Kohli : అర్థం చేసుకోవడం కష్టం.. ఆర్‌సీబీ కెప్టెన్సీని త్యజించడంపై కోహ్లీ వ్యాఖ్యలు

గత సీజన్‌ ఐపీఎల్‌ పోటీలు ముగిసిన తర్వాత రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) కెప్టెన్సీకి ...

Published : 25 Feb 2022 01:32 IST

ఇంటర్నెట్ డెస్క్‌: గత సీజన్‌ ఐపీఎల్‌ పోటీలు ముగిసిన తర్వాత రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ స్పందించాడు. నాయకత్వ బాధ్యతలను వదులుకోవడం వంటి కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు క్రికెటర్లు ఏమనుకుంటున్నారో అర్థం చేసుకోవడం సాధారణ పౌరులకు కష్టమని అభిప్రాయపడ్డాడు. ‘‘అలాంటి పరిస్థితుల్లో ప్రజలు లేనప్పుడు ఇటువంటి నిర్ణయాలను అర్థం చేసుకోవడం కష్టతరం. బయట నుంచి భారీ అంచనాలు పెట్టుకుంటారు. ‘ఇది ఎలా జరిగింది.. మేమంతా షాక్‌కు గురయ్యాం..’ వంటి వ్యాఖ్యలు వస్తుంటాయి. అయితే నా వరకు ఎలాంటి ఆశ్చర్యం లేదు. అప్పటికే అభిమానులకు వివరించాను. నాకు కొంచెం విరామం కావాలి. పనిభారం నిర్వహణ కోసమే నిర్ణయం తీసుకున్నా. ఇక అంతటితో ముగిసిపోయింది’’ అని పేర్కొన్నాడు. 

ఐపీఎల్‌ ప్రారంభం నుంచి మొన్నటి వరకు జరిగిన టోర్నమెంట్లలో ఒక్కసారి కూడా ఆర్‌సీబీ కప్‌ సాధించలేకపోయింది. సీనియర్లు ఉన్నప్పటికీ ఛాంపియన్‌గా నిలవడంలో విఫలమైంది. ఇటువంటి సమయంలో కోహ్లీ కెప్టెన్సీని వదిలిపెట్టడంతో విభిన్న వాదనలు వినిపించాయి. అయితే వాటన్నింటినీ కొట్టిపడేశాడు. ‘‘బయట జరుగుతున్న వాదోపవాదాల గురించి నేను ఆలోచించను. నా జీవితం సింపుల్‌గా ఉండేలా చూసుకుంటాం. ఎప్పుడైతే నిర్ణయం తీసుకోవాలని భావిస్తానో... అప్పుడే ఓ నిర్ణయానికొచ్చా. దానిని ప్రకటించా. కొన్నాళ్లు గడిచాక వెనక్కి తిరిగి చూసుకుంటే నాణ్యతే ముఖ్యం కాని ఎన్ని మ్యాచ్‌లు ఆడామనేది ముఖ్యం కాదని అనుకుంటా. అయితే నేనెవరిని..? నేనెక్కడ ఉన్నాను..? అని ఎప్పుడూ అనుకుంటూ ఉంటా. నేను ఎల్లవేళలా నాలానే ఉంటా. అందుకేనేమో అభిమానులతో చాలా క్లోజ్‌గా కనెక్ట్‌ కాగలిగాను’’ అని కోహ్లీ వివరించాడు. కష్టపడటంలో గణాంకాలను చూడాలి కానీ, అమలు పరచడంలో నాణ్యతే కీలకమని చెప్పాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని