INDvsENG: లండన్‌కు టీమ్‌ఇండియా.. క్వారంటైన్‌లో సూర్యకుమార్‌, పృథ్వీ

టీమ్‌ఇండియా సోమవారం నాటింగ్‌హామ్‌ నుంచి లండన్‌కు బయలుదేరింది. ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు డ్రాగా ముగిశాక ఈనెల 12 నుంచి లార్డ్స్‌ మైదానంలో రెండో టెస్టు జరగనుంది...

Published : 09 Aug 2021 21:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా సోమవారం నాటింగ్‌హామ్‌ నుంచి లండన్‌కు బయలుదేరింది. ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు డ్రాగా ముగిశాక ఈనెల 12 నుంచి లార్డ్స్‌ మైదానంలో రెండో టెస్టు జరగనుంది. దాంతో భారత ఆటగాళ్లంతా ఈరోజు అక్కడికి పయనమయ్యారు. మరోవైపు ఈనెల 3న నాటింగ్‌హామ్‌కు చేరుకున్న యువ బ్యాట్స్‌మెన్‌ పృథ్వీ షా, సూర్యకుమార్‌ యాదవ్‌ అక్కడే పది రోజుల క్వారంటైన్‌లో ఉండనున్నారు. వారి గడువు 13న ముగుస్తుండగా ఆ తర్వాతే టీమ్‌ఇండియా ఆటగాళ్లతో కలవనున్నారు. దాంతో వారు మూడు, నాలుగు టెస్టులకు అందుబాటులో ఉంటారు. మూడో టెస్టు 25న ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈ ఇద్దరికి తగినంత ప్రాక్టీస్‌ సమయం దొరికింది.

లండన్‌కు గంగూలీ..

మరోవైపు లండన్‌లో జరిగే రెండో టెస్టును బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ ప్రత్యక్షంగా తిలకించనున్నాడు. యూకే గతవారమే భారత్‌ను రెడ్‌ లిస్ట్‌ నుంచి తొలగించడంతో దాదా అక్కడ పది రోజుల కచ్చితమైన క్వారంటైన్‌లో ఉండాల్సిన పనిలేదు. ఇంగ్లాండ్‌ ఆరోగ్య నిబంధనలకు అనుగుణంగా ఎవరైతే పూర్తి వ్యాక్సినేషన్‌ తీసుకుంటారో వారికి క్వారంటైన్‌తో సంబంధం లేదు. ఈ క్రమంలోనే దాదా మంగళవారం భారత్‌ నుంచి లండన్‌కు బయలుదేరనున్నాడు. అలాగే బీసీసీఐ అధికారులు సెక్రటరీ జైషా, వైస్‌ ప్రెసిడెంట్‌ రాజీవ్‌ శుక్లా, కోశాధికారి అరుణ్‌ ధుమాల్‌ సైతం ఈ సిరీస్‌ సమయంలో ఏదో ఒక సందర్భంలో అక్కడికి వెళ్లి మ్యాచ్‌లు తిలకించే వీలుంది. అయితే, దీనిపై ఇంకా కచ్చితమైన సమాచారం తెలియలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని