Team India U19: కష్టాలు, సవాళ్లను ఎదుర్కొని.. విజేతలుగా ఎదిగి..!

టీమ్‌ఇండియా అండర్‌-19 ప్రపంచకప్‌ సాధించి యావత్‌ దేశాన్ని మురిపించింది. వరుసగా ఐదోసారి ఈ ఘనత నమోదు చేసి ఈ టోర్నీలో తమకెవరూ సాటిలేరని మరోసారి నిరూపించుకుంది...

Updated : 07 Feb 2022 15:08 IST

కఠిన సవాళ్లు ఎదుర్కొన్న యువ భారత్‌

(Photo: ICC twitter)

టీమ్‌ఇండియా అండర్‌-19 ప్రపంచకప్‌ సాధించి యావత్‌ దేశాన్ని మురిపించింది. అత్యధికంగా ఐదుసార్లు ఈ ఘనత నమోదు చేసి ఈ టోర్నీలో తమకెవరూ సాటిలేరని మరోసారి నిరూపించుకుంది. అయితే, యువ భారత్‌ జగజ్జేతగా నిలవడానికి ముందు ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. కఠిన సవాళ్లకు ఎదురీది విజేతగా నిలిచింది. మరి ఈ యువకులు ఎలాంటి పరిస్థితులను దాటారు. అసలేం జరిగింది. వారి ఆట ఎలా సాగిందనే విషయాలు తెలుసుకుందాం.

గాయపడిన ఆటగాడిని ఎంపిక చేసి..

టీమ్‌ఇండియా గ్రూప్‌ దశలో ఒకానొక సందర్భంలో ఆడేందుకు సరైన 11 మంది కూడా లేరు. ఐర్లాండ్‌తో మ్యాచ్‌కు 10 మంది మాత్రమే సిద్ధంగా ఉండగా.. గాయపడిన మరో ఆటగాడిని తప్పనిసరి పరిస్థితుల్లో ఈ మ్యాచ్‌కు ఎంపిక చేశారు. అంతకుముందు ఐదుగురు యువకులు కరోనాబారిన పడ్డారు. అందులో కెప్టెన్‌ యశ్‌ ధూల్‌, వైస్‌ కెప్టెన్‌ రషీద్‌ సైతం ఉన్నారు. వీరిద్దరూ కీలక బ్యాట్స్‌మెన్‌ కావడంతో టీమ్‌ఇండియా అతికష్టం మీదే బరిలోకి దిగింది. అయితే, ఓపెనర్లు రఘువంశీ (79; 79 బంతుల్లో 10x4, 2x6), హర్నూర్‌ సింగ్‌ (88; 101 బంతుల్లో 12x4) రాణించి జట్టుకు 307 పరుగుల భారీ స్కోర్‌ అందించారు. అనంతరం బౌలర్లు చెలరేగడంతో ప్రత్యర్థి జట్టు 133 పరుగులకే కుప్పకూలింది.

అనుకోని కెప్టెన్సీ.. ఊహించని ట్విస్ట్‌.. ఫైనల్లో విజేత..

టీమ్‌ఇండియా గ్రూప్‌ దశలో ఐర్లాండ్‌ కన్నా ముందు దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్‌లో తలపడి 45 పరుగుల తేడాతో విజయం సాధించింది. అందులో కెప్టెన్‌ యశ్‌ ధూల్‌ (82; 100 బంతుల్లో 11x4), రషీద్‌ (31; 54 బంతుల్లో 4x4) కీలక పరుగులు చేశారు. అలాంటి ఆటగాళ్లు రెండో మ్యాచ్‌కు ముందు వైరస్‌ బారిన పడటంతో.. ఐర్లాండ్‌తో మ్యాచ్‌కు ఎవరిని కెప్టెన్‌గా ఆడించాలనేది జట్టు యాజమాన్యానికి కష్టమైంది. ఆ సమయంలో జాతీయ క్రికెట్‌ అకాడమీ చీఫ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌, హెడ్‌కోచ్‌ హృషికేష్‌ బాగా ఆలోచించి నిషాంత్‌ సింధూను తర్వాతి మ్యాచ్‌లకు నాయకుడిగా ఎంపిక చేశారు. అది కూడా ఒక అరగంటలో మ్యాచ్‌ ప్రారంభమవుతుందనే కీలక సమయంలో చెప్పారు. అయితే, ఎలాంటి ఒత్తిడికి గురవని సింధూ జట్టును విజయపథంలో నడిపించాడు. ఐర్లాండ్‌పై 36 పరుగులు చేసి ఫర్వాలేదనిపించిన అతడు తర్వాత ఉగాండపై 4 వికెట్లు తీసి సత్తా చాటాడు. కాగా, తర్వాతి మ్యాచ్‌కు సింధూ సైతం వైరస్‌ బారిన పడటం బాధాకరం. ఇక కోలుకున్న తర్వాత నేరుగా ఫైనల్లో ఆడిన అతడు (50; 54 బంతుల్లో 5x4, 1x6) అర్ధ శతకం సాధించి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

శిఖర్‌ ధావన్‌ రికార్డు బద్దలుకొట్టి.. రాజ్‌బవా చరిత్ర..

(Photo: ICC Twitter)

ఇక గ్రూప్‌ దశలోనే ఉగాండాతో జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 326 పరుగుల తేడాతో అతిభారీ విజయం నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో రఘువంశీ (144; 120 బంతుల్లో 22x4, 4x6), రాజ్‌ బవా (162; 108 బంతుల్లో 14x4, 8x6) దంచికొట్టారు. దీంతో అండర్‌-19 ప్రపంచకప్‌ టోర్నీల్లో టీమ్‌ఇండియా తరఫున అత్యధిక స్కోర్‌ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. అంతకుముందు 2004లో శిఖర్‌ ధావన్‌ (155) రికార్డును అతడు బద్దలుకొట్టి కొత్త చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా 405/5 భారీ స్కోర్‌ సాధించగా.. ఉగాండా చివరికి 79 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో సింధు 4.4 ఓవర్లలోనే 19 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టడం విశేషం.

కొవిడ్‌ నుంచి కోలుకొని.. శతకంతో మెరిసి..

టీమ్‌ఇండియా లీగ్‌ దశలో వరుసగా మూడు మ్యాచ్‌లు గెలవడంతో క్వార్టర్‌ ఫైనల్లో బంగ్లాదేశ్‌తో తలపడింది. అయితే, ఇక్కడ సునాయాస విజయం సాధించింది. తొలుత బంగ్లాను 111 పరుగులకే కట్టడి చేసిన భారత్‌ తర్వాత ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఈ నేపథ్యంలోనే సెమీస్‌ చేరిన టీమ్‌ఇండియాకు బలమైన జట్టు ఆస్ట్రేలియాతో తలపడాల్సి వచ్చింది. అప్పటికే వరుస విజయాలు సాధిస్తున్నా నాకౌట్‌లో మేటి జట్టుతో రాణించడం అత్యంత కీలకం. అయితే, కొవిడ్‌ నుంచి కోలుకొని వచ్చిన కెప్టెన్‌ యశ్‌ ధూల్‌ (110; 110 బంతుల్లో 10x4, 1x6), ఆంధ్ర కుర్రాడు షేక్‌ రషీద్‌ (94; 108 బంతుల్లో 8x4, 1x6) బాధ్యతాయుతంగా ఆడారు. దీంతో టీమ్‌ఇండియాకు 290/5 స్కోర్‌ అందించారు. అనంతరం బౌలర్లు సమష్టిగా రాణించడంతో కంగారూలు 194 పరుగులకే కుప్పకూలారు.

సమష్టిగా రాణించి.. రికార్డు స్థాయిలో కప్పు ఎత్తుకొని..

(Photo: ICC Twitter)

అన్ని కష్టాల కోర్చి టీమ్‌ఇండియా ఫైనల్‌ చేరడంతో కప్పుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తొలుత ఇంగ్లాండ్‌ను 189 పరుగులకే కట్టడి చేయడంతో ఆశలు రెట్టింపయ్యాయి. ముఖ్యంగా రవికుమార్‌ (4/34), రాజ్‌ బవా (5/31) అద్భుతంగా బౌలింగ్‌ చేసి ఇంగ్లిష్ జట్టును తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ జేమ్స్‌ ర్యూ (95; 116 బంతుల్లో 12x4) రాణించడంతో ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. లేదంటే ఇంగ్లాండ్‌ మరింత తక్కువ స్కోరుకే పరిమితమయ్యేది. అయితే, ఛేదనలో టీమ్‌ఇండియా సైతం ఇబ్బంది పడింది. ఫామ్‌లో ఉన్న రఘువంశీ (0) డకౌట్‌గా వెనుదిరగ్గా.. మరో ఓపెనర్‌ హర్నూర్‌ (21) సైతం తక్కువ స్కోరుకే పరిమితమయ్యాడు. అలాగే కెప్టెన్‌ యశ్‌ (17) కూడా నిరాశపర్చడంతో ఒక దశలో ఆందోళన మొదలైంది. కానీ, రషీద్‌ (50; 84 బంతుల్లో 6x4), సింధు (50 ; 54 బంతుల్లో 5x4, 1x6), రాజ్‌ బవా (35; 54 బంతుల్లో 2x4, 1x6) ఒత్తిడిని తట్టుకొని రాణించారు. చివర్లు పలు వికెట్లు పడ్డా ఆందోళన చెందకుండా బ్యాటింగ్‌ చేశారు. చివరికి దినేశ్‌ బానా (13; 8 బంతుల్లో 2x6) రెండు సిక్సర్లు సంధించి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

పరిస్థితులే రాటు దేల్చాయి..

రఘువంశీ: ఈ ప్రపంచకప్‌లో ఓపెనర్‌గా 278 పరుగులతో ఆకట్టుకున్న రఘువంశీ చిన్నప్పటి నుంచే ధైర్యంగా ఉండటం అలవర్చుకున్నాడు. అతడి సోదరుడు కృషంగ్‌ చిన్నప్పుడే బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధపడేవాడు. దీంతో ఐదేళ్లు అతడికి ఆస్పత్రిలో చికిత్స అందించాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లోనూ తన సోదరుడిని విడిచి ఉండలేని రఘువంశీ కొన్నిసార్లు ఆస్పత్రుల్లోనే నిద్రపోయేవాడని అతడి తల్లి మాలిక చెప్పారు. దీంతో వంశీకి చిన్నప్పటి నుంచే కష్టాలను ధైర్యంగా ఎదుర్కొనే మనస్తత్వం అలవడిందని తెలిపారు.

దినేశ్‌ బానా: ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్లో చివర్లో రెండు బంతులను సిక్సర్లుగా మలిచి జట్టుకు అద్వితీయమైన విజయాన్ని అందించిన ఆటగాడు దినేశ్‌ బానా. అసలు టీ20 ప్రపంచకప్‌ జట్టులో తొలుత చోటు దక్కుతుందని కూడా తెలియదు. ఛాలెంజర్స్‌ ట్రోఫీలో తన స్నేహితుడు ఒకరు.. ఆ రోజు మ్యాచ్‌ను అండర్‌-19 సెలెక్షన్‌ కమిటీ సభ్యులు చూడటానికి వస్తున్నారని చెప్పడంతో.. ఆ మ్యాచ్‌లో తన సిక్సుల సంఖ్యను లెక్కపెట్టుకోమని చెప్పాడట. దినేశ్‌ (170; 98 బంతుల్లో 10x4, 14x6) ఆరోజు విరోచితంగా బ్యాటింగ్‌ చేసి సెలెక్టర్లను ఆకర్షించాడు. ఇది అతడి ఆత్మవిశ్వాసాన్ని తెలియజేస్తుంది.

(Photo: ICC Twitter)

షేక్‌ రషీద్‌: ఆంధ్రా కుర్రాడు షేక్‌ రషీద్‌ టీమ్ఇండియా విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, అతడు కరోనా బారిన పడిన సమయంలో తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. లీగ్‌ దశలోనే పాజిటివ్‌గా తేలడంతో నాకౌట్‌ సమయానికి ఆడలేనేమో అనుకున్నాడు. కానీ, అతడు తన కోచ్‌ కృష్ణారావుతో మాట్లాడి ధైర్యం తెచ్చుకున్నాడు. తాను చిన్నప్పటి నుంచీ ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు, తనను క్రికెటర్‌గా చూడాలని ఎంతో కష్టపడిన తండ్రి బాషా పరిస్థితులను గుర్తు చేసుకొని మానసికంగా ద్రుఢంగా మారాడు.ఈ క్రమంలోనే సెమీఫైనల్‌, ఫైనల్లో రాణించిన రషీద్‌ చివరికి తన తండ్రి గర్వపడేలా చేశాడు.

రాజ్‌ బవా: ఫైనల్లో ఐదు వికెట్లు, అంతకుముందు ఉగాండా జట్టుపై 162 పరుగులు చేసిన ఆటగాడు రాజ్‌ బవా. అతడి తండ్రి సుఖ్‌విందర్‌ బవా స్వతహాగా క్రికెట్‌ కోచ్‌ అవడంతో తన కుమారుడిని ఆల్‌రౌండర్‌గా చూడాలనుకున్నాడు. అయితే, నెట్స్‌లో అతడి ఫాస్ట్‌ బౌలింగ్‌ చూసి.. అంత వేగంగా బంతులేయొద్దని చెప్పాడట. ఎందుకంటే అతడెంత వేగంతో బంతులేస్తే టెయిలెండర్‌గా మారే అవకాశం ఉందని వద్దనుకున్నాడట. కానీ, ఈ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ వీడియోలను చూసి క్రికెటర్‌గా ఎదిగాడు. యువీలాగే ఎడమచేతి వాటంతో బ్యాటింగ్‌ చేసే అతడు బౌలింగ్‌, ఫీల్డింగ్‌ మాత్రం కుడి చేత్తో చేస్తాడు.

* కరోనా సోకిన క్లిష్ట పరిస్థితుల్లోనూ ఆటగాళ్లే ఒకరికి ఒకరు ధైర్యం చెప్పుకొన్నారు. ఆ సమయంలో ఎన్‌సీఏ హెడ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ సైతం వారికి అండగా ఉన్నాడు. ఎల్లప్పుడూ వారితో మాట్లాడుతూ నూతనోత్తేజం తీసుకొచ్చాడు. మరీ ముఖ్యంగా జట్టులో సగం మంది యువకులు కరోనా బారిన పడిన తర్వాత తమలో ఆత్మస్థైర్యం పెరిగిందని, ఎలాగైనా కప్పు గెలవాలనే కసి తమని ముందుకు నడిపిందని కెప్టెన్‌ యశ్‌ధూల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ అనంతరం పేర్కొన్నాడు.

- ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని