Gujarat Titans: హైదరాబాద్‌తో మ్యాచ్‌లో గుజరాత్ స్పెషల్‌ జెర్సీ.. కారణమిదే

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (SRH)తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ (GT) అద్భుత విజయాన్ని సాధించిన ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది. హోంగ్రౌండ్‌లో ఆడిన తన చివరి మ్యాచ్‌లో హర్దిక్‌ సేన ప్రత్యేకంగా లావెండర్‌ జెర్సీ (Lavender Jersey)తో కన్పించింది.

Updated : 16 May 2023 10:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అరంగేట్రంలోనే ఛాంపియన్‌గా అవతరించిన గుజరాత్‌ టైటాన్స్‌ (Gujarat Titans).. ఈ ఐపీఎల్‌ (IPL) సీజన్‌లోనూ అదరగొడుతోంది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో తొమ్మిదో విజయాన్ని ఖాతాలో వేసుకున్న హార్దిక్‌ (Hardik Pandya) సేన.. ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్‌ చేరిన తొలి జట్టుగా నిలిచింది. గత రాత్రి సొంత మైదానంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (Sunrisers Hyderabad)తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్‌లో గుజరాత్ జట్టు ఎప్పటిలా ముదురు నీలం రంగు కాకుండా లావెండరీ (ఊదా రంగు) కలర్‌ జెర్సీలో కన్పించింది. దీని వెనుక ఓ గొప్ప కారణం ఉంది. క్యాన్సర్‌ (Cancer)పై అవగాహన కల్పించేందుకే టైటాన్స్‌ ఆటగాళ్లు ఈ ప్రత్యేక జెర్సీ ధరించినట్లు ఆ జట్టు మేనేజ్‌మెంట్ వెల్లడించింది.

‘‘ప్రతి ఒక్కరి ఆరోగ్యం, శ్రేయస్సు పట్ల గుజరాత్‌ టైటాన్స్ ఆరాటపడుతుంది. క్యాన్సర్‌ బాధితులకు అండగా ఉండేందుకు, ఆ వ్యాధిపై అందరికీ అవగాహన కల్పించేందుకు మా వంతు ప్రయత్నం ఇది’’ అని టైటాన్స్‌ జట్టు ట్విటర్‌లో వెల్లడించింది. గుజరాత్‌ జట్టు అహ్మదాబాద్‌లో ఈ సీజన్‌లో చివరి లీగ్‌ మ్యాచ్‌ సోమవారం ఆడింది. ఈ సందర్భంగా ఈ ప్రత్యేక లావెండర్‌ జెర్సీ (Lavender Jersey)ని ధరించింది. దీనిపై టైటాన్స్‌ సారథి హార్దిక్‌ పాండ్య (Hardik Pandya) మాట్లాడుతూ.. ‘‘మన దేశంలోనే గాక, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్యాన్సర్‌ (Cancer)తో పోరాడుతున్నారు. ఈ ప్రాణాంతక వ్యాధిపై అవగాహన కల్పించడం మా బాధ్యతగా భావించాం. క్యాన్సర్‌ బాధితులకు అండగా నిలిచేందుకే మేం లావెండర్ జెర్సీ వేసుకున్నాం. ఈ చర్య ఇతరుల్లో స్ఫూర్తి నింపుతుందని మేం విశ్వసిస్తున్నాం’’ అని తెలిపాడు.

గతంలో దిల్లీ కూడా..

సాధారణంగా అన్నవాహిక క్యాన్సర్‌కు సూచికగా లావెండర్‌ రంగును ఉపయోగిస్తారు. అయితే, ఇప్పుడు అన్ని రకాల క్యాన్సర్లకు ఈ రంగునే సూచికగా వినియోగిస్తున్నారు. కాగా.. ఐపీఎల్‌లో ఆటగాళ్లు లావెండర్‌ జెర్సీ (Lavender Jersey)తో కన్పించడం ఇదే తొలిసారి కాదు. గతంలో 2015లో దిల్లీ డేర్‌డెవిల్స్‌ (ఇప్పటి దిల్లీ క్యాపిటల్స్‌) కూడా ఇలాంటి ప్రయత్నమే చేసింది. క్యాన్సర్‌ను జయించిన మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ నేతృత్వంలో ఆ జట్టు ఊదా రంగు జెర్సీలో ఓ మ్యాచ్‌ ఆడింది.

ఇక ఐపీఎల్‌ (IPL)లో మరో జట్టు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB) కూడా ఏటా ఒక మ్యాచ్‌లో గ్రీన్‌ జెర్సీ ధరిస్తున్న విషయం తెలిసిందే. పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు 2011 నుంచి ఆర్‌సీబీ తన హోం గ్రౌండ్‌లో జరిగే ఒక మ్యాచ్‌లో గ్రీన్‌ జెర్సీతో బరిలోకి దిగడం ఆనవాయితీగా మార్చుకుంది. ఈ సీజన్‌లో ముంబయి ఇండియన్స్‌ కూడా జెర్సీలో చిన్న మార్పు చేసి బరిలోకి దిగింది. ఆడపిల్లలు క్రీడలను తమ కెరీర్‌గా ఎంచుకునేలా ప్రోత్సహించేందుకు ఏప్రిల్ 16న కోల్‌కతాతో ఆడిన మ్యాచ్‌లో ప్రత్యేక జెర్సీ ధరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని