Sanju Samson: శ్రీలంకతో సిరీస్‌కు దూరం కావడంపై సంజు పోస్ట్‌

శ్రీలంకతో సిరీస్‌ నుంచి వైదొలిగిన తర్వాత సంజు శాంసన్‌(Sanju Samson) ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ను షేర్‌ చేశాడు.

Published : 06 Jan 2023 16:48 IST

పుణె:  జట్టులో అవకాశాల విషయంలో సామాజిక మాధ్యమాల్లో సంజు శాంసన్‌(Sanju Samson)కు విపరీతమైన మద్దతు లభించిన విషయం తెలిసిందే. కానీ, లేక లేక వచ్చిన ఒకే ఒక్క అవకాశం కూడా ఈ వికెట్‌ కీపర్‌కు కలిసిరాలేదు. శ్రీలంకతో  సిరీస్‌కు సైతం ఈ ఆటగాడు దూరమయ్యాడు. మంగళవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌(IND vs SL 2023)లో బౌండరీ వద్ద బంతిని ఆపే క్రమంలో అతడి ఎడమ మోకాలికి గాయమైంది. దీంతో అతడి స్థానంలో జితేశ్‌ శర్మను సెలక్షన్‌ కమిటీ ప్రకటించింది. ఈ సిరీస్‌ నుంచి వైదొలిగిన నేపథ్యంలో సంజు తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ పోస్టును పంచుకున్నాడు. 

మైదానంలోని స్టాండ్స్‌ వైపు చూస్తున్న ఫొటోను పోస్ట్‌ చేస్తూ ‘ఆల్‌ ఈజ్‌ వెల్‌.. త్వరలోనే తిరిగొస్తాను’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చాడు. నిజానికి ఈ సిరీస్‌ సంజుకి చాలా కీలకమైంది. ఇందులో నిరూపించుకుంటే టీ20లో సుస్థిర స్థానం లభించే అవకాశాలు ఉండేవి. కానీ, తొలి మ్యాచ్‌లో కేవలం 5 పరుగులే చేయడం, గాయంతో వెనుదిరగడం అతడికి చేదు అనుభవాన్ని మిగిల్చింది.  

సంజు గాయంపై బీసీసీఐ(BCCI) ఇటీవల స్పందించింది. బుధవారం అతడి కాలిని స్కానింగ్‌ తీశారు. మరో 20 రోజుల పాటు సంజుకి విశ్రాంతి ఇవ్వనున్నట్టుగా తెలిపింది. సంజు ఈ సిరీస్‌ నుంచి వైదొలగడం.. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న రాహుల్‌ త్రిపాఠికి అవకాశం అందించింది. రెండో టీ20లో అరంగేట్రం చేసిన రాహుల్ నంబర్‌ 3 స్థానంలో బ్యాటింగ్‌కి దిగి 5 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇక ఈ మ్యాచ్‌లో 16 పరుగుల తేడాతో గెలిచిన శ్రీలంక.. సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఇరు జట్ల మధ్య కీలక మ్యాచ్‌ రాజ్‌కోట్‌ వేదికగా శనివారం జరగనుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని