Prithvi Shaw: దాడి చేయొద్దని పృథ్వీ షాను వేడుకున్నా.. క్రికెటర్‌పై సప్నాగిల్‌ ఫిర్యాదు

సెల్ఫీ దాడి ఘటనతో వార్తల్లో నిలిచిన టీమ్‌ఇండియా యువ ఆటగాడు పృథ్వీ షా (Prithvi Shaw) కొత్త సమస్యల్లో చిక్కుకున్నాడు. ఈ కేసులో నిందితురాలైన యూట్యూబర్‌ సప్నా గిల్‌.. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Published : 21 Feb 2023 11:00 IST

ముంబయి: సెల్ఫీ కోసం టీమ్‌ఇండియా (Team India) ఆటగాడు పృథ్వీ షా (Prithvi Shaw)పై దాడి ఘటన ఇటీవల తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనతో వార్తల్లో నిలిచిన పృథ్వీ.. ఇప్పుడు కొత్త సమస్యల్లో చిక్కుకున్నాడు. ఈ కేసులో నిందితురాలిగా అరెస్టయిన యూట్యూబర్‌ సప్నా గిల్‌.. ఈ యువ క్రికెటర్‌పై  ఫిర్యాదు చేశారు. తన మర్యాదకు భంగం కలిగించినందుకు గానూ అతడిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ముంబయి పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించారు.

గతవారం ముంబయి (Mumbai)లోని ఓ ప్రముఖ హోటల్‌ వద్ద పృథ్వీ షా, అతడి స్నేహితులపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.  పృథ్వీ సెల్ఫీ (Selfie) నిరాకరించడంతో అతడితో దురుసుగా ప్రవర్తించడమే కాక, స్నేహితుడి కారును ధ్వంసం చేశారు. అంతేగాక, తప్పుడు కేసు పెడతామంటూ నిందితులు డబ్బులు డిమాండ్‌ చేశారు. ఈ ఘటనకు సంబంధించి సప్నా గిల్‌ సహా 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే సప్నా గిల్‌ను కోర్టులో హాజరుపర్చగా.. ఆమెకు మూడు రోజుల కస్టడీ విధించారు.

ఆ కస్టడీ సోమవారం నాటికి ముగియడంతో కోర్టు ఆమెకు బెయిల్‌ మంజూరు చేసింది. బెయిల్‌పై బయటకు వచ్చిన సప్నా.. నిన్న అంధేరీ పోలీసు స్టేషన్‌లో పృథ్వీ షా (Prithvi Shaw), అతడి స్నేహితులపై ఫిర్యాదు చేశారు. ‘‘నా ఫ్రెండ్‌తో కలిసి నేను హోటల్‌కు వెళ్లగా అక్కడ పృథ్వీ షా తన స్నేహితులతో కన్పించాడు. నా స్నేహితుడు ఓ టీనేజర్‌. క్రికెట్‌ అభిమాని కావడంతో సెల్ఫీ కోసం వాళ్ల వద్దకు వెళ్లాడు. అప్పటికే పృథ్వీ సహా అతడి స్నేహితులు మద్యం మత్తులో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వారు ఎలా ప్రవర్తిస్తారో నా స్నేహితుడికి తెలియదు. వారు అతడిపై దాడి చేశారు. అందువల్లే నేను జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. నా స్నేహితుడిని కాపాడేందుకే నేను మధ్యలో వెళ్లాను. నా ఫ్రెండ్‌కు హానీ చేయొద్దని పృథ్వీషాను వేడుకున్నా. కానీ, వారు వినిపించుకోలేదు. పైగా నేను దాడి చేశానని అంటూ నాపై కేసు పెట్టారు’’ అని సప్నా గిల్‌ తన దరఖాస్తులో ఆరోపించారు. తన పరువు, మర్యాదలకు భంగం కలిగించినందుకు గానూ పృథ్వీ (Prithvi Shaw), అతడి స్నేహితులపై కేసు నమోదు చేయాలని అభ్యర్థించారు. అయితే దీనిపై పోలీసులు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని