాడు. అప్పుడు నేను కూడా స్పందించా. ‘బాబూ, భారత్‌ కోసం అండర్ -19 ఆడేటప్పుడే.. నేను టెస్టు ప్లేయర్‌ని’ అని చెప్పా. ఆ సమయంలో మిస్బా కలగజేసుకొని నా వైపు ఆగ్రహంగా చూశాడు. నన్ను నిశ్శబ్దంగా ఉండమని చెప్పాడు. నేను 2006-2007లోనే టెస్టు మ్యాచ్‌లు ఆడా. అయితే మోకాలి గాయం కారణంగా ఆటకు దూరమయ్యా’’ అని చెప్పాడు. ఆ మ్యాచ్‌లో భారత్‌ (Team India) 76 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టీమ్‌ఇండియా 300/7 స్కోరు సాధించగా.. విరాట్ కోహ్లీ (107) శతకం బాదాడు. అనంతరం పాక్‌ 224 పరుగులకే కుప్పకూలింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని