జట్టు ఎంపికలో కృత్రిమ మేధ

ఏ క్రీడలోనైనా ఆటగాళ్ల ఫామ్‌, ఫిట్‌నెస్‌, ప్రత్యర్థిని చూసి సెలక్టర్లు జట్టును ఎంపిక చేస్తారు. కానీ ఇప్పుడా పని కృత్రిమ మేధ (ఏఐ) చేస్తోంది. అవును.. ఇది నిజం. పిచ్‌ పరిస్థితులు, ప్రత్యర్థి ఆటగాళ్లు, అందుకు తగ్గట్లు కూర్పు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మైదానంలో బరిలో దిగే తుది జట్టును ఏఐ నిర్ణయిస్తోంది.

Updated : 05 May 2024 09:30 IST

లండన్‌: ఏ క్రీడలోనైనా ఆటగాళ్ల ఫామ్‌, ఫిట్‌నెస్‌, ప్రత్యర్థిని చూసి సెలక్టర్లు జట్టును ఎంపిక చేస్తారు. కానీ ఇప్పుడా పని కృత్రిమ మేధ (ఏఐ) చేస్తోంది. అవును.. ఇది నిజం. పిచ్‌ పరిస్థితులు, ప్రత్యర్థి ఆటగాళ్లు, అందుకు తగ్గట్లు కూర్పు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మైదానంలో బరిలో దిగే తుది జట్టును ఏఐ నిర్ణయిస్తోంది. ఇంగ్లాండ్‌ మహిళల క్రికెట్‌ జట్టు ఎంపికలో ఏఐ సాయం తీసుకున్నట్లు ప్రధాన కోచ్‌ జాన్‌ లూయిస్‌ వెల్లడించాడు. దీని కారణంగా ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ కూడా గెలిచామన్నాడు. 2023 మహిళల ప్రిమియర్‌ లీగ్‌లో యూపీ వారియర్స్‌కు కోచ్‌గా ఉన్న సమయంలో తనకు ఈ సాంకేతికత అందిస్తున్న లండన్‌ సంస్థ పీఎస్‌ఐ గురించి తెలిసిందని లూయిస్‌ పేర్కొన్నాడు. గతేడాది మహిళల యాషెస్‌ సిరీస్‌లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో ఒకే రకమైన నైపుణ్యాలు ఉన్న ఇద్దరు క్రికెటర్లలో ఒకరిని ఎంచుకునేందుకు ఏఐ సాంకేతికత సాయపడిందని అతనన్నాడు. ‘‘ఓ ప్రత్యర్థిపై తాము అనుకున్న జట్టు కూర్పు సరిపోతుందో లేదో చూసుకునేందుకు సాంకేతికత ఉపయోగపడుతోంది. విభిన్న లైనప్‌లను సంస్థకు పంపిస్తా. వాళ్లు ఏఐ సాయంతో పరీక్షించి ఫలితాలు పంపిస్తారు. జట్టును పూర్తిగా ఇలాగే ఎంపిక చేస్తామని కాదు. ఇది ఎంపికలో ఓ భాగం మాత్రమే. నిరుడు యాషెస్‌లో దీన్ని విజయవంతంగా ఉపయోగించాం. ముఖ్యంగా ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేయాల్సి వచ్చినప్పుడు ఏఐ నిర్ణయం మాకు కలిసొచ్చింది. టీ20 సిరీస్‌ గెలిచేందుకూ సాయపడింది’’ అని లూయిస్‌ చెప్పాడు. మరోవైపు రగ్బీ, ఫుట్‌బాల్‌ జట్టు వ్యవహారాలు చూసుకునే కోచ్‌ స్టీవ్‌ బోర్త్‌విక్‌ కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాడు.


ఐపీఎల్‌కు  మయాంక్‌ దూరం

లఖ్‌నవూ: బుల్లెట్‌ బంతులతో అందరి దృష్టిలో పడిన ఫాస్ట్‌ బౌలర్‌ మయాంక్‌ యాదవ్‌ ఐపీఎల్‌-17లో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఇప్పటికే గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లు ఆడలేకపోయిన ఈ లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ పేసర్‌.. ముంబయి ఇండియన్స్‌తో మ్యాచ్‌తో పునరాగమనం చేశాడు. కానీ పక్కటెముకల గాయంతో అతడు మిగిలిన మ్యాచ్‌లను ఆడే పరిస్థితుల్లో లేడని కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ చెప్పాడు.


ఆ నిబంధన లేకుంటే..

ముంబయి: టీ20 ప్రపంచకప్‌లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధన లేకపోవడం కెప్టెన్లను మరింత వ్యూహాత్మకంగా ఆలోచించేలా చేస్తుందని కోల్‌కతా నైట్‌రైడర్స్‌, ఆస్ట్రేలియా ఫాస్ట్‌బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌ అన్నాడు. ఐపీఎల్‌లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధనను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ‘‘ఐపీఎల్‌లో భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. ఇక్కడి పిచ్‌లు, మైదానాల స్వభావం అది. ఇందులో ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధన పాత్ర కూడా ఉంది. బ్యాటర్లు, బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్లు 8, 9వ స్థానాల్లో వస్తున్నారంటే.. చాలా లోతైన లైనప్‌ ఉందని అర్థం. పవర్‌ప్లే సందర్భంగా బ్యాటర్లలో భయమే ఉండట్లేదు. భారీ షాట్లు ఆడమే లక్ష్యం. ఆటగాళ్లు బాగా బ్యాటింగ్‌ చేస్తున్నారనడంలో సందేహం లేదు. నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. కేవలం నిబంధన వల్లే ఆ స్కోర్లు అని చెప్పలేను’’ అని స్టార్క్‌ అన్నాడు. ‘‘ఐపీఎల్‌లో కొందరు అద్భుతంగా బ్యాటింగ్‌ చేశారు. అద్భుత భాగస్వామ్యాలు నమోదయ్యాయి. అయితే వచ్చే నెల ప్రపంచకప్‌లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధన లేదు. అది స్కోర్లను ప్రభావితం చేస్తుందా లేదా అన్నది చూడాలి. ప్రభావితం చేస్తుందనే అనుకుంటున్నా. ఆల్‌రౌండర్ల పాత్ర మళ్లీ కీలకమవుతుంది. కేవలం 11 మంది ఆటగాళ్లే ఉండడం వల్ల కెప్టెన్లు మరింత వ్యూహాత్మకంగా ఆలోచించాల్సివుంటుంది’’ అని చెప్పాడు.


ఆ బాక్సర్‌.. ఇప్పుడు పోలీస్‌గా

డ్రగ్స్‌పై అవగాహన కల్పించిన అఖిల్‌

దిల్లీ: డ్రగ్స్‌కు అలవాటు పడితే జీవితాలు నాశనమవడమే కాకుండా కుటుంబాలూ ఛిన్నాభిన్నం అవుతాయని మాజీ బాక్సర్‌ అఖిల్‌ కుమార్‌ పేర్కొన్నాడు. ఈ 2006 కామన్వెల్త్‌ క్రీడల పసిడి విజేత ప్రస్తుతం హరియాణాలోని జజ్జర్‌ పోలీసు విభాగంలో అసిస్టెంట్‌ కమిషనర్‌గా పని చేస్తున్నాడు. డ్రగ్స్‌ వాడకం వల్ల కలిగే ముప్పుపై యువ బాక్సర్లు సహా 100 మందికి పైగా అథ్లెట్లకు అతను అవగాహన కల్పించాడు. ‘‘ఓ అథ్లెట్‌గా, జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ ప్యానల్‌ సభ్యుడిగా డ్రగ్స్‌ వాడితే కలిగే ప్రమాదాన్ని అర్థం చేసుకున్నా. అందుకే అలాంటివి వాడకుండా ఎలా ఉండాలో అని వాళ్ల (అథ్లెట్లు)కు ప్రాథమిక సూచనలిచ్చా. సాధారణ వైద్య పరీక్షల సమయంలోనూ తాము అథ్లెట్లమని వైద్యులకు చెప్పాలి. అలా అయితే నిషేధిత ఉత్ప్రేరకాలను వైద్యులు సూచించరు. డ్రగ్స్‌ ఉచ్చులో చిక్కుకుంటున్న యువత కేవలం వాళ్ల జీవితాలను పాడు చేసుకోవడమే కాదు తల్లిదండ్రుల ఆశలనూ కూలుస్తుంది. డ్రగ్స్‌కు అలవాటు పడి కుటుంబాలనూ ఛిన్నాభిన్నం చేస్తున్నారు. అలాగే తాగుడుతో ఎవరూ ప్రయోజనం పొందరు. మరింత కిందకి పడిపోతారు’’ అని 43 ఏళ్ల అఖిల్‌ తెలిపాడు. కెరీర్‌లో ఉత్తమ స్థితిలో ఉన్నప్పుడు అఖిల్‌ 2008 ఒలింపిక్స్‌ ప్రిక్వార్టర్స్‌లో అప్పటి ప్రపంచ నంబర్‌వన్‌ సెర్గీ వొడోప్యానోవ్‌పై గెలిచాడు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని