T20 World Cup:రోహిత్ శర్మ ఇండియా కా ఇంజమామ్: షోయబ్‌ అక్తర్‌

భారత్, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ ముంగిట పాక్‌ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత ఓపెనర్‌ రోహిత్ శర్మని ప్రశంసలతో ముంచెత్తాడు.  హిట్ మ్యాన్‌ని పాక్‌ మాజీ కెప్టెన్‌ ఇంజామమ్‌ ఉల్‌ హక్‌తో పోల్చాడు. పాకిస్థాన్‌లో రోహిత్‌ని ‘ఇండియా కా ఇంజిమామ్’అని

Published : 23 Oct 2021 01:12 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత్, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ ముంగిట పాక్‌ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత ఓపెనర్‌ రోహిత్ శర్మని ప్రశంసలతో ముంచెత్తాడు. హిట్ మ్యాన్‌ని పాక్‌ మాజీ కెప్టెన్‌ ఇంజామమ్‌ ఉల్‌ హక్‌తో పోల్చాడు. పాకిస్థాన్‌లో రోహిత్‌ని ‘ఇండియా కా ఇంజిమామ్’ అని పిలుస్తారని పేర్కొన్నాడు.

‘‘నేను రోహిత్ శర్మతో 2013లో మాట్లాడా. ‘చూడు. నీలాగా క్రీజులో ఎక్కువ సమయం గడిపేవాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. నీ సామర్థ్యాన్ని నువ్వు అర్థం చేసుకో’ అని అతడికి చెప్పా. చివరకు అతడు తన సామర్థ్యాన్ని గుర్తించి దాన్ని ఉపయోగించుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. భారత క్రికెట్‌లోని సూపర్‌స్టార్స్‌లో రోహిత్‌ ఒకడు. అతడికున్న టైమింగ్‌, హిట్టింగ్‌ పవర్‌ మరెవరికీ లేదు. అతడు అద్భుతమైన ఆటగాడు. రోహిత్‌ శర్మ ఇండియా ఇంజామామ్‌ ఉల్‌ హక్‌’అని షోయబ్‌ అక్తర్ హిట్‌మ్యాన్‌ని ప్రశంసించాడు.

అక్టోబరు 24న (ఆదివారం) భారత్, పాక్ మధ్య జరగనున్న మ్యాచ్ గురించి అక్తర్ మాట్లాడాడు. భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌ నుంచి పాక్‌కు ప్రమాదం పొంచి ఉందని, వారిని తేలిగ్గా తీసుకోవద్దని పాకిస్థాన్‌ పేసర్లను హెచ్చరించాడు. ‘భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌ గురించి పాక్‌ తీవ్రంగా ఆందోళన చెందుతోంది. వారిద్దరూ చెలరేగి ఆడి మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటర్ల మీద ఒత్తిడి లేకుండా చేస్తారు’ అని అక్తర్‌ అన్నాడు. ఈ టీ20 ప్రపంచకప్‌ అనంతరం పొట్టి ఫార్మాట్‌లో కెప్టెన్సీ తప్పుకుంటానని విరాట్‌ కోహ్లి ప్రకటించడంపై అక్తర్ స్పందించాడు. ‘విరాట్ కోహ్లీ చాలా ఆశయాలతో ప్రపంచకప్‌కు వెళ్తున్నాడు. టీ20  కెప్టెన్సీని కప్‌ కొట్టి ముగించాలనుకుంటున్నాడు. కాబట్టి ఒత్తిడికి లోనవుతాడు. అతడు అనవసరమైన ఒత్తిడికి గురికాకూడదు. నా ఆశీస్సులు అతడికి ఉంటాయి. కోహ్లి తన టీ20 కెప్టెన్సీని ఉన్నతంగా ముగించాలని కోరుకుంటున్నా. అతడు కూడా అదే ఆశిస్తున్నాడు’ అని షోయబ్‌ అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని