Sania Mirza: టెన్నిస్‌కు సానియా మీర్జా వీడ్కోలు.. ట్విటర్‌లో ఉద్వేగభరిత పోస్టు

భారత స్టార్‌ ప్లేయర్‌ సానియా మీర్జా తన ట్విటర్‌ ఖాతాలో రిటైర్మెంట్‌పై ఉద్వేగభరిత పోస్టు చేశారు. 

Updated : 13 Jan 2023 22:58 IST

హైదరాబాద్‌: భారత స్టార్‌ ప్లేయర్‌ సానియా మీర్జా త్వరలో టెన్నిస్‌కు వీడ్కోలు పలకనున్నారు. ఈమేరకు శుక్రవారం తన ట్విటర్‌ ఖాతాలో రిటైర్మెంట్‌పై ఉద్వేగభరిత పోస్టు చేశారు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌, దుబాయ్‌ ఓపెన్‌ తర్వాత ఆటకు వీడ్కోలు పలకనున్నట్లు వెల్లడించారు. ఈ టోర్నీలు తనకు చివరివని 3 పేజీల నోట్‌ను ట్వీట్‌కు జత చేశారు.

ఫిబ్రవరిలో దుబాయ్‌ వేదికగా జరిగే డబ్ల్యూటీఏ 1000 టోర్నీలో తాను కెరీర్‌ను ముగించనున్నట్లు సానియా ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. 36 ఏళ్ల సానియా కొత్త ఏడాదిలో ముందుగా ఆస్ట్రేలియా ఓపెన్‌ ఆడనుంది. అందులో కజకిస్థాన్‌ క్రీడాకారిణి అనా డనిలినాతో కలిసి ఆమె మహిళల డబుల్స్‌లో పోటీ పడనుంది. ఇదే ఆమెకు చివరి గ్రాండ్‌స్లామ్‌ కానుంది. ఆ టోర్నీ పూర్తయ్యాక దుబాయ్‌లో ఆమె కెరీర్‌లో చిట్టచివరి టోర్నీ ఆడనుంది. నిరుడు యుఎస్‌ ఓపెన్‌ ఆడి ఆటకు గుడ్‌బై చెప్పాలనుకున్న సానియాకు గాయం అడ్డంకిగా మారింది. అందుకే రిటైర్మెంట్‌ను వాయిదా వేసుకుంది.

నా కలలు అప్పుడే ప్రారంభమయ్యాయి..

‘‘ముప్పైఏళ్ల క్రితం హైదరాబాద్‌లోని నాసర్‌ స్కూల్‌లో చదివే ఆరేళ్ల అమ్మాయి నిజామ్‌ క్లబ్‌లో టెన్నిస్‌ నేర్చుకునేందుకు వెళితే, వయసు తక్కువగా ఉందని కోచ్‌ తిరస్కరించాడు. ఆ సమయంలో అమ్మాయి తల్లి కోచ్‌తో పోట్లాడి టెన్నిస్‌ శిక్షణ ఇచ్చేందుకు ఒప్పించింది. అప్పుడే ఆరేళ్ల అమ్మాయి కలలు ప్రారంభమయ్యాయి. ఎన్నో ఆశలతో ప్రపంచ ఆటలోకి అడుగుపెట్టిన ఆ అమ్మాయి ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు సైతం గెలుచుకుంది’’ అంటూ సానియా పోస్ట్‌లో పేర్కొంది. 

‘‘నా కెరీర్‌లో వెనక్కి తిరిగి చూసుకుంటే 50 గ్రాండ్ స్లామ్స్‌పైగా ఆడాను. వాటిల్లో కొన్ని టైటిల్స్ గెలిచాను. గెలిచిన తర్వాత స్టేడియంలో త్రివర్ణ పతాకంతో నిలబడం నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తాను. రిటైర్మెంట్‌ గురించి లేఖ రాస్తున్నప్పుడు నా కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి, గర్వంతో నా మనసు ఉప్పొంగుతోంది. నాకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. హైదరాబాద్ నుంచి వచ్చిన ఓ అమ్మాయి, టెన్నిస్ ప్రపంచంలో ఎన్నో విజయాలు అందుకోగలిగిందంటే సామాన్య విషయం కాదు. నా కల సాకారం అవ్వడంలో నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృత్రజ్ఞలు చెబుతున్నా. నా గ్రాండ్ స్లామ్ జర్నీని 2005లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌తో మొదలెట్టా.. అక్కడే నా కెరీర్‌ను  ముగించడం సమంజమని భావిస్తున్నా..’’ అని సానియా మీర్జా లేఖలో పేర్కొంది.  

2003లో అంతర్జాతీయ ఆటలోకి అడుగుపెట్టిన సానియా మీర్జా 2005లో తొలిసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌తో తన ప్రొఫెషనల్‌ కెరీర్‌ను ప్రారంభించింది. ఇప్పుడదే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఆడి తన ఆటకు గుడ్‌బై చెప్పాలని భావిస్తోంది. 2003లో ప్రొఫెషనల్ టెన్నిస్‌లోకి అడుగుపెట్టిన సానియా... ఆరు సార్లు డబుల్స్ మేజర్ టైటిల్స్ గెలిచింది. 2010 కామన్వెల్త్ గేమ్స్‌లో వుమెన్స్ సింగిల్స్‌లో రజతం గెలిచింది. సింగిల్స్‌లో గరిష్ఠంగా 27వ ర్యాంకును పొందిన సానియా, 2015లో డబుల్స్‌లో వరల్డ్ నంబర్‌ వన్‌ ర్యాంకును పొందింది. 

36ఏళ్ల టెన్నిస్ స్టార్ పాక్ క్రికెటర్ సోయబ్ మాలిక్‌ని 2010లో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వీరి 2018లో సానియా మీర్జాకు ఇజాన్‌ పుట్టాడు. ప్రస్తుతం నాలుగేళ్ల కొడుకుతో దుబాయ్‌లో ఉంటోంది.అక్కడే టెన్నిస్ అకాడమీని ప్రారంభించింది


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని