Gambhir on Virat Kohli: కోహ్లీ నిర్ణయం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది: గంభీర్‌

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తాజా నిర్ణయం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ అన్నాడు. ఇటీవల టీ20 ప్రపంచకప్‌ తర్వాత భారత జట్టుకు పొట్టి ఫార్మాట్‌లో కెప్టెన్సీ...

Published : 20 Sep 2021 13:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తాజా నిర్ణయం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ అన్నాడు. టీ20 ప్రపంచకప్‌ తర్వాత.. భారత జట్టు పొట్టి ఫార్మాట్‌ కెప్టెన్సీ నుంచి తప్పుకొంటానని ఇటీవల చెప్పిన విరాట్‌.. గతరాత్రి మరో బాంబ్‌ పేల్చిన సంగతి తెలిసిందే. ఆర్సీబీ సారథిగానూ తనకు ఈ సీజనే ఆఖరిదని తెలిపాడు. కోహ్లీ నిర్ణయంపై గంభీర్‌ స్పందించాడు

‘సరిగ్గా రెండో దశ ప్రారంభమైనప్పుడే కోహ్లీ ఇలా ప్రకటించడం ఆశ్చర్యం కలిగించింది. ఒకవేళ కచ్చితంగా ఈ నిర్ణయం తీసుకోవాలని అనుకుంటే టోర్నీ పూర్తయ్యాక చెప్పాల్సింది. ఎందుకంటే ఇప్పుడీ నిర్ణయం జట్టుపై ప్రభావం చూపుతుంది. కోహ్లీ కోసం ట్రోఫీ సాధించాలని ఆటగాళ్లపై ఒత్తిడి నెలకొంటుంది. ప్రస్తుతం ఆర్సీబీ చాలా మంచి స్థితిలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కోహ్లీ నిర్ణయంతో వాళ్లని అనవసర ఒత్తిడికి గురిచేయడం ఎందుకు? నిజంగా కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని భావిస్తే టోర్నమెంట్‌ పూర్తయ్యాక కూడా చెప్పొచ్చు’ అని గంభీర్‌ ఓ క్రీడా ఛానల్‌తో అన్నాడు.

అయితే, కోహ్లీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడని కూడా గంభీర్‌ అభిప్రాయపడ్డాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం, రిటైర్మెంట్‌ ప్రకటించడం రెండూ పెద్ద నిర్ణయాలని, అవి పూర్తిగా వ్యక్తిగతమని చెప్పాడు. ఈ విషయాలపై ఏ ఆటగాడిమీదైనా వేరేవాళ్ల ప్రభావం ఉండకూడదన్నాడు. అది ఎవరికి వారే సొంతంగా నిర్ణయం తీసుకోవాల్సిన అంశమని తెలిపాడు. ఈ నిర్ణయం తీసుకోవడం అంత తేలిక కాదన్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్సీబీ ఆటగాళ్లు దీని గురించి ఆలోచించకుండా ముందుకు సాగాలని గంభీర్‌ సూచించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని