Vijay Hazare Trophy : విజయ్‌ హజారే ట్రోఫీ.. తొలిసారి హిమాచల్‌ ప్రదేశ్‌ సొంతం

హిమాచల్‌ ప్రదేశ్‌ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. విజయ్‌ హజారే 2021 - 2022 ట్రోఫీని...

Published : 26 Dec 2021 23:10 IST

ఫైనల్‌ మ్యాచ్‌లో తమిళనాడుపై విజయం

ఇంటర్నెట్‌ డెస్క్‌: హిమాచల్‌ ప్రదేశ్‌ క్రికెట్ జట్టు అద్భుతం చేసింది. విజయ్‌ హజారే 2021- 2022 ట్రోఫీని కైవసం చేసుకుంది. సవాయ్‌ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా ఉత్కంఠ భరితంగా జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో తమిళనాడుపై విజయం సాధించి తొలిసారి ట్రోఫీని తన ఖాతాలో వేసుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన తమిళనాడు 49.4 ఓవర్లలో 314 పరుగులకు ఆలౌటైంది. అనంతరం హిమాచల్‌ ప్రదేశ్‌ 47.3 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. ఈ సమయంలో వెలుతురులేమి కారణంగా మ్యాచ్‌ను ముగించాలని నిర్ణయించారు. దీంతో విజేడీ సూత్రం ప్రకారం విజయానికి హిమాచల్‌ ప్రదేశ్‌ 288 పరుగులు చేస్తే సరిపోతుంది. అప్పటికే హిమాచల్‌ 299/4 స్కోరుతో ఉండటంతో 11 పరుగుల తేడాతో గెలిచినట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో దేశవాళీ పోటీల్లో తొలిసారి హిమాచల్‌ ప్రదేశ్‌ మొదటి ట్రోఫీని అందుకుంది. హిమాచల్‌ బ్యాటర్లలో ఓపెనర్‌ శుభమ్‌ అరోరా (136 నాటౌట్: 13x4,1x6) అద్భుత శతకం సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అమిత్‌ కుమార్‌ (74), రిషి ధావన్ (42 నాటౌట్) రాణించారు. ప్రశాంత్ చోప్రా 21, నిఖిల్ 18 పరుగులు సాధించారు. తమిళనాడు బౌలర్లలో వాషింగ్టన్‌ సుందర్, సాయి కిషోర్, మురుగన్ అశ్విన్‌, బాబా తలో వికెట్ తీశారు.

శతకంతో ఆదుకున్న సీనియర్‌..

అంతకుముందు తొలుత బ్యాటింగ్‌కు దిగిన తమిళనాడుకు శుభారంభం దక్కలేదు. 40 పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే దినేశ్‌ కార్తిక్‌ (116),  ఇంద్రజిత్ (80) ఎంతో ఓపిగ్గా ఆడుతూ పరుగులు రాబట్టారు. వీరిద్దరూ కలిసి ఐదో వికెట్‌కు 198 పరుగులు జోడించారు. దాదాపు 26 ఓవర్లపాటు బ్యాటింగ్‌ చేశారు. అయితే స్వల్ప వ్యవధిలో కార్తిక్‌, ఇంద్రజిత్‌ పెవిలియన్‌కు చేరారు. ఆ తర్వాత వచ్చిన షారుఖ్‌ ఖాన్‌ (42), కెప్టెన్ విజయ్‌ శంకర్ (22) ధాటిగా ఆడారు. కేవలం 4.5 ఓవర్లలో అర్ధశతక (53) భాగస్వామ్యం నిర్మించారు. దీంతో తమిళనాడు స్కోరు 300 దాటింది. హిమాచల్‌ ప్రదేశ్‌ బౌలర్లలో పంకజ్ జైస్వాల్ 4, రిషి ధావన్ 3.. దిగ్విజయ్‌, వినయ్, సిద్ధార్థ్‌ శర్మ తలో వికెట్ పడగొట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని