Virat Kohli: మేం తెగించి ఆడలేకపోయాం : విరాట్‌ కోహ్లీ

న్యూజిలాండ్‌పై తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఓటమిపాలవ్వడంపై అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు...

Published : 01 Nov 2021 11:20 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: న్యూజిలాండ్‌పై తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఓటమిపాలవ్వడంపై అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. కనీసం ఒక్కరు కూడా బ్యాట్‌ ఝుళిపించలేకపోవడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. మరీ ముఖ్యంగా ఐపీఎల్‌లో, ప్రాక్టీస్‌ మ్యాచ్‌ల్లో అదరగొట్టిన టాప్‌ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ రెండు మ్యాచ్‌ల్లో చేతులెత్తేయడమే ప్రతి ఒక్కర్నీ కలచివేసింది. దీంతో వరుసగా రెండు మ్యాచ్‌లు కోల్పోయిన టీమ్‌ఇండియా సెమీస్‌ ఆశలు గల్లంతయ్యాయి. ఇక మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన కెప్టెన్‌ కోహ్లీ.. తనకే ఆశ్చర్యంగా ఉందన్నాడు. తాము బ్యాట్‌తో కానీ, బంతితో కానీ తెగించి ఆడలేకపోయామని చెప్పాడు.

‘చాలా ఆశ్చర్యంగా ఉంది. మేం బ్యాట్‌తో కానీ.. బంతితో కానీ తెగించి ఆడలేకపోయాం. ధాటిగా ఆడటానికి పెద్దగా అవకాశమే లేకపోయింది. మరోవైపు న్యూజిలాండ్‌ జట్టు ఎలాగైనా గెలవాలనే కసితో బరిలోకి దిగింది. వికెట్‌ పడిన ప్రతిసారీ మేం రిస్క్‌ తీసుకున్నాం. షాట్లు ఆడాలా వద్దా అనే సందిగ్ధంలో పడిన నేపథ్యంలోనే ఇలా జరిగింది. అలాగే మేం రక్షించుకునేంత స్కోరు చేయలేకపోయినా.. కనీసం పోరాడలేకపోయాం. భారత జట్టుకు ఆడుతుంటే భారీ అంచనాలుంటాయి. ప్రతి ఒక్కరూ మమ్మల్ని గమనిస్తుంటారు. తీవ్రఒత్తిడి ఉంటుంది. జట్టుగా ఆడి దాన్ని అధిగమించాలి. గత రెండు మ్యాచ్‌ల్లో ఆ పని చేయలేకపోయాం. అందుకే మేం గెలవలేకపోయాం. ఇకపై సానుకూలంగా ఆలోచిస్తూ ఆశావాహ దృక్పథంతో ఉండాలి. ఈ ఒత్తిడిని పక్కనపెట్టి మా ప్రణాళికలకు అనుగుణంగా ముందుకు సాగాలి. ఈ టోర్నీలో ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. వాటిలోనైనా మెరుగ్గా ఆడాలని కోరుకుంటున్నాం’ అని కోహ్లీ అభిప్రాయపడ్డాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని