Shubman Gill: ప్రపంచ రికార్డును సమం చేసిన గిల్‌..!

శుభ్‌మన్‌ గిల్‌ ప్రపంచ రికార్డును సమం చేశాడు. మూడు వన్డేల్లో 360 పరుగులు  సాధించాడు. 

Updated : 24 Jan 2023 16:44 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ ఇండియా యువ సంచలనం శుభ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) మరో రికార్డును బద్దలు కొట్టాడు. 23 ఏళ్ల ఈ యువ బ్యాటర్‌ ద్వైపాక్షిక సిరీస్‌ల్లో మూడు మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటి వరకు బాబర్‌ అజామ్‌ పేరిట ఉన్న 360 (3 మ్యాచ్‌ల్లో) పరుగుల రికార్డును సమం చేశాడు. ఇక భారత్‌లో తరపున గతంలో విరాట్‌ కోహ్లీ మూడు మ్యాచ్‌ల్లో 283 పరుగులు చేశాడు. వీటిల్లో 113, 4, 166 పరుగులు ఉన్నాయి. నేడు న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో గిల్‌  ఈ  రికార్డును దాటేశాడు. కేవలం 72 బంతుల్లోనే శతకాన్ని పూర్తి చేసుకొన్నాడు. గత మూడు మ్యాచ్‌ల్లో 208, 40, 112 సాధించాడు. 

ఇక గత నాలుగు మ్యాచ్‌ల్లో గిల్‌ ఏకంగా 400కు పైగా పరుగులు సాధించాడంటే అతడి ఫామ్‌ను అర్థం చేసుకోవచ్చు. గత వారం గిల్‌ న్యూజిలాండ్‌పై 208 పరుగులు సాధించిన విషయం తెలిసిందే. ద్విశతకాన్ని సాధించిన అతిపిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. గతేడాది 12 వన్డేలు ఆడిన గిల్‌ 638 పరుగులు చేశాడు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఆరు వన్డేలు ఆడి 500కు పైగా సాధించాడు. ఈ ఏడాది గిల్‌ వరుసగా 70, 21, 116, 208, 40, 112 స్కోర్లను సాధించాడు. 

వన్డేల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు సాధించిన భారతీయ ఆటగాడిగా నిలిచాడు. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వేగంగా ఇన్ని పరుగులు చేసిన ఆటగాళ్లలో రెండో స్థానంలో నిలిచాడు. శుభ్‌మన్‌ తన 2019లో తన కెరీర్‌ను న్యూజిలాండ్‌పై  ప్రారంభించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని