Cricket News: వరల్డ్‌ కప్‌లో భారత్ తడబాటే కనిపించలేదన్న లారా.. సూర్య కెప్టెన్సీపై ప్రసిధ్ కామెంట్స్!

Updated : 27 Nov 2023 13:55 IST

ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచ కప్‌లో (ODI World Cup 2023) భారత ఓటమిపై  లారా విశ్లేషణ.. ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు కెప్టెన్సీ చేపట్టిన సూర్యపై యువ బౌలర్ కామెంట్లు.. పాకిస్థాన్‌ బ్యాటర్‌పై పీసీబీ భారీ జరిమానా.. ఇలాంటి క్రికెట్‌ విశేషాలు మీ కోసం..

సూర్య కెప్టెన్సీ కూడా అతడి బ్యాటింగ్‌లానే ఉంది: ప్రసిధ్‌

ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్‌కు భారత కెప్టెన్‌గా సూర్యకుమార్‌ యాదవ్ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. వరుసగా రెండు మ్యాచుల్లోనూ టీమ్‌ఇండియా విజయం సాధించింది. రెండో టీ20 ముగిసిన తర్వాత భారత యువ బౌలర్ ప్రసిధ్ కృష్ణ మాట్లాడుతూ.. సూర్య కెప్టెన్సీపై ఆసక్తికర కామెంట్లు చేశాడు. ‘‘సూర్యకుమార్‌ యాదవ్ బ్యాటింగ్‌ చేసే తీరు భిన్నంగా ఉంటుంది. అతడి కెప్టెన్సీ కూడా అలానే ఉంటుంది. జట్టులోని ప్రతి ఆటగాడిని విశ్వసిస్తాడు. మేం ఏం చేయాలని అనుకుంటామో దానికి మద్దతుగా నిలుస్తాడు. అందులో ఏదైనా పొరపాటు జరిగినా ఒత్తిడి చేయకుండా సపోర్ట్‌ చేస్తాడు. స్వేచ్ఛగా ఆడించడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో అతడికి తెలుసు’’ అని ప్రసిధ్ తెలిపాడు.


వరల్డ్‌ కప్‌లో అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించిన భారత్: లారా

వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో టీమ్ఇండియా ఓడిపోయినప్పటికీ.. ఆ జట్టు ఆడినతీరు అద్భుతంగా ఉందని విండీస్‌ క్రికెట్ దిగ్గజం లారా ప్రశంసించాడు. ఆసీస్‌ వంటి బలమైన జట్టు చేతిలో ఓటమిపాలైనంత మాత్రాన భారత్‌ను తక్కువగా చూడటానికి వీల్లేదని పేర్కొన్నాడు. ‘‘వరల్డ్‌ కప్‌లో ఎక్కడా టీమ్‌ఇండియా తడబాటుకు గురైనట్లు కనిపించలేదు. అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించింది. అనుభవం ఎంత ముఖ్యమో ఈ వరల్డ్‌ కప్‌లో చూశాం. ఆసీస్‌ వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడినా.. చివరికి విజేతగా నిలిచింది. భారత్‌ అద్భుతంగా ఆడినా కొన్నిసార్లు ఓటమి ఎదురవ్వక తప్పదు. తప్పకుండా వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ బెస్ట్‌ మ్యాచ్‌ అని చెప్పగలను. భారత్‌ గెలుస్తుందని నేనూ భావించా. దురదృవశాత్తూ ఓడిపోయింది. అయినా, తప్పకుండా వచ్చేసారి విజేతగా నిలుస్తుందన్న నమ్మకం నాకుంది’’ అని లారా వ్యాఖ్యానించాడు.


పాక్‌ బ్యాటర్‌పై జరిమానా

ఐసీసీ పరికరాల నిబంధనల ప్రకారం ప్లేయర్లు ఎవరూ తమ జెర్సీలపై రాజకీయపరమైన, మత, ప్రాంతీయ, జాతి వివక్షకు సంబంధించిన సందేశాలను డిస్‌ప్లే చేయకూడదు. అయితే, ఈ రూల్‌ను అతిక్రమించిన పాకిస్థాన్‌ యువ బ్యాటర్ అజమ్‌ ఖాన్‌పై పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డు (PCB) భారీ జరిమానా విధించింది. తన బ్యాట్‌పై పాలస్తీనా జెండాను ప్రదర్శించడంతో మ్యాచ్‌ ఫీజ్‌లో 50 శాతం జరిమానా విధిస్తూ పీసీబీ నిర్ణయం తీసుకుంది. జాతీయ టీ20 కప్‌ సందర్భంగా కరాచీ వైట్స్‌, లాహోర్‌ బ్లూస్‌ జట్ల మధ్య మ్యాచ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే ఈ మ్యాచ్‌ కంటే ముందు కూడా గత రెండు మ్యాచుల్లోనూ ఇదే స్టిక్కర్లతో బరిలోకి దిగినట్లు అజమ్‌ పేర్కొన్నాడు. అప్పుడు అధికారులు ఎవరూ తనకు హెచ్చరికలు జారీ చేయలేదని తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు