IND vs SL: ఫాస్టెస్ట్‌ బాల్‌.. బుమ్రా రికార్డును బద్ధలు కొట్టిన ఉమ్రాన్‌ మాలిక్

టీమ్‌ఇండియా పేస్‌ సంచలనం ఉమ్రాన్‌ మాలిక్ మరో రికార్డును నమోదు చేశాడు. బుమ్రా పేరిట ఉన్న అత్యంత వేగవంతమైన బంతి రికార్డును ఈ ఫాస్ట్‌బౌలర్‌ బద్దలు కొట్టాడు. 

Published : 04 Jan 2023 17:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్: వేగవంతమైన బంతులు సంధిస్తూ ప్రత్యర్థి జట్ల బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు టీమ్‌ఇండియా యువ పేస్ సంచలనం ఉమ్రాన్‌ మాలిక్‌. క్రికెటర్‌గా కెరీర్‌ ఆరంభంలో వేగంపైనే దృష్టి పెట్టిన అతడు.. ఇప్పుడు సరైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో బౌలింగ్‌ చేస్తున్నాడు. ‘అత్యుత్తమంగా బౌలింగ్‌ చేయడంపైనే నా దృష్టి. ఒకవేళ అదృష్టం కలిసి వస్తే మాత్రం అత్యంత వేగవంతమైన బంతి వేసిన  అక్తర్‌ రికార్డును బద్దలు కొడతా’ అని శ్రీలంకతో మూడు టీ20 సిరీస్‌లకు ముందు ఉమ్రాన్ అన్న మాటలివీ. అన్నట్టుగానే అంతర్జాతీయ క్రికెట్‌లో అక్తర్‌ నెలకొల్పిన 161.3 కి.మీ. వేగవంతమైన బంతి రికార్డును బద్దలు కొట్టే దిశగా  ముందుకుసాగుతున్నాడు ఈ 23 ఏళ్ల జమ్మూ కశ్మీర్‌ పేసర్‌.

మంగళవారం శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో నాలుగు ఓవర్లు బౌలింగ్‌ చేసిన అతడు 27 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.   తొలుత చరిత్ అసలంక తర్వాత డాసున్‌ శనకను పెవిలియన్‌కు చేర్చాడు. ఉమ్రాన్ వేసిన 16.4 ఓవర్‌కు శనక.. చాహల్‌కి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఆ బంతి వేగం ఎంతంటే.. 155 కి.మీ. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత పేసర్లు విసిరిన అత్యంత వేగవంతమైన బంతి ఇదే.  అంతకుముందు ఈ రికార్డు జస్ప్రీత్‌ బుమ్రా (153.36 కి.మీ) పేరిట ఉండేది. ఇప్పుడా రికార్డును ఉమ్రాన్‌ బద్దలు కొట్టాడు. ప్రస్తుతం ఈ జాబితాలో ఉమ్రాన్ మాలిక్‌ అగ్రస్థానంలో ఉండగా.. బుమ్రా రెండో స్థానంలో నిలిచాడు. మహ్మద్‌ షమి (153.3 కి.మీ.), నవదీప్‌ సైని (152.85 కి.మీ.) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని