Kevin Pietersen: విరాట్‌ కోహ్లీకి అంతా టెస్టు క్రికెట్టే! అభిరుచి, తీవ్రత, ఉత్సాహం  చెప్పేదదే!

సుదీర్ఘ ఫార్మాట్‌ తనకెంత విలువైందో మైదానంలో విరాట్‌ కోహ్లీ ఉత్సాహం, అభిరుచి తెలియజేస్తున్నాయని ఇంగ్లాండ్‌ మాజీ సారథి కెవిన్‌ పీటర్సన్‌ అన్నాడు. అతడి అభిరుచి టెస్టు క్రికెట్‌పై అందరికీ ప్రేమను పెంచుతోందని వెల్లడించాడు...

Published : 19 Aug 2021 13:44 IST

లండన్‌: సుదీర్ఘ ఫార్మాట్‌ తనకెంత విలువైందో మైదానంలో విరాట్‌ కోహ్లీ ఉత్సాహం, అభిరుచి తెలియజేస్తున్నాయని ఇంగ్లాండ్‌ మాజీ సారథి కెవిన్‌ పీటర్సన్‌ అన్నాడు. అతడి అభిరుచి టెస్టు క్రికెట్‌పై అందరికీ ప్రేమను పెంచుతోందని వెల్లడించాడు. సచిన్‌ తెందూల్కర్‌, రాహుల్‌ ద్రవిడ్‌ వంటి దిగ్గజాల బాటలో అతడు నడుస్తున్నాడని పేర్కొన్నాడు.

‘విరాట్‌ నా తరహాలోనే ఉన్నాడు. అతడు తన హీరోల దారిలో నడుస్తున్నాడని నాకు తెలుసు. సుదీర్ఘ ఫార్మాట్లోని సచిన్‌, ద్రవిడ్‌ తరహా దిగ్గజాల బాటలోనే అతడూ అడుగులు వేస్తున్నాడు. నిజానికి కోహ్లీనే ఒక దిగ్గజం. ఈ ఫార్మాట్లోనే కాకుండా అతడు టీ20ల్లోనూ రాణించాల్సి ఉంటుంది. అందుకే అతడు టెస్టులకు అమిత ప్రాధాన్యం ఇస్తున్నాడు. అలాంటి అంతర్జాతీయ స్టార్‌ సుదీర్ఘ ఫార్మాట్‌ కోసం తపన పడటం ఎంతో బాగుంది’ అని పీటర్సన్‌ అన్నాడు.

‘అన్ని రకాల పరిస్థితుల్లో తన జట్టు గెలుపునకు విరాట్‌ విలువిస్తాడు. అందుకే టీమ్‌ఇండియా ఆస్ట్రేలియాలో గెలవడం మనం చూశాం. ఇప్పుడు ఇంగ్లాండ్‌ పైనా ఆధిక్యం సాధించారు. లార్డ్స్‌లో విజయం అతడిని కచ్చితంగా సంతృప్తి పరిచే ఉంటుంది. అతడి ఉత్సాహం, తీవ్రత, జట్టును నడిపించే తీరు మనం గమనించొచ్చు. అతడు సుదీర్ఘ ఫార్మాట్‌కు ఎంతో విలువిస్తాడు. లార్డ్స్‌ తరహా విజయాలు అతడి వారసత్వాన్ని నిర్వచిస్తాయి’ అని పీటర్సన్‌ తెలిపాడు.

‘సాధారణంగా ఉపఖండం జట్లకు ఇంగ్లాండ్‌లో ఆడటం చాలా కష్టం. ఒకవేళ ట్రెంట్‌ బ్రిడ్జ్‌లో వర్షం గనక పడకుంటే టీమ్‌ఇండియా బహుశా 2-0తో ఆధిక్యంలోకి వెళ్లొచ్చు. ఐదో రోజు మహ్మద్‌ సిరాజ్‌ బౌలింగ్‌ చేసిన తీరు అద్భుతం. అతడెంతో తీవ్రతతో నాణ్యమైన బౌలింగ్‌ చేశాడు. ఆతిథ్య జట్టు కవ్వింపులకు దిగినా ఘాటుగా బదులివ్వడం టెస్టు క్రికెట్‌పై టీమ్‌ఇండియాకు ఉన్న ప్రేమను తెలియజేస్తోంది. ఇప్పుడు ఇంగ్లాండ్‌ జట్టులో చాలా మార్పులు అవసరం’ అని పీటర్సన్‌ స్పష్టం చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని