Published : 27 Jul 2021 11:25 IST

Tokyo olympics: నేటి భారతం.. శరత్‌ కమల్‌ ఇంటికి.. సాత్విక్‌ జోడీ గెలుపు.. గురి తప్పిన షూటింగ్‌

టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారుల మోస్తరు ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. మంగళవారం ప్రధాన క్రీడల్లో మిశ్రమ ఫలితాలే కనిపించాయి. భారీ ఆశలు పెట్టుకున్న షూటింగ్‌లో నిరాశే ఎదురైంది. టేబుల్‌ టెన్నిస్‌లో భారత్‌ కథ ముగిసింది. బ్యాడ్మింటన్‌, హాకీలో పురుషుల జట్లు విజయాలు నమోదు చేశాయి.

 హాకీలో భారత పురుషుల జట్టు మరో స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసింది. చివరి మ్యాచులో 1-7 తేడాతో ఆసీస్‌ చేతిలో చిత్తుగా ఓడిన టీమ్‌ఇండియా ఈ సారి బలంగా పుంజుకుంది. పూల్‌-ఏ మూడో మ్యాచులో స్పెయిన్‌పై ఘన విజయం సాధించింది. 3-0 తేడాతో ప్రత్యర్థిని మట్టికరిపించింది. సిమ్రన్‌జీత్‌ సింగ్‌ (14వ నిమిషం), రూపిందర్‌పాల్‌ సింగ్‌ (15ని, 51ని) చక్కని గోల్స్‌తో ఆకట్టుకున్నారు.

⇒ భారత్‌ అతిగా ఆశలు పెట్టుకున్న క్రీడ షూటింగ్‌. మిక్స్‌డ్‌ విభాగాల్లో కచ్చితంగా పతకాలు వస్తాయనే విశ్వసించారు. కానీ, 10మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ పోటీల్లో మనుబాకర్‌, సౌరభ్ చౌదరి విఫలమయ్యారు. స్టేజ్‌-1లో 586-26Xతో అగ్రస్థానంలో నిలిచిన వీరు స్టేజ్‌-2లో 380-11Xతో ఏడో స్థానానికి పరిమితం అయ్యారు.

⇒ 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ విభాగంలోనూ పేలవ ప్రదర్శన కొనసాగింది. వలరివన్‌ ఎలవెనిల్‌, దివ్యాన్ష్‌ సింగ్‌ జోడీ 626.5 పాయింట్లతో 12వ స్థానంలో నిలిచింది. అంజుమ్‌ మౌద్గిల్‌, దీపక్‌ కుమార్‌ జంట 623.8 పాయింట్లతో 18వ స్థానానికి పరిమితమైంది.

⇒ పురుషుల టేబుల్‌ టెన్నిస్‌ సింగిల్స్‌ మూడో రౌండ్లో భారత వెటరన్‌ శరత్‌ కమల్‌ ఓటమి పాలయ్యాడు. ప్రస్తుత ప్రపంచ, ఒలింపిక్‌ విజేత మా లాంగ్‌తో జరిగిన పోరులో 1-4 తేడాతో పరాజయం చవిచూశాడు. తొలి గేమ్‌లో 7-11తో వెనకబడిన అతడు 11-8తో రెండే గేమ్‌ కైవసం చేసుకున్నాడు. మూడో గేమ్‌లో ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డా 13-11తో లాంగ్‌దే విజయం. ఆ తర్వాత అతడు మరింత విజృంభించి 11-4, 11-4తో మ్యాచ్‌ సొంతం చేసుకున్నాడు.

⇒ బ్యాడ్మింటన్‌లో పురుషుల డబుల్స్‌లో భారత్‌ స్ఫూర్తిదాయక ప్రదర్శన చేస్తోంది. సాత్విక్‌ సాయిరాజ్‌, చిరాగ్‌ శెట్టి జోడీ గ్రూప్‌-ఏ మ్యాచులో విజయం సాధించింది. లేన్‌ బెన్‌, వెండీ సేన్‌తో జరిగిన పోరులో 2-0తో ఘన విజయం సాధించింది. 21-17, 21-19తో రెండు గేములను కైవసం చేసుకుంది. కాగా, సెయిలింగ్‌ పోటీల్లో శరవణన్‌ విష్ణు, నేత్ర తమ సామర్థ్యం మేరకు ఆడుతున్నారు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని