Ravi Shastri : అలా కుప్పకూలడంతో ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యాం : రవిశాస్త్రి 

ఆస్ట్రేలియాపై 36 పరుగులకే టీమ్‌ఇండియా కుప్పకూలడమే తన...

Published : 08 Dec 2021 01:46 IST

 

ఇంటర్నెట్‌ డెస్క్: ఆస్ట్రేలియాపై 36 పరుగులకే టీమ్‌ఇండియా కుప్పకూలడమే తన పదవీకాలంలో అత్యంత దారుణమైన ప్రదర్శన అని భారత జట్టు ప్రధాన కోచ్‌గా పదవీవిరమణ చేసిన రవిశాస్త్రి తెలిపాడు. రవిశాస్త్రి హెడ్‌ కోచ్‌గా టీమ్‌ఇండియా విదేశాల్లో అపూర్వమైన విజయాలను సాధించింది. ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా జట్ల మీద సిరీస్‌లను కైవసం చేసుకుంది. అయితే ఘన చరిత్ర కలిగిన రవిశాస్త్రి పదవీకాలంలో ఆసీస్‌పై ఓ టెస్టు మ్యాచ్‌ గణాంకాలు మాత్రం మాయనిమచ్చగా మిగిలిపోయింది. అడిలైడ్‌ వేదికగా గులాబీ బంతి టెస్టులో ఆస్ట్రేలియా మీద కేవలం 36 పరుగులకే టీమ్‌ఇండియా కుప్పకూలిన సంఘటన ప్రతి ఒక్కరికీ గుర్తే ఉండి ఉంటుంది. అత్యల్ప స్కోరు నమోదైన ఆ ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు ఒక్కరంటే ఒక్కరూ రెండంకెల స్కోరు చేయకపోవడం గమనార్హం. ఇదే తామందరిని షాక్‌కు గురి చేసిందని, దాంతో అందరం నిశ్చేష్టులయ్యామని చెప్పాడు. తన పదవీకాలంలో అత్యంత తక్కువస్థాయి ప్రదర్శన అని పేర్కొన్నాడు.  

‘‘కోచ్‌ అనేవాడు ఎప్పుడూ విమర్శలకు సిద్ధంగా ఉండాలి. తప్పించుకునే మార్గాలు ఉండవని తెలుసు. ఆ మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సాధించాం. కనీసం ఇంకో 80 పరుగులు చేస్తే గెలుపు కోసం పోరాడే అవకాశం ఉంది. అయితే కేవలం 36 పరుగులే చేశాం. దీంతో మేం ఒక్కసారిగా షాక్‌తో నిశ్చేష్టులయ్యాం. దీనికి నేనే మొదటి బాధ్యుడినని చెబుతా. తర్వాతి మ్యాచ్‌లకు సంబంధించి ఆటగాళ్లు ఏం చేయగలరో అదే చేయమని చెప్పా. దానిని ఆచరించి సిరీస్‌ను భారత్‌ కైవసం చేసుకుంది. ఎప్పటికీ ఆ సిరీస్‌ విజయం గురించి క్రికెట్‌ ప్రేమికులు మాట్లాడుకుంటారని ధీమాగా చెబుతున్నా’’ అని రవిశాస్త్రి వెల్లడించాడు. 

గులాబీ టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ (74), రహానె (42), పుజారా (43) రాణించడంతో భారత్‌ 244 పరుగులు చేసింది. అనంతరం అశ్విన్‌ (4/55), ఉమేశ్‌ (3/40), బుమ్రా (2/52) విజృంభణతో 191 పరుగులకే ఆసీస్‌ ఆలౌటైంది. దీంతో భారత్‌కు 53 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం  లభించింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ బౌలర్లు హేజిల్‌వుడ్ (5/8), కమిన్స్ (4/21) చెలరేగడంతో భారత్‌ కేవలం 36 పరుగులకే పరిమితమైంది. అనంతరం 90 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌ కేవలం రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి ఛేదించింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే ఆ తర్వాత టీమ్‌ఇండియా గొప్పగా పుంజుకుంది. రెండో టెస్టు, నాలుగో టెస్టుల్లో విజయం సాధించింది. మూడో టెస్టు డ్రాగా ముగియడంతో 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుని సంచలనం సృష్టించింది.

Read latest Sports News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని