రాహుల్‌ 3 వైఫల్యాలతో నిజం మారదుగా!

మూడుసార్లు పరుగులేమీ చేయనంత మాత్రాన కేఎల్‌ రాహుల్‌ టీమ్‌ఇండియా అత్యుత్తమ టీ20 బ్యాట్స్‌మన్‌ కాకుండా పోడని బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాఠోడ్‌ అన్నాడు. ఫామ్‌లేమితో సతమతం అవుతున్న అతడికి అండగా నిలవాలని సూచించాడు. రోహిత్‌తో ఓపెనింగ్‌ చేసేందుకు రాహులే అత్యుత్తమం అన్న...

Published : 18 Mar 2021 01:15 IST

రాహుల్‌కు అండగా నిలవాలన్న బ్యాటింగ్‌ కోచ్‌

అహ్మదాబాద్‌: మూడుసార్లు పరుగులేమీ చేయనంత మాత్రాన కేఎల్‌ రాహుల్‌ టీమ్‌ఇండియా అత్యుత్తమ టీ20 బ్యాట్స్‌మన్‌ కాకుండా పోడని బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాఠోడ్‌ అన్నాడు. ఫామ్‌లేమితో సతమతం అవుతున్న అతడికి అండగా నిలవాలని సూచించాడు. రోహిత్‌తో ఓపెనింగ్‌ చేసేందుకు రాహులే అత్యుత్తమం అన్న కోహ్లీ వ్యాఖ్యలతో ఏకీభవించాడు. మూడో టీ20 ఓటమి తర్వాత ఆయన మీడియాతో మాట్లాడాడు. ఈ మూడు టీ20ల్లో కేఎల్‌ వరుసగా 1, 0, 0కే ఔటైన సంగతి తెలిసిందే.

‘అందరు క్రికెటర్లు ఇలాంటి గడ్డు దశను అనుభవిస్తారు. కానీ టీ20 ఫార్మాట్లో రాహుల్‌ మా అత్యుత్తమ ఆటగాడు. అతడి సగటు 40, స్ట్రైక్‌రేట్‌ 145కు పైగా ఉంది. మూడు సార్లు విఫలమైనంత మాత్రాన అతడు అత్యుత్తమ ఆటగాడన్న వాస్తవం మారిపోదు. ఇలాంటి సమయంలోనే మేం అతడికి అండగా ఉండాలి. అతడు త్వరగా పుంజుకుంటాడన్న నమ్మకం మాకుంది’ అని విక్రమ్‌ రాఠోడ్‌ అన్నాడు.

రాహుల్‌ వైఫల్యానికి బహుశా శారీరక బద్దకం కారణం కావొచ్చని రాఠోడ్‌ అంగీకరించాడు. ఒక మంచి షాట్‌తో అతడు ఫామ్‌లోకి వస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. ‘నిరంతరంగా ఆడకపోతే బద్దకం ఆవహిస్తుందన్నది నిజమే. సరైన మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లభిస్తే మెరుగవుతారు. ఆటగాళ్లను నెట్స్‌లో విపరీతంగా సాధన చేయిస్తున్నాం. అలా శ్రమిస్తూ ఒక మంచి షాట్‌ ఆడితే పుంజుకోవచ్చన్న విశ్వాసం ఉంటే చాలు. వారు ఫామ్‌లోకి వస్తారు. కేఎల్‌ రాహుల్‌ సైతం అంతే’ అని రాఠోడ్‌ పేర్కొన్నాడు.

పిచ్‌ భిన్నంగా ఉండటంతో సరైన‌ స్కోరేదో అంచనా వేయలేక పోతున్నామని విక్రమ్‌ అన్నాడు. బ్యాటింగ్‌ ఆరంభించినప్పుడు బౌన్స్‌ ఇబ్బందిగా మారుతోందని పేర్కొన్నాడు. బౌన్స్‌లోనూ వైవిధ్యం కనిపిస్తోందని వెల్లడించాడు. అందుకే ఇలాంటి పిచ్‌లపై ఎంత స్కోరు చేస్తే మంచిదో అర్థం కావడం లేదన్నాడు. తాము ఆడిన ప్రతి పిచ్‌ భిన్నంగా ఉంటుందన్నాడు. మూడు మ్యాచులు ముగిశాయని ఇకపై మ్యాచుల్లో తొలుత బ్యాటింగ్‌ చేస్తే మెరుగైన స్కోర్‌ చేస్తామని ధీమా వ్యక్తం చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని