DK - Rohit Sharma: ‘వరల్డ్‌ కప్‌ ఆడాలి’.. దినేశ్‌ కార్తిక్‌ను స్లెడ్జ్‌ చేసిన రోహిత్!

భారత క్రికెటర్లు స్లెడ్జ్‌ చేయడం చాలా తక్కువ. విదేశీ జట్లతో ఆడేటప్పుడు మాత్రమే అది మైదానంలో కనిపిస్తుంది. కానీ, ఇక్కడ భారత సీనియర్‌ ప్లేయర్‌నే రోహిత్ శర్మ స్లెడ్జ్‌ చేయడం గమనార్హం. అయితే, అదంతా సరదాగానే సాగింది.

Updated : 12 Apr 2024 15:49 IST

ఇంటర్నెట్ డెస్క్: డీకే.. దినేశ్‌ కార్తిక్‌ (Dinesh Karthik) ఈ పేరు వింటే తప్పకుండా ‘ది ఫినిషర్‌’ గుర్తుకొస్తాడు. భారత జట్టుకు కొన్నాళ్లపాటు ఈ పాత్రను పోషించాడు. ఇప్పుడు బెంగళూరు జట్టులో అద్భుతంగా ఆడుతున్న ఇద్దరు బ్యాటర్లలో డీకే ఒకడు. టాప్‌ ఆర్డర్‌లో విరాట్ కోహ్లీ రాణిస్తుంటే.. లోయర్‌ ఆర్డర్‌లో దూకుడుగా ఆడుతూ బెంగళూరు మంచి స్కోరు సాధించడంలో కార్తిక్‌ కీలకంగా మారాడు. వచ్చే టీ20 ప్రపంచ కప్‌ రేసులో తానూ ఉన్నట్లు సెలక్టర్లకు బలమైన సంకేతాలు పంపేలా ప్రస్తుత ఐపీఎల్‌లో విరుచుకుపడుతున్నాడు. ముంబయితో జరిగిన మ్యాచ్‌లోనూ దూకుడు ప్రదర్శించాడు. ఈ సందర్భంగా డీకేను రోహిత్ శర్మ (Rohit Sharma) సరదాగా స్లెడ్జ్‌ చేయడం స్టంప్‌ మైక్‌లో రికార్డైంది. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘‘వరల్డ్‌ కప్‌ను మదిలో పెట్టుకొని ఆడుతున్నాడు. జట్టు సెలక్షన్‌ కోసం ప్రోత్సహిద్దాం. శభాష్ డీకే.. కమాన్‌ ప్రపంచ కప్‌ ఆడాలని ఉందా? అదరగొట్టేస్తున్నావు. డీకే.. నువ్వు ప్రపంచ కప్‌ ఆడాలి’’ అని రోహిత్ సరదాగా వ్యాఖ్యానించాడు. అయితే, అందుకు తగ్గట్టే డీకే కూడా బౌండరీలతో విరుచుకుపడ్డాడు.

నా బ్యాడ్‌లక్‌.. 

రోహిత్‌కు మైదానంలోని స్టంప్‌ మైక్‌తో ఓ విడదీయని బంధం ఉంది. అతడు ఆటగాళ్లతో జరిపే సంభాషణలు తరచూ దీనిలో రికార్డై వైరలవుతుంటాయి. ఈ అంశంపై ఇటీవల ది గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌ షోలో కూడా ప్రస్తావనకు వచ్చింది. ‘‘మీరు కోపంలో ఎవరికైనా హితబోధ చేశారా..? మీ మ్యాచ్‌ ఫీజులో కోతపడిందా..?’’ అని కపిల్‌ సరదాగా అడిగాడు. దీనికి రోహిత్‌ నవ్వుతూ ‘‘డబ్బులు కట్‌కావు.. మేము హిందీలో మాట్లాడుకుంటాము.. మ్యాచ్‌ రిఫరీకి ఇంగ్లిష్‌ మాత్రమే అర్థమవుతుంది. కుర్రాళ్లు బాగా ఆడండి. మ్యాచ్‌ గెలవాలి అని మాత్రమే చెబుతాను.. అంతకు మించి ఏమీ అనను. కానీ, అసలు విషయం ఏమిటంటే.. నేను మైదానంలో ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటా.. కానీ, దురదృష్టవశాత్తు ఆ టైంలో నేను మైకు వెనకే ఉంటాను. నేను మాట్లాడే ప్రతిదీ అందరికీ వినిపిస్తుంది. ఏంచేస్తాం సర్‌.. మా కుర్రాళ్లు సోమరి కోళ్లు. పరుగెత్తరు.. చెప్పాల్సి వస్తుంది’’ అని సరదాగా సమాధానం ఇచ్చాడు. దీనికి ప్రేక్షకులు పగలబడి నవ్వారు. సాధారణంగా రోహిత్ మైదానంలో తనదైన యాసలో ఫీల్డింగ్‌ సెట్‌ చేయడం.. లేదా తోటి ఆటగాళ్లతో సంభాషించడం చేస్తుంటాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని