దక్షిణాఫ్రికా క్రికెట్‌లో గొప్పదేదో జరగబోతోంది: క్వింటన్‌ డికాక్‌

వచ్చే ఏడాది ప్రారంభం కానున్న దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌ ఆసక్తిరేపుతోంది. ఈ దేశంలో ఇది మొదటి టీ20 లీగ్‌ కావడం ఇందుకు ఒక కారణమైతే..

Updated : 25 Nov 2022 20:04 IST

డర్బన్‌: వచ్చే ఏడాది ప్రారంభం కానున్న దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌ ఆసక్తిరేపుతోంది. ఈ దేశంలో ఇది మొదటి టీ20 లీగ్‌ కావడం ఇందుకు ఒక కారణమైతే.. ఈ లీగ్‌లో పాల్గొనబోయే మొత్తం ఆరు జట్లను భారత టీ20 లీగ్‌ ఫ్రాంఛైజీ యజమానులే దక్కించుకోవడం మరో విశేషం. టోర్నమెంట్‌ ఓపెనర్‌ జట్లు.. కేప్‌టౌన్‌ను ముంబయి, పార్ల్‌ జట్టును రాజస్థాన్‌ సొంతం చేసుకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌లోనూ ఈ లీగ్‌కు మంచి ఆదరణ ఏర్పడింది. 

దక్షిణాఫ్రికా క్రికెటర్లు క్వింటన్‌ డికాక్‌, కేశవ్‌ మహరాజ్‌ మాట్లాడుతూ ఇది తమ క్రికెటర్ల భవితవ్యానికి ఎంతో దోహదం చేస్తుందన్నారు. ఈ టోర్నీలో పాల్గొనడంపై హర్షం వ్యక్తం చేశారు. ‘‘నాకు తెలిసి లోకల్‌ ఫ్రాంఛైజీలో ఇదే అతిపెద్ద టోర్నమెంట్. గొప్పదేదో జరగబోతుందని అనిపిస్తోంది. ఇప్పటివరకు ఈ స్థాయిలో ఆడిన అనుభవం లేని యువ ఆటగాళ్లకు, ఇప్పటికే ఆడి నిరూపించుకున్న వారికి సైతం చాలా మంచి అవకాశాలు లభిస్తాయి. దీనికోసం మేం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం’’ అంటూ డికాక్‌ వివరించాడు. 

ఈ లీగ్‌తో ఇప్పటికే టీ20ల్లో ఆరితేరిన ఆటగాళ్లతో ఆడటం గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. కొత్త ఆటగాళ్లతో స్నేహం కుదురుతుంది. దిగ్గజ క్రికెటర్లు ఇందులో పాల్గొంటుండటం వల్ల మా జట్టు ఎంతో నేర్చుకోగలదు. కొత్తవారు తమ నైపుణ్యాలను ప్రదర్శించగలరు. క్వింటన్‌ ఇప్పటికే చాలా మందితో కలిసి ఆడాడు. నేనైతే కరీబియన్‌ లీగ్‌లో అదరగొట్టిన కైల్‌ మేయర్స్‌, జేసన్‌ హోల్డర్‌ వంటి వారితో ఆడేందుకు ఉత్సాహంగా ఉన్నా అంటూ కేశవ్‌ మహరాజ్‌ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని