WTC Final: కివీస్‌కు సరైన బలముంది 

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో అద్భుత ప్రదర్శన కనబర్చిన న్యూజిలాండ్‌ తన రిజర్వ్‌బెంచ్‌ బలమేంటో చూపించిందని ఆ జట్టు స్టార్‌ బ్యాట్స్‌మన్‌ రాస్‌టేలర్‌ అన్నాడు. దాంతో శుక్రవారం నుంచి టీమ్‌ఇండియాతో తలపడే ప్రపంచ...

Published : 14 Jun 2021 01:33 IST

న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మన్‌ రాస్‌టేలర్‌..

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో అద్భుత ప్రదర్శన కనబర్చిన న్యూజిలాండ్‌ తన రిజర్వ్‌బెంచ్‌ బలమేంటో చూపించిందని ఆ జట్టు స్టార్‌ బ్యాట్స్‌మన్‌ రాస్‌టేలర్‌ అన్నాడు. దాంతో శుక్రవారం నుంచి టీమ్‌ఇండియాతో తలపడే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు ముందు సెలక్టర్లు జట్టును ఎంపిక చేసేటప్పుడు అవసరమైనంత మంది ఆటగాళ్లు అందుబాటులో ఉంటారన్నాడు.

‘ఈ మ్యాచ్‌ యువకులకు పరీక్షలాంటిది, ఇందులో ఆరు మార్పులతో బరిలోకి దిగాము. కొందరు గాయాల కారణంగా తప్పుకోగా, మరికొందర్ని బలవంతంగా తప్పించాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే కొత్తగా జట్టులోకి వచ్చిన విల్‌ యంగ్‌, మాట్‌ హెన్రీ, అజాజ్‌ పటేల్‌ లాంటి ఆటగాళ్లు బాగా ఆడారు. దాంతో టీమ్‌ఇండియాతో జరిగే ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు తుది జట్టును ఎంపిక చేయడానికి సెలక్టర్లకు బలమైన బ్యాకప్‌ ఆటగాళ్లు దొరికారు’ అని టేలర్‌ వివరించాడు.

కాగా, ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్‌ ఆరు మార్పులు చేసి బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ గాయం కారణంగా తప్పుకోగా, టిమ్‌ సౌథీ, కైల్‌ జేమీసన్‌ విశ్రాంతి తీసుకున్నారు. ఈ క్రమంలోనే మూడో రోజు ఆటలో న్యూజిలాండ్‌ ఆతిథ్య జట్టుపై పూర్తిస్థాయి ఆధిపత్యం చెలాయించింది. దాంతో ఆట నిలిచిపోయేసరికి రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 122/9తో నిలిచింది. ప్రస్తుతం ఆ జట్టు 37 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. నాలుగో రోజు కివీస్‌ త్వరగా చివరి వికెట్‌ను పడగొట్టి లక్ష్యాన్ని పూర్తి చేస్తే 22 ఏళ్ల తర్వాత ఇంగ్లిష్‌ గడ్డపై టెస్టు సిరీస్‌ కైవసం చేసుకోనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని