Sports News: వాళ్లను కలవడం వల్లే వైరస్‌ సోకి ఉండొచ్చు

ఐపీఎల్‌ బయోబుడగలో చెన్నై సూపర్ కింగ్స్‌ ఆటగాళ్లను కలవడం వల్లే తనకు కరోనా వైరస్‌ సోకి ఉండొచ్చని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాట్స్‌మన్‌, కీపర్ వృద్ధిమాన్‌ సాహా అనుమానం వ్యక్తం చేశాడు...

Updated : 23 May 2021 12:29 IST

అనుమానం వ్యక్తం చేసిన సన్‌రైజర్స్‌ కీపర్‌..

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్‌ బయోబుడగలో చెన్నై సూపర్ కింగ్స్‌ ఆటగాళ్లను కలవడం వల్లే తనకు కరోనా వైరస్‌ సోకి ఉండొచ్చని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాట్స్‌మన్‌, కీపర్ వృద్ధిమాన్‌ సాహా అనుమానం వ్యక్తం చేశాడు. ఏప్రిల్‌ 28న ఇరు జట్ల మధ్య మ్యాచ్‌ జరిగిందని, అప్పుడు తాను వారితో కలిసి మాట్లాడానని సాహా పేర్కొన్నాడు. తాజాగా ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడుతూ.. వారిని కలిసిన కొద్ది రోజులకే సీఎస్కే బౌలింగ్‌ కోచ్‌ లక్ష్మీపతి బాలాజీకి వైరస్‌ నిర్ధరణ కాగా, అనంతరం తనకూ పాజిటివ్‌గా తేలిందని సన్‌రైజర్స్‌ బ్యాట్స్‌మన్‌ గుర్తు చేసుకున్నాడు.

‘మేం దిల్లీ విమానాశ్రయంలో అడుగుపెట్టాక అక్కడి పరిసరాలను వాడుకున్నాం. తర్వాత సీఎస్కే జట్టుతో మ్యాచ్‌ ఆడాం. ఒకవేళ నాకు ఎయిర్‌పోర్ట్‌లోనే వైరస్‌ సోకితే అది చెన్నైతో మ్యాచ్‌కు ముందురోజు లేదా మ్యాచ్‌ జరిగిన రోజే లక్షణాలు కనిపించేవి. కానీ, నాకు పాజిటివ్‌గా తేలిన ముందు రోజు ఆ జట్టులోని పలువురిలో వైరస్‌ లక్షణాలు కనిపించాయి. అంతకు రెండు రోజుల ముందే చెన్నై జట్టుతో మేం మ్యాచ్‌ ఆడాం. ప్రాక్టీస్‌ సెషన్‌ సందర్భంగా వారితో ముచ్చటించాను. ఈ నేపథ్యంలో నాకు వైరస్‌ సోకడానికి వారిని కలవడమే కారణమని భావిస్తున్నా’ అని సాహా అభిప్రాయపడ్డాడు.

అలాగే ఈసారి కూడా ఐపీఎల్‌ను యూఏఈలో నిర్వహించాల్సి ఉండేదని, కరోనా వైరస్‌ పరిస్థితుల గురించి నిర్వాహకులు ముందే ఒక అంచనాకు రావాల్సిందని సాహా పేర్కొన్నాడు. గతేడాది యూఏఈలో ఏర్పాటు చేసిన బయోబుడగతో పోలిస్తే ఇక్కడ అంత కఠినంగా లేదని అభిప్రాయపడ్డాడు. ఇక్కడ కొంత మంది ప్రజలు, పిల్లలు మ్యాచ్‌లు జరిగే ప్రదేశాల్లో గోడల మీద నుంచి తొంగి చూసేవాళ్లని గుర్తుచేసుకున్నాడు. 

మరోవైపు కరోనా నుంచి తాను పూర్తిగా కోలుకున్నానని, ప్రాక్టీస్‌ మొదలుపెట్టినప్పుడు మాత్రం శరీరం ఎలా స్పందిస్తుందో తెలుస్తుందని సాహా అన్నాడు. ఇక కరోనా సోకినప్పుడు తొలుత రెండు రోజులు జ్వరం వచ్చిందని, ఆపై ఐదు రోజులకు వాసన కోల్పోయినట్లు చెప్పాడు. మళ్లీ నాలుగు రోజులకే సాధారణ స్థితికి చేరుకున్నానన్నాడు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాట్లాడటం, సినిమాలు చూడటం లాంటివి చేశానని సాహా గుర్తుచేసుకున్నాడు. వైరస్‌ విషయంలో తానెప్పుడూ మానసికంగా కుంగిపోలేదన్నాడు. అయితే, ఆ సమయంలో బయటి విషయాలు పట్టించుకోకపోవడమే మంచిదని సలహా ఇచ్చాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని