అరెరె షా.. రోహిత్‌కు కోపం తెప్పించేశావ్‌గా‌‌!

ప్రతిభకు లోటు లేదు. అరంగేట్రంలోనే సెంచరీ. సెహ్వాగ్‌లా బెదురు లేకుండా ప్రతిదాడి చేయడం నైజం. దీంతో టీమిండియాకు మరో విలువైన ఓపెనర్ దొరికాడని ‘పృథ్వీ షా’పై మాజీలు ప్రశంసల జల్లు

Published : 16 Jan 2021 00:27 IST

వైరల్‌ అవుతున్న వీడియో

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రతిభకు లోటు లేదు. అరంగేట్రంలోనే సెంచరీ. సెహ్వాగ్‌లా బెదురు లేకుండా ప్రతిదాడి చేయడం నైజం. దీంతో టీమిండియాకు మరో విలువైన ఓపెనర్ దొరికాడని ‘పృథ్వీ షా’పై మాజీలు ప్రశంసల జల్లు కురిపించారు. కానీ ఆస్ట్రేలియా తొలి టెస్టులో అతడు విఫలమయ్యాడు. టెక్నిక్‌ లోపంతో వరుసగా క్లీన్‌బౌల్డయ్యాడు. అంతేగాక ఫీల్డింగ్‌లో చురుకుదనం లేక క్యాచ్‌లను నేలపాలు చేశాడు. దీంతో తుదిజట్టులో చోటు కోల్పోయాడు.

అయితే నాలుగో టెస్టులో పృథ్వీ షా ఓ పొరపాటుతో మరోసారి వార్తల్లోకెక్కాడు. వికెట్లకు త్రో వేయకుండా ఫీల్డింగ్‌ చేస్తున్న రోహిత్‌కు బంతిని విసిరాడు. అది హిట్‌మ్యాన్‌కు గాయం చేసేలా దూసుకెళ్లింది. కానీ, వెంటనే రోహిత్‌ అప్రమత్తమవ్వడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. కానీ చేతి వేళ్లకు బంతి బలంగా తాకింది. దీంతో పృథ్వీ షాపై నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.

అసలు ఏం జరిగిందంటే.. తొడకండరాలు పట్టేయడంతో నవదీప్‌ సైని మైదానాన్ని వీడాడు. అతడి స్థానంలో షా సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా వచ్చాడు. సుందర్‌ వేసిన 53వ ఓవర్‌లో లబుషేన్‌ మిడ్‌వికెట్‌ మీదగా షాట్‌ ఆడి పరుగుకు ప్రయత్నించాడు. కాగా, షా బంతిని అందుకుని రనౌట్‌ చేసే క్రమంలో నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌కు త్రో విసిరాడు. అయితే ప్రత్యర్థిని ఔట్‌ చేయాలనే తొందరలో.. త్రో విసిరే మార్గంలో రోహిత్‌ ఫీల్డింగ్‌ చేస్తున్నాడనే విషయాన్ని షా మరిచాడు. దీంతో బంతి హిట్‌మ్యాన్‌ వైపునకు దూసుకెళ్లింది. కాగా, రోహిత్‌ అప్రమత్తమై తొడకు తగలాల్సిన ఆ బంతిని చేతులతో ఆపడానికి ప్రయత్నించాడు. చేతి వేళ్లకు బంతి బలంగా తాకింది. దీంతో షా వైపు రోహిత్‌ అసహనంతో చూశాడు.

దీంతో పృథ్వీ షాపై సామాజిక మాధ్యమాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఔట్‌ చేసే తొందరలో పొరపాటు జరిగిందని, ఎవరికైనా ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని కొందరు యువ ఓపెనర్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. మరికొందరు షా ఫీల్డింగ్‌ లోపాల్ని ఎత్తిచూపుతున్నారు. రోహిత్‌కు కోపం తెప్పించేశావ్‌గా అని కామెంట్లు చేస్తున్నారు. రోహిత్‌కు గాయమైతే ఓపెనింగ్‌ స్థానం ఖాళీ అవుతుందని, షా తిరిగి జట్టులోకి వస్తాడని అతడిపై మీమ్స్‌ చేస్తున్నారు.

ఇదీ చదవండి

తొలి రోజు ఆసీస్‌ 274/5

కుల్‌దీప్‌ను తీసుకోకపోవడం ఆశ్చర్యం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని