Mumbai vs Punjab : పంజాబ్ ఖాతాలో మూడో విజయం.. ముంబయికి తప్పని ఐదో ఓటమి

టీ20 మెగా టోర్నీలో ముంబయి పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా ఐదో మ్యాచులోనూ ఓటమి పాలైంది. పంజాబ్‌తో జరిగిన మ్యాచులో 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. పంజాబ్...

Published : 13 Apr 2022 23:32 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : టీ20 మెగా టోర్నీలో ముంబయి పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా ఐదో మ్యాచులోనూ ఓటమి పాలైంది. పంజాబ్‌తో జరిగిన మ్యాచులో 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. పంజాబ్ నిర్దేశించిన 199 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబయి 186 పరుగులకే పరిమితమైంది. ముంబయి బ్యాటర్లలో డెవాల్డ్ బ్రెవీస్ (49 : 25 బంతుల్లో 4×4, 5×6) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. క్రీజులో ఉన్నంత సేపు బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. సూర్యకుమార్ యాదవ్‌ (43) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. తిలక్‌ వర్మ (36), కెప్టెన్ రోహిత్ శర్మ (28) పరుగులతో రాణించారు. అయినా కీలక సమయంలో పంజాబ్‌ బౌలర్లు పుంజుకోవడంతో ముంబయి బ్యాటర్ల పోరాటం వృథా అయ్యింది. ఓపెనర్ ఇషాన్ కిషన్‌ (3), కీరన్‌ పొలార్డ్‌ (10), జయదేవ్ ఉనద్కత్‌ (12) విఫలమయ్యారు. బుమ్రా (0) డకౌటయ్యాడు. ఆఖరు బంతికి టైమల్ మిల్స్‌ (0) క్యాచ్‌ ఔటయ్యాడు. మురుగన్ అశ్విన్‌ (0) నాటౌట్‌గా నిలిచాడు. పంజాబ్ బౌలర్లలో ఓడీన్ స్మిత్‌ నాలుగు, కగిసో రబాడ రెండు వికెట్లు తీయగా.. వైభవ్‌ అరోరా ఓ వికెట్‌ పడగొట్టాడు.


నిలకడగా బ్యాటింగ్‌..

ముంబయి బ్యాటర్లు నిలకడగా ఆడుతూ లక్ష్యం దిశగా సాగుతున్నారు. ధాటిగా ఆడుతున్న డెవాల్డ్ బ్రెవీస్ (49).. ఓడీన్ స్మిత్ వేసిన 11వ ఓవర్‌ ఆఖరు బంతికి అర్ష్‌ దీప్ సింగ్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 13వ ఓవర్లో పరుగు తీసేందుకు ప్రయత్నించిన తిలక్‌ వర్మ (36) రనౌటయ్యాడు. 14వ ఓవర్లో రాహుల్ చాహర్‌ ఏడు పరుగులు ఇచ్చాడు. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ (20), కీరన్‌ పొలార్డ్ (7) క్రీజులో ఉన్నారు. ఈ క్రమంలోనే 15 ఓవర్లు పూర్తయ్యే సరికి ముంబయి నాలుగు వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది.  ముంబయి విజయానికి 30 బంతుల్లో 53 పరుగులు చేయాల్సి ఉంది.


దంచికొడుతున్న ముంబయి బ్యాటర్లు.. సగం ఓవర్లు పూర్తి

ముంబయి బ్యాటర్లు దంచికొడుతున్నారు. బేబీ డివిలియర్స్‌గా పేరొందిన డెవాల్డ్‌ బ్రెవీస్‌ పంజాబ్‌ బౌలర్లపై సిక్సర్లతో విరుచుకుపడుతున్నాడు. ఓడియన్‌ స్మిత్‌ వేసిన ఏడో ఓవర్‌లో ఓ సిక్సర్‌ బాదిన డెవాల్డ్‌.. రాహుల్‌ చాహర్‌ వేసిన తొమ్మిదో ఓవర్‌లో తొలుత ఓ ఫోర్‌, తర్వాత వరుసగా నాలుగు సిక్సర్లు బాదాడు. దీంతో ఈ ఓవర్‌లో 29 పరుగులు వచ్చాయి. అంతకుముందు లివింగ్‌ స్టోన్‌ వేసిన ఎనిమిదో ఓవర్‌లో రెండు ఫోర్లు కొట్టిన తిలక్‌ వర్మ..  వైభవ్‌ అరోరా వేసిన పదో ఓవర్‌లో ఓ ఫోర్‌, సిక్స్‌ బాదాడు. పది ఓవర్లకు ముంబయి 105/2 స్కోరుతో ఉంది. తిలక్‌ వర్మ ( 27*), డెవాల్డ్‌ బ్రెవీస్ (45*) క్రీజులో ఉన్నారు.


పవర్‌ ప్లే పూర్తి.. రెండు వికెట్లు డౌన్‌

ఛేదనకు దిగిన ముంబయికి పంజాబ్ బౌలర్లు వరుస షాకులు ఇస్తున్నారు. ఆరంభం నుంచే ధాటిగా ఆడుతున్న ముంబయి కెప్టెన్‌ రోహిత్ శర్మ (28).. కగిసో రబాడ వేసిన నాలుగో ఓవర్లో ఔట్‌ కాగా.. వైభవ్ అరోరా వేసిన తర్వాతి ఓవర్లో మరో ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ (3) కూడా పెవిలియన్‌ చేరాడు. అర్ష్‌దీప్‌ సింగ్‌ వేసిన ఆరో ఓవర్‌లో డివాల్డ్‌ బ్రీవిస్‌ రెండు ఫోర్లు బాదాడు. దీంతో పవర్‌ ప్లే పూర్తయ్యే సరికి ముంబయి 42/2  స్కోరుతో ఉంది. డెవాల్డ్‌ బ్రెవీస్‌ (8*), తిలక్‌ వర్మ (2*) క్రీజులో ఉన్నారు. 


ఛేదనకు దిగిన ముంబయి 

పంజాబ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబయి ఓపెనర్లు ధాటిగా ఆడుతున్నారు. వైభవ్‌ అరోరా వేసిన తొలి ఓవర్లో ఓ ఫోర్, ఓ సిక్స్‌ బాదిన కెప్టెన్ రోహిత్‌ శర్మ (19).. కగిసో రబాడ వేసిన రెండో ఓవర్లో మరో రెండు ఫోర్లు బాదాడు. దీంతో రెండు ఓవర్లు పూర్తయ్యే సరికి ముంబయి వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (2) క్రీజులో ఉన్నాడు.


అర్ధ శతకాలతో రాణించిన మయాంక్‌, ధావన్‌.. ముంబయి ముందు భారీ లక్ష్యం..

పుణెలోని ఎంసీఏ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా.. ముంబయితో జరుగుతున్న మ్యాచులో పంజాబ్ బ్యాటింగ్ ముగిసింది. ఓపెనర్ శిఖర్‌ ధావన్‌ (70 : 50 బంతుల్లో 5×4, 3×6), కెప్టెన్‌ మయాంక్ అగర్వాల్ (52 : 32 బంతుల్లో 6×4, 2×6) అర్ధ శతకాలతో రాణించడంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. ముంబయి ముందు 199 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. పంజాబ్ బ్యాటర్లలో జానీ బెయిర్ స్టో (12), లియామ్ లివింగ్‌స్టోన్‌ (2), విఫలమయ్యారు. ఆఖర్లో వచ్చిన షారుఖ్‌ ఖాన్‌ (15) రెండు సిక్సులు బాది క్రీజు వీడాడు. జితేశ్ శర్మ (30), ఓడీన్‌ స్మిత్ (1) పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ముంబయి బౌలర్లలో బాసిల్ తంపి రెండు వికెట్లు తీయగా, జయదేవ్‌ ఉనద్కత్‌, జస్ప్రీత్ బుమ్రా, మురుగన్ అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు.


పుంజుకుంటున్న ముంబయి బౌలర్లు.. కీలక వికెట్లు కోల్పోయిన పంజాబ్‌

ముంబయి బౌలర్లు ఇప్పుడప్పుడే పుంజుకుంటున్నారు. దీంతో పంజాబ్ స్వల్ప వ్యవధిలో రెండు కీలక వికెట్లు కోల్పోయింది. జయదేవ్‌ ఉనద్కత్‌ వేసిన 14వ ఓవర్లో తొలిబంతిని బౌండరీకి తరలించిన శిఖర్‌ ధావన్‌ (53).. ఆ తర్వాతి బంతికి సింగిల్ తీసి అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఐదో బంతికి ఓపెనర్‌ జానీ బెయిర్‌ స్టో (12) బౌల్డయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన లియామ్ లివింగ్‌ స్టోన్ (2) కూడా.. బుమ్రా వేసిన 15వ ఓవర్లో మూడో బంతికి బౌల్డయ్యాడు. జితేశ్ శర్మ (1) క్రీజులోకి వచ్చాడు.  అంతకు ముందు టైమల్ మిల్స్‌ వేసిన 13వ ఓవర్లో బెయిర్‌ స్టో ఓ ఫోర్ బాదాడు. 11, 12 ఓవర్లలో కలిపి 13 పరుగులు వచ్చాయి. దీంతో 15 ఓవర్లు పూర్తయ్యే సరికి పంజాబ్ మూడు వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది.


సగం ఓవర్లు పూర్తి.. పంజాబ్ స్కోరెంతంటే.?

పంజాబ్ బ్యాటర్లు నిలకడగా ఆడుతూ పరుగులు రాబడుతున్నారు. దీంతో పది ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ ఓ వికెట్ కోల్పోయి  99 పరుగులు చేసింది. టైమల్ మిల్స్‌ వేసిన తొమ్మిదో ఓవర్లో నాలుగో బంతిని భారీ సిక్సర్‌గా మలిచిన పంజాబ్‌ కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్ (52) అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అంతకు ముందు బాసిల్ తంపి వేసిన ఎనిమిదో ఓవర్లో ఓ ఫోర్‌ బాదిన శిఖర్‌ ధావన్‌ (35).. మురుగన్‌ అశ్విన్ వేసిన పదో ఓవర్లో తొలి బంతికి మరో ఫోర్‌ కొట్టాడు. మూడో బంతిని గాల్లోకి లేపిన మయాంక్.. సూర్యకుమార్‌కి చిక్కి క్రీజు వీడాడు. దీంతో 97 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. జానీ బెయిర్‌ స్టో (1) క్రీజులోకి వచ్చాడు.


పవర్‌ ప్లే పూర్తి.. ధాటిగా ఆడుతున్న పంజాబ్‌ ఓపెనర్లు..

పంజాబ్‌ బ్యాటర్లు ధాటిగా ఆడుతున్నారు. దీంతో పవర్ ప్లే పూర్తయ్యే సరికి పంజాబ్ 65/0 స్కోరుతో నిలిచింది. బుమ్రా వేసిన మూడో ఓవర్లో ఆఖరు బంతిని మయాంక్‌ అగర్వాల్ (38) బౌండరీకి తరలించాడు. అదనపు పరుగుల రూపంలో మరో 6 రన్స్ వచ్చాయి. ఆ తర్వాతి ఓవర్లో ఉనద్కత్ ఆరే పరుగులు ఇచ్చాడు. మురుగన్ అశ్విన్ వేసిన ఆరో ఓవర్లో మయాంక్‌ వరుసగా రెండు ఫోర్లు, ఓ సిక్స్ బాదాడు. ఆరో ఓవర్లో శిఖర్‌ ధావన్‌ (18), మయాంక్‌ చెరో ఫోర్‌ బాదారు.  


బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ ఓపెనర్లు..

ముంబయితో జరుగుతున్న మ్యాచులో టాస్‌ ఓడిన పంజాబ్ జట్టు బ్యాటింగ్‌కి దిగింది. తొలి రెండు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 17 పరుగులు చేసింది. బాసిల్ తంపి వేసిన తొలి ఓవర్లో పంజాబ్ కెప్టెన్ మయాంక్‌ అగర్వాల్ (9).. రెండు ఫోర్లు బాదాడు. ఉనద్కత్ వేసిన రెండో ఓవర్లో తొలి బంతిని ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (7) సిక్సర్‌గా మలిచాడు.


టాస్‌ నెగ్గిన రోహిత్‌.. ముంబయి బోణీ కొట్టేనా.?

టీ20 మెగా టోర్నీలో ఇప్పటి వరకు బోణీ కొట్టని ముంబయి జట్టు మరి కాసేపట్లో పంజాబ్‌తో తలపడనుంది. టాస్ నెగ్గిన ముంబయి కెప్టెన్‌ రోహిత్‌ శర్మ బౌలింగ్‌కే మొగ్గు చూపాడు. పంజాబ్‌కి బ్యాటింగ్‌ అప్పగించాడు. ఈ సీజన్‌లో ముంబయి ఇప్పటి వరకు నాలుగు మ్యాచులు ఆడగా.. అన్నింట్లోనూ ఓటమి పాలై పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు, మయాంక్ అగర్వాల్ సారథ్యంలోని పంజాబ్ జట్టు నాలుగు మ్యాచుల్లో రెండు విజయాలు, రెండు ఓటములతో ఏడో స్థానం దక్కించుకుంది. పొట్టి ఫార్మాట్లో ముంబయి, పంజాబ్‌ జట్లు హెడ్ టు హెడ్ తలపడిన మ్యాచుల్లో 15-13 విజయాలతో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జరగనున్న మ్యాచులో ఏ జట్టు ఆధిపత్యం చెలాయిస్తుందో చూడాలి.!

తుది జట్ల వివరాలు..

ముంబయి : ఇషాన్‌ కిషన్ (వికెట్‌ కీపర్‌), రోహిత్ శర్మ (కెప్టెన్), డెవాల్డ్ బ్రెవీస్, సూర్యకుమార్ యాదవ్‌, తిలక్ వర్మ, కీరన్‌ పొలార్డ్, మురుగన్ అశ్విన్‌, జస్ప్రీత్ బుమ్రా, జయదేవ్‌ ఉనద్కత్‌, టైమల్ మిల్స్‌, బాసిల్ తంపి.

పంజాబ్‌ : మయాంక్‌ అగర్వాల్‌ (కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, జానీ బెయిర్‌ స్టో, లియామ్‌ లివింగ్‌ స్టోన్‌, జితేశ్‌ శర్మ, షారుఖ్‌ ఖాన్‌, ఓడీన్‌ స్మిత్‌, కగిసో రబాడ, రాహుల్ చాహర్‌, అర్ష్‌దీప్ సింగ్‌, వైభవ్‌ అరోరా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని