ODI World Cup: వన్డే ప్రపంచకప్‌ 2023.. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్‌ కీలక వ్యాఖ్యలు

వచ్చే ఏడాది భారత్‌ వేదికగా వన్డే ప్రపంచకప్‌, పాక్‌లో ఆసియా కప్‌ టోర్నమెంట్లు జరుగుతాయి. అయితే ఇటీవల ఏసీసీ అధ్యక్షుడు, బీసీసీఐ కార్యదర్శి జయ్‌ షా చేసిన వ్యాఖ్యలు క్రీడా వర్గాల్లో చర్చకు తెరలేపాయి. అలాగే పీసీబీ కూడా కౌంటర్ ఇవ్వడంతో  కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తాజాగా స్పందించారు.

Updated : 20 Oct 2022 15:06 IST

అనురాగ్ ఠాకూర్‌

ఇంటర్నెట్ డెస్క్: వచ్చే ఏడాది ఆసియా కప్‌ పాకిస్థాన్‌ వేదికగా జరగనుంది. ఈ క్రమంలో ఏసీసీ (ఆసియా క్రికెట్ కౌన్సిల్) అధ్యక్షుడు, బీసీసీఐ కార్యదర్శి జయ్‌ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి. పాక్‌లో కాకుండా తటస్థ వేదికపై ఆసియా కప్‌ ఆడతామని ఆయన వ్యాఖ్యానించగా.. పీసీబీ కూడా ప్రతి స్పందించింది. అలా చేస్తే తాము భారత్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌ 2023 టోర్నీతో సహా ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ నుంచి వైదొలుగుతామని పేర్కొంది. ఈ క్రమంలో కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. భారత్‌ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌లో పాక్‌తో సహా అన్ని పెద్ద జట్లూ పాల్గొంటాయని స్పష్టం చేశారు. 

‘‘వన్డే ప్రపంచకప్‌ను నిర్వహించే  బాధ్యత బీసీసీఐదే. అందుకే ఇది బీసీసీఐ విషయం. ఆ బోర్డే స్పందించాలి. భారత్ క్రీడలకు పవర్‌హౌస్‌లాంటిది. చాలా ప్రపంచకప్‌లను ఇక్కడ నిర్వహించాం. అలాగే వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్‌ జరగనుంది. అందులో పాక్‌తో సహా పెద్ద జట్లన్నీ తప్పకుండా పాల్గొంటాయి. భారత్‌ నుంచి క్రీడలను వేరు చేయలేం. క్రికెట్‌తో సహా చాలా క్రీడల్లో భారత్‌ పాల్గొంటుంది. పాకిస్థాన్‌లో భద్రతాపరమైన అంశాలను కేంద్ర హోం శాఖ చూసుకొంటుంది. క్రికెట్‌కు సంబంధించినదే కాకుండా ఆటగాళ్ల భద్రత కూడా చాలా కీలకం. ఎవరి మాటను వినే అవసరం భారత్‌కు లేదు. మమ్మల్ని ఎవరూ డిక్టేట్‌ చేయలేరు ’’ అని అనురాగ్‌ వెల్లడించారు. ప్రస్తుతం ఆసీస్‌ వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో భారత్‌ అక్టోబర్‌ 23న తలపడనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని