Bumrah-Shami: బుమ్రా-షమి వచ్చేసరికి కోహ్లీ లార్డ్స్‌ దద్దరిల్లాలన్నాడు: శ్రీధర్‌

లార్డ్స్‌ మైదానంలో ఇటీవల ఇంగ్లాండ్‌తో ఆడిన రెండో టెస్టులో టీమ్‌ఇండియా 151 పరుగులతో ఘన విజయం సాధించింది...

Published : 24 Aug 2021 01:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: లార్డ్స్‌ మైదానంలో ఇటీవల ఇంగ్లాండ్‌తో ఆడిన రెండో టెస్టులో టీమ్‌ఇండియా 151 పరుగులతో ఘన విజయం సాధించింది. అయితే, ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన మహ్మద్‌ షమి(56*), జస్ప్రిత్‌ బుమ్రా(34*)కు భారత ఆటగాళ్లు ఎప్పటికీ గుర్తుండిపోయే తీపిజ్ఞాపకం అందించారు. ఐదోరోజు ఉదయం 209 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయి ఇబ్బందికర పరిస్థితుల్లో పడిన జట్టును వారిద్దరూ ఆదుకున్న సంగతి తెలిసిందే. భోజన విరామ సమయానికి ఈ జోడీ 80 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పి టీమ్‌ఇండియాను మెరుగైన స్థితిలో నిలిపారు. దాంతో వారు డ్రెస్సింగ్‌ రూమ్‌కు వచ్చేసరికి జట్టు సభ్యులంతా ఘన స్వాగతం పలకాలని కెప్టెన్‌ కోహ్లీ ముందే అందరికీ చెప్పాడని ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌ శ్రీధర్‌ వెల్లడించారు. తాజాగా అశ్విన్‌తో యూట్యూబ్‌ ఛానెల్లో మాట్లాడిన సందర్భంగా ఈ విషయాన్ని బయటపెట్టాడు.

‘భోజన విరామంలో బుమ్రా, షమి డ్రెస్సింగ్‌ రూమ్‌కు చేరుకుంటున్నారని తెలియగానే కోహ్లీ వాళ్లకు ఘన స్వాగతం పలకాలని జట్టు సభ్యులందరితో అన్నాడు. వాళ్లు చేసే శబ్దానికి లార్డ్స్‌ మైదానం దద్దరిల్లాలని, అది కొన్నేళ్లపాటు గుర్తుండిపోవాలని కెప్టెన్‌ పేర్కొన్నాడు’ అని శ్రీధర్‌ వివరించారు. కాగా, కోహ్లీ చెప్పినట్లే జట్టు సభ్యులంతా ఆ ఇద్దరికీ చప్పట్లతో ఘనస్వాగతం పలికారు. వారిని అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఆ వీడియోను బీసీసీఐ ట్విటర్‌లోనూ పంచుకుంది. ఇక రెండో సెషన్‌ ప్రారంభమైన కాసేపటికే కెప్టెన్‌ కోహ్లీ ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేశాడు. అప్పుడు బుమ్రా, షమి మరో 9 పరుగులు జోడించారు. దాంతో టీమ్‌ఇండియా స్కోర్‌ 298/8కి చేరుకుంది. అనంతరం ఛేదనకు దిగిన ఇంగ్లాండ్‌ 120 పరుగులకే కుప్పకూలింది. బౌలింగ్‌లోనూ బుమ్రా అదరగొట్టాడు. అతడు మూడు వికెట్లు తీయగా షమి ఒక వికెట్‌ తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని