
IND vs ENG: ఎలా పోరాడాలో టీమ్‌ఇండియాకు బాగా తెలుసు: సిల్వర్‌వుడ్
లండన్: నాలుగో టెస్టులో టీమ్‌ఇండియా ఘనవిజయం సాధించడంపై ఇంగ్లాండ్ కోచ్ సిల్వర్‌వుడ్ ప్రశంసలు కురిపించాడు. ఈ విజయంలో క్రెడిటంతా కోహ్లీసేనకే దక్కుతుందని చెప్పాడు. భారత ఆటగాళ్లకు ఎలా పోరాడాలో తెలుసన్నాడు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 99 పరుగుల కీలక ఆధిక్యం సాధించినా చివరికి సోమవారం 157 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా మీడియాతో మాట్లాడిన సిల్వర్‌వుడ్ తన అభిప్రాయాలు వెల్లడించాడు. తొలి ఇన్నింగ్స్‌లో తమకు సుమారు 200 పరుగుల ఆధిక్యం లభించి ఉంటే భారత్‌పై ఒత్తిడి తెచ్చేవాళ్లమని అన్నాడు.
‘నిజం చెప్పాలంటే తొలి ఇన్నింగ్స్‌లో మేం సాధించిన పరుగుల కన్నా ఇంకా ఎక్కువ స్కోర్ సాధించి ఉంటే టీమ్‌ఇండియాను మరింత ఒత్తిడిలోకి నెట్టే అవకాశం మాకు దొరికేది. ఆ విషయంలో మేం విఫలమయ్యాం. దీనిపై డ్రెస్సింగ్‌రూమ్‌లో లోతుగా చర్చిస్తాం. వాళ్లకన్నా 190 పరుగుల ఆధిక్యం సంపాదించి ఉంటే కచ్చితంగా భారత్‌పై ఆధిపత్యం చెలాయించే అవకాశం దక్కేది. అయినా, ఈ విజయంలో క్రెడిటంతా టీమ్ఇండియాకే దక్కుతుంది. ప్రత్యర్థులపై తిరిగి ఎలా పోరాడాలో వాళ్లకు బాగా తెలుసు’ అని సిల్వర్‌వుడ్ చెప్పుకొచ్చాడు. కాగా, ఈ మ్యాచ్‌లో భారత్ తొలుత 191 పరుగులకు ఆలౌటవ్వగా ఇంగ్లాండ్ 290 పరుగులు చేసింది. దీంతో ఆ జట్టుకు 99 పరుగుల కీలక ఆధిక్యం దొరికింది. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ(127), పుజారా(61), పంత్(50), శార్దూల్ ఠాకూర్(60) రాణించడంతో 466 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం ఇంగ్లాండ్ 368 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగి 210 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు రోరీబర్న్స్(50), హమీద్(63) మినహా ఇతరులంతా విఫలమయ్యారు. దీంతో భారత్ 157 పరుగుల తేడాతో నాలుగో టెస్టును ఖాతాలో వేసుకుంది. అలాగే ఐదు టెస్టుల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.