Ajaz Patel: అజాజ్‌ పటేల్‌ను పక్కనపెట్టిన న్యూజిలాండ్‌

ఇటీవల టీమ్‌ఇండియాతో జరిగిన ముంబయి టెస్టులో న్యూజిలాండ్‌ స్పిన్నర్‌ అజాజ్‌ పటేల్‌ పది వికెట్లు తీసి సంచలన ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే...

Updated : 23 Dec 2021 13:34 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇటీవల టీమ్‌ఇండియాతో జరిగిన ముంబయి టెస్టులో న్యూజిలాండ్‌ స్పిన్నర్‌ అజాజ్‌ పటేల్‌ పది వికెట్లు తీసి సంచలన ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. జిమ్‌లేకర్‌, అనిల్‌కుంబ్లే తర్వాత ఆ ఘనత సాధించిన బౌలర్‌గా నిలిచాడు. అంతటి గొప్ప ప్రదర్శన చేసిన ఆటగాడిని ఇప్పుడు కివీస్‌ జట్టు పక్కనపెట్టింది. జనవరి 1 నుంచి స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు సెలక్షన్‌ కమిటీ అజాజ్‌ను ఎంపిక చేయలేదు. మరోవైపు ఈ సిరీస్‌కు ఎంపిక చేసిన 13 మంది సభ్యుల్లో రచిన్‌ రవీంద్రను మాత్రమే ఏకైక స్పిన్నర్‌గా ఎంపిక చేశారు. అతడు ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో భారత పర్యటనలో ఆకట్టుకున్నాడు.

మరోవైపు ఈ సిరీస్‌కు టామ్‌లాథమ్‌ న్యూజిలాండ్‌ సారథిగా వ్యవహరించనున్నాడు. ఆ జట్టు సారథి కేన్‌ విలియమ్సన్‌కు ఇదివరకే ఉన్న ఓ గాయం.. టీ20 ప్రపంచకప్‌ సందర్భంగా తిరగబెట్టిన సంగతి తెలిసిందే. దీంతో అతడు టీమ్‌ఇండియా పర్యటనలోనూ టీ20 సిరీస్‌లో బరిలోకి దిగలేదు. ఆపై కాన్పూర్‌లో జరిగిన తొలి టెస్టులో ఆడినా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అనంతరం ముంబయిలో జరిగిన రెండో టెస్టులో పాల్గొనలేదు. ఆ సమయంలో టామ్‌ లాథమ్‌ నాయకత్వం వహించాడు. రాబోయే సిరీస్‌లోనూ అతడే జట్టును నడిపించనున్నాడు. కాగా, అజాజ్‌ భారత్‌లో అంత గొప్ప ప్రదర్శన చేసినా బంగ్లాతో టెస్టు సిరీస్‌కు ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యంగా అనిపిస్తోంది.

ఈ విషయంపై స్పందించిన ఆ జట్టు కోచ్‌ గ్యారీస్టెడ్‌.. తాము పరిస్థితులకు తగ్గ ఆటగాళ్లనే ఎంపిక చేస్తామని చెప్పాడు. ‘భారత్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన అజాజ్‌ను ఈ సిరీస్‌కు ఎంపిక చేయకపోవడంపై మీరు బాధపడొచ్చు. కానీ, మేం బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు అవసరమైన ఆటగాళ్లనే ఎంపిక చేశాం. మా సెలక్షన్‌ పాలసీ ఎప్పుడూ ఇలానే ఉంటుంది’ అని వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు