Ratan Tata: ‘క్రికెట్‌తో నాకేం సంబంధం లేదు’.. రషీద్‌ఖాన్‌కు రూ.10కోట్ల రివార్డ్‌ వార్తలపై రతన్‌ టాటా క్లారిటీ

తాను ఏ క్రికెటర్‌కు రివార్డు ప్రకటించలేదని, క్రికెట్‌తో తనకు ఏ విధంగానూ సంబంధం లేదని ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా (Ratan Tata) స్పష్టం చేశారు. తనపై సోషల్‌మీడియాలో వచ్చిన వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చారు.

Published : 30 Oct 2023 13:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అఫ్గానిస్థాన్‌ టాప్‌ క్రికెటర్‌ రషీద్‌ ఖాన్‌ (Afghan cricketer Rashid Khan)కు ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా (Ratan Tata) రూ.10 కోట్లు రివార్డు ప్రకటించారంటూ ఇటీవల సోషల్‌ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. దీనిపై రతన్‌ టాటా సోమవారం ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ.. ఆ వార్తలను కొట్టిపారేశారు. తాను ఏ క్రికెటర్‌ తరఫున మాట్లాడలేదని, అలాంటి ఫార్వర్డ్‌ మెసేజ్‌లను నమ్మొద్దని క్లారిటీ ఇచ్చారు. అసలేం జరిగిందంటే..

వన్డే ప్రపంచకప్‌ టోర్నీ (ODI World Cup 2023)లో భాగంగా ఇటీవల పాకిస్థాన్‌పై అఫ్గాన్‌ (AFG vs PAK) సంచలన విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్‌ అనంతరం జరిగిన అఫ్గాన్‌ సెలబ్రేషన్స్‌లో క్రికెటర్‌ రషీద్‌ ఖాన్‌ భారత జెండాను పట్టుకుని కన్పించారని, దీంతో అతడికి ఐసీసీ రూ.55 లక్షలు జరిమానా విధించిందని ఇటీవల కొందరు నెటిజన్లు సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ఈ విషయం తెలిసి రతన్‌ టాటా.. రషీద్‌ ఖాన్‌కు రూ.10 కోట్లు ఆర్థిక సాయం ప్రకటించారని ఆ పోస్టుల్లో రాసుకొచ్చారు.

ఇంగ్లాండ్‌పై విక్టరీ మరెంతో ‘స్పెషల్‌’.. స్టంప్స్‌నే టార్గెట్‌ చేస్తూ..!

ఇది కాస్తా సోషల్‌మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. దీంతో ఈ వార్తలపై రతన్‌ టాటా తీవ్రంగా స్పందించారు. ‘‘ఏ ఆటగాడి జరిమానా గురించి నేను ఐసీసీ (ICC), ఇతర ఏ క్రికెట్‌ సంస్థలకు ఎలాంటి సూచనలు చేయలేదు. ఏ ఆటగాడికి రివార్డు ప్రకటించలేదు. క్రికెట్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదు. నా నుంచి అధికారిక సమాచారం వస్తే తప్ప.. ఇలాంటి వాట్సప్‌ ఫార్వర్డ్‌ సందేశాలు, అసత్య వీడియోలను నమ్మొద్దు’’ అని రతన్‌ టాటా (Ratan Tata) ఎక్స్‌ వేదికగా స్పష్టం చేశారు.

చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాక్‌ను అఫ్గాన్‌ ఓడించింది. ఆ తర్వాత జరిగిన వేడుకల్లో రషీద్‌ ఖాన్‌తో టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ డ్యాన్స్‌ చేస్తూ కన్పించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని