Virat Kohli : పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌లో.. కోహ్లీ పోస్టర్‌.!

టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులున్న విషయం తెలిసిందే. పాకిస్థాన్‌లోనూ విరాట్‌ని ఆరాధించే వాళ్లు చాలా మందే ఉన్నారు. అతడు క్రీజులో..

Published : 22 Feb 2022 01:31 IST

(Photo: Shoaib Akhtar twiiter)

ఇంటర్నెట్‌ డెస్క్‌ : టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులున్న విషయం తెలిసిందే. పాకిస్థాన్‌లోనూ విరాట్‌ని ఆరాధించే వాళ్లు చాలా మందే ఉన్నారు. అతడు క్రీజులో కుదురుకుంటే అభిమానులకు పండగే. కళాత్మక షాట్లతో అలరిస్తుంటాడు. తన బ్యాటింగ్‌తో అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. దిగ్గజ ఆటగాళ్లలో ఒకడిగా పేరు సంపాదించుకున్నాడు. 

తాజాగా, పాక్‌లో జరుగుతున్న పాకిస్థాన్ సూపర్ లీగ్‌ (పీఎస్‌ఎల్‌)లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఓ అభిమాని ‘విరాట్‌ కోహ్లీ.. పాకిస్థాన్‌లో సెంచరీ కొడితే చూడాలని ఉంది’ అని రాసి ఉన్న పోస్టర్‌ని పట్టుకుని కనిపించాడు. ఆ ఫొటోను పాక్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకుని.. ‘గఢాపీ స్టేడియంలో ఓ వ్యక్తి ఇలా అభిమానం చాటుకున్నాడు’ అనే వ్యాఖ్యను జత చేశాడు. ప్రస్తుతం ఆ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీ సెంచరీ నమోదు చేయక రెండేళ్లకు పైగా అవుతోంది. చివరి సారిగా నవంబరు 2019లో శతకం బాదాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మూడంకెల స్కోరును అందుకోలేకపోయాడు. అయినా అతడి సగటు 40కి పైగా ఉండటం విశేషం. అప్పుడప్పుడు అర్ద శతకాలు నమోదు చేస్తున్నా.. వాటిని శతకాలుగా మార్చలేకపోతున్నాడు. 

అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీ 70 శతకాలు (వన్డేల్లో 43, టెస్టుల్లో 27) నమోదు చేశాడు. కోహ్లీ బ్యాటు నుంచి 71వ శతకం కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఎదురు చూస్తున్నారు.! ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న కోహ్లీ.. మార్చి 4 నుంచి శ్రీలంకతో జరుగనున్న టెస్టు సిరీస్‌కు అందుబాటులోకి రానున్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని