Tokyo olympics: పతకాలకు చేరువలో.. రెజ్లింగ్‌లో సెమీస్‌ చేరిన దీపక్‌, రవి

భారత కుస్తీవీరులు రవికుమార్‌ దహియా, దీపక్‌ పునియా సంచలనం సృష్టించారు. తమ విభాగాల్లో సెమీఫైనల్‌కు దూసుకెళ్లారు. బల్గేరియాకు చెందిన  జార్జి వలెటినోవ్‌ను రవి 14-4 తేడాతో చిత్తు చేశాడు....

Updated : 04 Aug 2021 10:58 IST

(రవి దహియా)

టోక్యో: భారత కుస్తీవీరులు రవికుమార్‌ దహియా (57 కిలోలు), దీపక్‌ పునియా (86 కిలోలు) సంచలనం సృష్టించారు. తమ విభాగాల్లో సెమీఫైనల్‌కు దూసుకెళ్లారు. బల్గేరియాకు చెందిన జార్జి వలెటినోవ్‌ను రవి 14-4 తేడాతో చిత్తు చేశాడు. ఇక చైనాకు చెందిన లిన్‌ జుషెన్‌పై దీపక్‌ పునియా 6-3 తేడాతో విజయం సాధించాడు.

రవి దూకుడు

రవికుమార్‌ గతంలో ఎన్నడూ లేనంత ఫామ్‌లో కనిపిస్తున్నాడు. వరుసగా రెండో బౌట్లోనూ ప్రత్యర్థిని సాంకేతిక ఆధిపత్యంతోనే ఓడించాడు. అతడి ఉడుం పట్టుకు, టేక్‌డౌన్లకు జార్జి వలెటినోవ్‌ ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. తొలి పిరియడ్‌లో వరుసగా 2, 2, 2 పాయింట్లు సాధించిన రవి 6-0తో ఆధిపత్యం సాధించాడు. ఇక రెండో పిరియడ్‌లో మరింత రెచ్చిపోయాడు. వరుసగా 2, 2, 2, 2 పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. ప్రత్యర్థికి కేవలం 4 పాయింట్లే వచ్చాయి. మరో 16 సెకన్లు ఉండగానే బౌట్‌ ముగిసింది. ప్రిక్వార్టర్స్‌లో కొలంబియాకు చెందిన టిగ్రరోస్‌పై రవి 13-2 తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. సెమీస్‌లో కజక్‌స్థాన్‌ రెజ్లర్‌ సనయెన్‌ నురిస్లామ్‌తో తలపడనున్నాడు.

దీపక్‌ రక్షణాత్మకంగా..

తొలి బౌట్లో దూకుడుగా ఆడిన దీపక్‌ పునియా  క్వార్టర్స్‌లో అటు దూకుడు ఇటు రక్షణాత్మక విధానంలో విజయం సాధించాడు. ప్రత్యర్థి అనుభవాన్ని గౌరవించాడు. లిన్‌ జుషెన్‌ను 6-3తో ఓడించాడు. తొలి పిరియడ్‌లో దీపక్‌ ఒక పాయింటు సాధించి 1-0తో ముందుకెళ్లాడు. ఇక రెండో పిరియడ్‌లో వరుసగా 2, 2, 1 సాధించాడు. ప్రత్యర్థికి 1,2 పాయింట్లు మాత్రమే రావడంతో విజయం భారత కుస్తీవీరుడినే వరించింది. ప్రిక్వార్టర్స్‌లో అతడు  నైజీరియాకు చెందిన అజియోమొర్‌ ఎకెరెకెమిని 12-1 తేడాతో చిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే. సెమీస్‌లో అతడు డేవిడ్‌ మోరిస్‌తో తలపడనున్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని