ENG vs AUS: గ్రౌండ్‌లోకి దూసుకొచ్చిన నిరసనకారులు.. ఎత్తుకెళ్లి బౌండరీ అవతల పడేసిన బెయిర్‌ స్టో

ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా (ENG vs AUS) మధ్య బుధవారం యాషెస్‌ రెండో టెస్టు ప్రారంభమైంది.  తొలి సెషన్‌ ప్రారంభమైన కొద్దిసేపటికే ఇద్దరు నిరసనకారులు భద్రతా సిబ్బంది కళ్లుగప్పి మైదానంలోకి దూసుకొచ్చారు.

Updated : 28 Jun 2023 20:00 IST

ఇంటర్నెట్ డెస్క్‌: లార్డ్స్‌ మైదానం వేదికగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా (ENG vs AUS) మధ్య బుధవారం యాషెస్‌ రెండో టెస్టు ప్రారంభమైంది. తొలి సెషన్‌ ప్రారంభమైన కొద్ది సేపటికే మైదానంలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు నిరసనకారులు భద్రతా సిబ్బంది కళ్లుగప్పి మైదానంలోకి దూసుకొచ్చారు. దీంతో ఆటగాళ్లతోపాటు స్టేడియంలో మ్యాచ్‌ను వీక్షిస్తున్న ప్రేక్షకులు గందరగోళానికి గురయ్యారు. నిరసనకారులు మైదానంలోకి చొచ్చుకెళ్లిన విషయాన్ని గమనించిన భద్రతా సిబ్బంది వారిని పట్టుకునేందుకు పరుగెత్తుకొచ్చారు. అంతలోపే ఈ నిరసనకారులు తమ వెంట తెచ్చుకున్న ఆరెంజ్‌ కలర్‌ పౌడర్‌ని మైదానంలో చల్లారు.  

ఇంగ్లాండ్ వికెట్ కీపర్‌ జానీ బెయిర్‌ స్టో  (Jonny Bairstow) నిరసనకారుల్లో ఒకరిని అమాంతం ఎత్తుకెళ్లి బౌండరీ అవతల పడేశాడు. మరొక నిరసనకారుడిని భద్రతా సిబ్బంది మైదానం నుంచి బయటకు తీసుకెళ్లారు. మైదానంలోకి దూసుకెళ్లడానికి యత్నించిన మరో నిరసనకారుడిని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత సిబ్బంది మైదానాన్ని శుభ్రం చేశారు. అనంతరం మ్యాచ్‌ యథావిధిగా కొనసాగింది. నిరసనకారుల ఆందోళన వల్ల దాదాపు ఆరు నిమిషాలపాటు ఆటకు అంతరాయం కలిగింది. తొలి సెషన్‌ రెండో ప్రారంభానికి ముందు ఈ సంఘటన జరిగింది. ఈ నిరసనకారులను ‘జస్ట్ స్టాప్ ఆయిల్’ అనే గ్రూప్‌నకు చెందిన కార్యకర్తలుగా గుర్తించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఈ గ్రూప్‌ కొంతకాలంగా ఉద్యమిస్తోంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు